Share News

న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో తెలంగాణ మూలాలున్న మహిళ

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:14 PM

తెలంగాణ మూలాలున్న సరితా కోమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో నిలిచారు. నేరాలు, మోసాలకు అడ్డుకట్ట వేయడమే తన లక్ష్యమని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో తెలంగాణ మూలాలున్న మహిళ
Saritha Komatireddy

ఇంటర్నెట్ డెస్క్: ఆమె తెలంగాణ మూలాలున్న మహిళ. అమెరికాలో న్యాయవాదిగా ఎందరో నేరస్తులకు శిక్షలు పడేలా చేశారు. అల్ ఖైదా, ఐసిస్‌ టెర్రరిస్టుల ఆట కట్టించారు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మమైన న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి రేసులో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో రంగంలోకి దిగిన ఆమె పేరు సరితా కోమటిరెడ్డి. కరీంనగర్ ఆమె స్వస్థలం.

గతంలో సరిత అమెరికా మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ డీఈఏలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా విశేష సేవలందించారు. అటార్నీ జనరల్‌గా తన లక్ష్యం ఏమిటో, అసలు న్యాయవాదిగా మారాలన్న ఆలోచన ఎలా కలిగిందో ఆమె జాతీయ మీడియాతో పంచుకున్నారు. అటార్నీ జనరల్‌గా ఎన్నికైతే తాను నేరాలు, మోసాల కట్టడిపై దృష్టి పెడతానని చెప్పారు. న్యూయార్క్ వీధుల్లో నివసించే వారి సమస్యల పరిష్కారానికీ కృషి చేస్తానని అన్నారు.


సెప్టెంబర్ 11 దాడులే తనను ప్రజాసేవ వైపు నడిపించాయని సరితా కోమటిరెడ్డి చెప్పారు. ‘9/11 దాడులు మళ్లీ జరగకుండా ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఉగ్రవాదం ఆటకట్టించే లాయర్‌గా మారాలని అనిపించింది’ అని చెప్పారు. హార్వర్డ్ కాలేజ్, హార్వర్డ్ లా స్కూల్‌లో చదువులు పూర్తయ్యాక న్యూయార్క్‌కు తిరిగి వచ్చిన ఆమె ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా తన ప్రయాణం ప్రారంభించారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నేతలు, ఐసిస్ సభ్యులకు తగిన శిక్ష పడేలా చేయగలిగారు.

డ్రగ్స్ మహమ్మారి భరతం పట్టే బాధ్యతలు కూడా స్వీకరించిన ఆమె పలువురు కార్టెల్ గ్యాంగు నేతలు, లంచాలు తీసుకున్న మెక్సికో ప్రభుత్వ అధికారలనూ కటకటాల వెనక్కు నెట్టారు. ఈ అనుభవంతో ఆమె జోబైడెన్ ప్రభుత్వంలో డ్రగ్స్ నియంత్రణ సంస్థ డీఈఏలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా పనిచేశారు. దాదాపు ఏడాది పాటు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆమె తన సామర్థ్యాలను నిరూపించుకున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో ఉన్న ఆమె లాయర్‌గా తనకున్న సుదీర్ఘ అనుభవంతో రాష్ట్రానికి సేవ చేసేందుకు నిర్ణయించుకున్నారు.


సరితా కోమటిరెడ్డి బ్రూక్లిన్‌లో జన్మించారు. ఆమె తల్లి హైదరాబాద్ వాస్తవ్యురాలు కాగా, తండ్రి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. ఇప్పటికీ ఆమె కుటుంబం స్వస్థలానికి వచ్చివెళుతుంటుంది. తమ మూలాలు ఏమిటో తన పిల్లలు తెలిసి ఉండాలని సరిత చెప్పారు. అమెరికాలో ఓ జీవితాన్ని నిర్మించుకునేందుకు తాము ఎంత కష్టపడిందీ వారికి తెలిసి ఉండాలని అన్నారు. కష్టించి పనిచేయడం, సమాజానికి సేవ చేయడం వంటి విలువలు తనకు కుటుంబం నుంచి అందాయని చెప్పారు. అవే తనకు ఎప్పటికీ మార్గదర్శకమని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

AAVGF ఆధ్వర్యంలో అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో 2K వాక్

ఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువ

Updated Date - Oct 29 , 2026 | 06:33 PM