సౌదీలో దద్దరిల్లిన తెలుగు భాషా దినోత్సవం
ABN , Publish Date - Sep 24 , 2026 | 09:10 AM
సౌదీ అరేబియాలోని ప్రధాన నగరమైన రియాధ్‌లో తెలుగు ప్రవాసీ లోకం మరోసారి కదం తొక్కింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలోని ప్రధాన నగరమైన రియాధ్‌లో తెలుగు ప్రవాసీ లోకం మరోసారి కదం తొక్కింది. తిరునాళ్ల తీర్థయాత్రకు వచ్చినట్లుగా తండోపతండాలుగా తరలివచ్చి తెలుగుతనంతో తన్మయత్వం చెందింది.. జజ్జనకరి జనారే అంటూ జై కొట్టింది.
బుధవారం సౌదీ అరేబియా తెలుగు సంఘం సాటా (సి) తెలుగు భాషా దినోత్సవం పేర నిర్వహించిన తమ 5వ వార్షిక కార్యక్రమం మరోసారి తెలుగు పండుగ వాతావరణాన్ని ఆవిష్కరించింది. చేయెత్తి జై కొట్టు తెలుగోడా..అంటూ సాక్షాత్తు రాయబారి సైతం పులకరించారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని తెలుగు ప్రవాసీయులు నిరూపించారని కొనియాడారు.
సాటా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న రాయబారి విపుల్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయులలో సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల పాత్ర ప్రముఖమైందని ప్రశంసించారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయులలో తెలుగు ప్రవాసీయులు ఒక ప్రత్యేక విశిష్ఠత కల్గి ఉన్నారని పేర్కొన్నారు.
న్యూ ఢిల్లీ విదేశాంగ మంత్రిత్వ శాఖలో గల్ఫ్ విభాగం, దుబాయి, ఖతర్ దేశాలలో పని చేసిన తాను రియాధ్‌లో చూస్తున్న క్రియాశీలకమైన తెలుగు సమాజాన్ని మరో చోట చూడలేదని అన్నారు.

గల్ఫ్ దేశాలన్నింటిలో నివసిస్తున్న భారతీయులందరికీ తెలుగు ప్రవాసీయులు ఆదర్శమని రాయబారి వ్యాఖ్యానించారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలలో ముందుండడం ద్వారా మాతృభూమికి నిజమైన సేవ చేస్తున్నారని విపుల్ అన్నారు.
తెలుగు ప్రవాసీ మహిళల కార్యదక్షత, సమర్థతకు ప్రతిరూపంగా ఉన్నారని కూడా ఆయన ప్రశంసించారు. సాటాలో మహిళలకు పెద్ద పీఠ వేయడాన్ని రాయబారి స్వాగతించారు. సౌదీలోని భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాయబారి పాల్గొనడం ఇదే ప్రప్రథమం.
సాటా ప్రతినిధులు రంజీత్ చిత్తలూరి, జానీ బాషా, ముజ్జమ్మీల్ షేక్, సుచరిత, చేతన, ఎర్రన్న, యాఖూబ్, నాగరాజు, సత్తిబాబు, వెంకటరావు తదితరులు సాటా కార్యకలాపాలను వేర్వేరుగా వివరించారు.
పరాయి దేశంలో పిల్లలను మానసికంగా అభివృధ్ధి చేయాలని, సమాజంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ప్రవాసీ ప్రముఖులు మోబీన్, ప్రశాంత్ లోకేలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రేరణ టోస్ట్ మాస్టర్ బాలబాలికల కోసం నెలకొల్పిన జవేల్ క్లబ్‌లో చేరడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పిల్లలు మాట్లాడే తీరు గురించి వారు వివరించారు. అక్షయ, రితిక అనే బాలికలు సభా వేదికపై ప్రసంగించిన తీరుకు సభికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సాటా అంటే సహజంగా గుర్తుకు వచ్చేది సాధికార మహిళలు మాత్రమే.. మహిళా నాయకురాళ్లు సుచరిత, చేతన, రమ్య, ఉషా, సింధూ, మాధవి లత, పెద్ద భారతీ, శ్రీ దేవి, పోకూరి కవిత, లావణ్య, చందన, కాకమూరి లక్ష్మి, కవిత సత్తిబాబు, చిన్న భారతీలు కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేశారు. గోధా శ్రీ, శ్రీనివాస్ చరణ్‌లు చిన్నారుల నృత్య కార్యక్రమానికి మార్గనిర్దేశం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రతిసారీ దర్శకత్వం వహించే మండవ అక్షిత ఈసారి రియాధ్‌లో లేకపోవడంతో ఆమె వెలితి కనిపించింది.
ప్రముఖ గాయకులు రఘు కుంచె, మాళవికలు పాడిన పాటలకు యువత ఉర్రూతలూగారు, కేరింతలు కొట్టారు. విరామం లేకుండా చిన్నారులు వేసిన చిందులకు వారి తల్లిదండ్రులు మురిసిపోయారు. షౌకత్, నాగార్జున, నరేంద్ర, నాజిం, హబీబ్‌ల బృందం వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికింది.
భారతదేశంలో కంటే కూడా ఉత్సాహభరితంగా, ఉద్వేగభరితంగా సౌదీలో క్రికెట్ పోటీలు సాగుతాయి. తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు ముందు రెండు వారాలు అత్యంత ఆసక్తికరంగా సాటా క్రికెట్ కప్‌ను రియాధ్ నగరంలోని ప్రఖ్యాత స్పోర్ట్స్ దుకాణమైన స్పోర్ట్స్ సెంట్రల్ సౌజన్యంతో నిర్వహించగా విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు. నెల్లూర్ ఎక్స్ ప్రెస్ జట్టు విజేతగా నిలిచింది.

సభికులందరికీ మూడు పూటలా భోజనం వడ్డించారు. పక్కా పల్లెరుచితో నోరూరించే కమ్మని తెలుగు వంటకాలు చేసే ఆతిథ్యం గ్రూప్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గోంగూరతో సహా వివిధ రకాల భోజనాలు వడ్డించింది. రెండు వేల మందికి భోజన వసతి ఏర్పాటు చేసినా సరిపపోకపోవడంతో అదనపు వంటలు చేసి వడ్డించామని నిర్వాహకులు తెలిపారు.
ఉదయం నుండి రాత్రి వరకు కొనసాగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సుదూర ఎడారి ప్రాంతాలలో నివసిస్తున్న అనేక తెలుగు ప్రవాసీ కుటుంబాలు వందల కిలో మీటర్ల దూరం ప్రయాణించి వచ్చాయి.
ఈ వార్తలనూ చదవండి:
మానవతా సేవలో AAA ముందడుగు.. పెన్సిల్వేనియాలో రక్తదాన శిబిరం..
ఆస్టిన్ పాఠశాల.. అద్భుతమైన పునఃప్రారంభం