Share News

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. కువైత్‌లో రక్తదాన శిబిరం

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:39 PM

జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆర్భాట కార్యక్రమాలకు బదులుగా సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవం..  కువైత్‌లో రక్తదాన శిబిరం
Janasena blood donation camp Kuwait

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి గతంలో కంటే భిన్నంగా నిర్వహించారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైత్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆర్భాటంగా కాకుండా సేవాదృక్పథాన్ని ప్రతిబింబిస్తూ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ద్వారా జనసైనికులు తమ అభిమాన పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు.

ప్రస్తుతం కువైత్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సభలు సమావేశాల నిర్వహణపై ఉన్న నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో తాము స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని కువైత్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం తాము సాంస్కృతిక కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహిస్తామని అన్నారు. కానీ ఈసారి దాడుల ప్రతికూల పరిస్ధితుల వల్ల దాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు.

Gulf.jpg


సేవకు మారుపేరుగా నిలిచిన జనసేన పార్టీ నాయకులుగా తాము పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను అనుసరించి ఆయన బాటలోనే నడుస్తూ ప్రస్తుతం కువైత్‌లో రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని పార్టీ నాయకులు అంజన్ కుమార్, ఆకుల రాజేష్, దండు చంద్రశేఖర్, జగిలి ఒబిలేషు, ఇమ్మిడి శెట్టి సూర్యలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు గల్ఫ్ సాధికారత సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీ నాయకులు కుదరవల్లి సుధాకర్ రావు, తెలుగు దేశం పార్టీ కువైత్ అధ్యక్షులు మద్దిన ఈశ్వర్ నాయుడు, కొల్లి ఆంజనేయులు కూడా పాల్గొని తెలుగుదేశం పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం, జనసేనల మధ్య ఉన్న మైత్రి బలమైందని వారు వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ నాయకులు గంగారపు చంద్రశేఖర్, ప్రదీప్, గిడుగు రాంబాబు, గిడుగు యేసు బాబు, యూత్ వింగ్ అల్లం ప్రేమ్ రాయల్, కొమ్మినేని బాలాజీ, రెడ్డిమని తదితరుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు కూటమి నాయకులతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్యోత్సవం

ఆటా మహాసభలు.. మేరీల్యాండ్ గవర్నర్‌కు ఆహ్వానం

Updated Date - Mar 15 , 2026 | 06:48 PM