పశ్చిమాసియా, తూర్పు ఆసియా దేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రాధాకృష్ణా బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Sep 17 , 2026 | 07:17 PM
భారతదేశానికి ఆర్థిక పట్టుకొమ్మలుగా భావించే పశ్చిమాసియా, దూర ప్రాచ్య దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రావి రాధాకృష్ణా గురువారం మంగళగిరిలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భారతదేశానికి ఆర్థిక పట్టుకొమ్మలుగా భావించే పశ్చిమాసియా, దూర ప్రాచ్య దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రావి రాధాకృష్ణా గురువారం మంగళగిరిలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రవాసీ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీఎస్ చైర్మన్ డాక్టర్ వేమూరు రవి, రాష్ట్ర బ్రహ్మాణ పరిషత్ చైర్మన్ కె.బుచ్చి రాంప్రసాద్, తెలుగుదేశం పార్టీ ఎన్నారై కేంద్ర కార్యవర్గ అధ్యక్షుడు డాక్టర్ పి. గురురాజ, పార్టీ సీనియర్ ప్రవాసీ నాయకులు చప్పిడి రాజశేఖర్, సౌదీ అరేబియా, కువైత్ తెలుగుదేశం ప్రవాసీ ప్రముఖులు జానీ బాషా, పార్టీ నాయకులు ముజ్జమ్మీల్, నాగరాజు, కుదరవెల్లి సుధాకర్ రావులు పాల్గొన్నారు.

గల్ఫ్, అరబ్బు, ఇజ్రాయిల్, సింగపూర్, మలేషియా, జపాన్, దక్షిణ కొరియా, చైనా, తైవాన్ తదితర దేశాలలో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన వ్యవహారాలను పరిశీలిస్తూ ఈ దేశాలతో మైత్రిని బలోపేతం చేసే ప్రభుత్వ ప్రతినిధిగా రాధాకృష్ణ వ్యవహరిస్తారు.
గతంలో ఒక్క గల్ఫ్ దేశాలతో కూడిన పశ్చిమాసియా దేశాలకు మాత్రమే ఈ రకమైన ప్రత్యేక ప్రతినిధి హోదా ఉండగా దానికి దుబాయిలోని ప్రవాసీయుడు సినీ నటుడు అక్కినేని నాగార్జున వియ్యంకుడు, జుల్ఫీ రవ్దీజిను అప్పటో వైయస్ జగన్ ప్రభుత్వం నియమించింది. జుల్ఫీ కూతురు జైనబ్‌ను అక్కినేని అఖిల్ వివాహమాడారు.
సౌదీ అరేబియాలో చమురు రంగం పారిశ్రామికవేత్త అయిన రాధాకృష్ణ స్వస్థలం కోనసీమ జిల్లా సఖీనేటిపల్లి మండలం. అధికారం లేనప్పుడు తెలుగుదేశం పార్టీకి గట్టి అండగా నిలబడిన నాయకుడిగా ఆయనకు పేరుంది.




ఈ వార్తలనూ చదవండి:
తానా, తామా ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ వర్క్‌షాప్
ఎల్లల ఆవల తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా