తానా ఆధ్వర్యంలో వెయ్యి మంది రైతులకు పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్ల పంపిణీ
ABN , Publish Date - Mar 16 , 2026 | 07:56 AM
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని వీకే ఫంక్షన్ హాల్‌లో తానా ఆధ్వర్యంలో జరిగిన ‘రైతు కోసం’ కార్యక్రమంలో వెయ్యి మంది అన్నదాతలకు పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లను పంపిణీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని వీకే ఫంక్షన్ హాల్‌లో తానా ఆధ్వర్యంలో ‘రైతు కోసం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1000 మంది రైతులకు రూ.25 లక్షల విలువ గల పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లను పంపిణీ చేశారు. తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి మార్గదర్శకత్వంలో, తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు అభినందనలతో ఈ సేవా కార్యక్రమం జరిగింది.
‘రైతు కోసం’ కార్యక్రమానికి అప్కాబ్ (APCOB) చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందించారు. తానా చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు తానాను ప్రశంసించారు. రైతులకు అవసరమైన పరికరాలు అందించడం ద్వారా అన్నదాతలకు మద్దతుగా నిలుస్తున్న తానా సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన అల్బనీ అగ్ని ప్రమాదం సమయంలో తానా టీమ్‌స్క్వేర్ వెంటనే స్పందించి బాధిత విద్యార్థులకు సాయం అందించిన వైనాన్ని ప్రస్తావిస్తూ సంస్థ సేవాభావాన్ని కొనియాడారు.

ఈ సందర్భంగా తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ రైతులు దేశానికి అన్నదాతలు అని పేర్కొన్నారు. ‘మన దేశానికి రైతు అన్నదాత. రైతు కష్టపడితేనే మనకు అన్నం దొరుకుతుంది. రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో వారికి కొంతైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో తానా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రైతులకు అందిస్తున్న పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు వారి వ్యవసాయ పనులను సులభతరం చేస్తాయని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకటిగా చేర్చి సమాజానికి తిరిగి ఇవ్వడం తానా లక్ష్యం. విద్య, ఆరోగ్యం, రైతుల సంక్షేమం వంటి అనేక రంగాల్లో తానా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. రైతులు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను తానా భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా చేపడుతుంది’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తణుకు ప్రాంతానికి చెందిన పలువురు స్థానిక నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు అందజేయడంతో తానా సేవలను స్థానిక ప్రజలు అభినందించారు. రైతులకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు.






ఈ వార్తలు కూడా చదవండి:
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. కువైత్‌లో రక్తదాన శిబిరం
నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్యోత్సవం