Share News

ఎల్లల ఆవల తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా

ABN , Publish Date - Sep 16 , 2026 | 07:41 PM

గల్ఫ్‌లో అసంఖ్యాకంగా ఉన్న అన్ని వర్గాల వారిని టీడీపీ ఎన్నారై కార్యవర్గం ఆకర్షించడంతో పాటు అభిమానులను ఉత్తేజపరిచి వారిని కార్యకర్తలుగా మార్చి, కార్యోన్ముఖులుగా చేసి పార్టీకి నూతన జవసత్వాలు చేకూర్చే దిశగా అడుగులు వేయాలి.

ఎల్లల ఆవల తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా
TDP in Gulf

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: అవకాశాలను అన్వేషించుకుంటూ ఆకాశమే హద్దుగా విదేశాలకు వెళ్తున్న భారతీయ యువత సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీనికి తోడుగా విరివిగా అందుబాటులో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం నిజంగా కుగ్రామంగా మారిపోయిన నేపథ్యంలో మాతృభూమితో దూరం తగ్గి దగ్గరితనం పెరుగుతోంది.

విద్యాధికులు, వృత్తిపరమైన నైపుణ్యం కల్గిన వారు ఎక్కువగా అమెరికా, ఐరోపా లేదా ఆస్ట్రేలియాలకు వెళ్తుండగా తమ కాయకష్టాన్ని నమ్ముకున్న సగటు యువకులందరూ అరేబియా ఎడారులకు వెళుతుంటారు. భారత్‌కు ఇది అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం కావడం ఇందుకు ఓ ప్రధాన కారణం. దీని వలన అక్కడ నివసిస్తున్న భారతీయుల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాల్లో కంటే కూడా ఎక్కువ అంటే అశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 207 దేశాలలో సుమారు 1 కోటి 34 లక్షల 34 వేల మంది భారతీయులు నివసిస్తుండగా అందులో దాదాపు ఒక కోటి మంది ఒక్క అరేబియన్ గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్నారని అధికారిక గణంకాలు వెల్లడిస్తున్నాయి.


చారిత్రక కారణాల వలన కేరళ నుంచి వలసలు మొదలు కావడంతో వారు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. కేరళలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు అన్ని గల్ఫ్ దేశాలలో పటిష్ఠమైన యంత్రాంగం ఉంది. గల్ఫ్ ప్రవాసీయులు అసెంబ్లీ, పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. సగటు ప్రవాసీయుడి సమస్యల పరిష్కారం, మానవీయ సహాయం కోణంతో మలయాళీ ప్రవాసీనాయకులందరూ తమ రాష్ట్ర ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. అదే విధంగా, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వివిధ వర్గాలు నిబద్ధతతో అక్కడ పని చేస్తున్నాయి. దుబాయికి చెందిన ఒక ప్రవాసీకి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ముఖ్యమంత్రి పదవి ఇవ్వచూపినా ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో భగవంత్ మాన్‌కు ఇచ్చారనే ప్రచారం ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, వాస్తవానికి తెలుగుదేశం అధినేత స్వర్గీయ ఎన్టీరామరావు జూలై 1984లో అమెరికా పర్యటన జరిపినప్పటి నుంచీ ప్రవాసాంధ్రులకు చేరువ అయినా దాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచారు. కాకర్ల సుబ్బారావు, సత్యనారాయణ మొదలగు నిష్ణాతులను వ్యవసాయ, వైద్య రంగాల అభివృద్ధికి వినియోగించారు. కానీ అప్పట్లో ప్రధాని పి.వి.నర్సింహారావు కాంగ్రెస్ అమెరికాలో ఉన్న గడ్డం ఆత్మచరణ్ రెడ్డిని తీసుకువచ్చి నిజామాబాద్ లోక్‌సభ నుంచి గెలిపించారు. ఆ తర్వాత ఎన్నారై మధుయాష్కి గౌడ్ కూడా అదే స్థానం నుంచి లోక్ సభలో అడుగు పెట్టారు. అంతకు ముందు రాజీవ్ గాంధీ తన సౌదీ పర్యటనలో కలిసిన డాక్టర్ జె.గీతారెడ్డిని రాజకీయాలలో ఆహ్వానించి ప్రోత్సహించగా ఆమె సుదీర్ఘ కాలం ప్రజాజీవితంలో ఉన్నారు.


ఐ.టి పట్ల మక్కువ ఉండడంతో చంద్రబాబు నాయుడు తనను కలిసిన అనేక మందిని రాజకీయాలలో ప్రోత్సహించగా, కృష్ణా జిల్లాకు చెందిన కోమటి జయరాం బాహ్య ప్రచారంలో వచ్చినా ఆయన సైకిల్ గుర్తుపై పోటీ చేయలేకపోయారు. అదే సమయంలో దుబాయి నుంచి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు కూడా ఒక దశలో రాజ్యసభ సభ్యత్వం వచ్చి చేజారిపోయింది. ఒమాన్‌లో సుదీర్ఘకాలం పని చేసిన ఎ.పి.జితేందర్ రెడ్డి కూడా చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాలలో ప్రవేశించి తెలుగుదేశం పక్షాన పోటీ చేసి పరాజయం పొందారు. కానీ ఆ తర్వాత రెండు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయిన విషయాన్ని మరిచిపోకూడదు. వీరెవరూ కూడా ప్రపంచ నలుమూలలలో ఉన్న ప్రవాసీయులను ఒక వేదికపైకి తీసుకోరాలేకపోయారు.

ఆ తరువాత నారా లోకేశ్ అమెరికాలో తన ప్రత్యక్ష అనుభవం ద్వారా ఆయన ప్రవాసీయుల ప్రాధాన్యాన్ని గుర్తించి ఆ వైపు దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఫలితంగా, రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంఖ్యలో ఎన్నారైలకు తెలుగుదేశం టికెట్లు దక్కాయి.

అమెరికాలో ఉంటున్న ఎన్నారైల సంఖ్య (భారత పాస్ పోర్టు కల్గి, ఓటు హక్కు కల్గిన వారు) 23,11,484. గల్ఫ్‌లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (43,26,248) లేదా సౌదీ అరేబియా (27,47,551) దేశాలతో పోల్చితే ఈ సంఖ్య తక్కువ అయినా ఎన్నారై అనే ప్రస్తావన వచ్చే సరికి అమెరికన్ ఎన్నారైలు అగ్రస్థానం అక్రమిస్తున్నారు. దీనికి అర్థబలం కూడా ఒక ప్రధాన కారణమని చెప్పకతప్పదు.


గల్ఫ్ దేశాల విషయానికి వచ్చేసరికి, అక్కడకు వెళ్లే వారిలో ఎక్కువ మంది అంతంతమాత్రం ఆర్థికస్థితిగతులు, వృత్తిపరమైన అంతంత అర్హతలు కల్గిన వారు, సామాన్య సామాజిక నేపథ్యాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడ పని చేసే ఒక లేబర్ లేదా డ్రైవర్ సంపాదనపై స్వదేశంలో ఆధారపడ్డ వారు కనీసం అయిదు నుంచి ఎనిమిది మంది వరకూ ఉంటారు. ఎడారులలో వీరు కష్టపడి సంపదిస్తే గానీ స్వదేశంలో వారి కుటుంబాల్లో పొయ్యి వెలుగదు కాబట్టి వీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ రకంగా కొన్ని జిల్లాలలోని నియోజకవర్గాలలో గెలుపుపోటములను ప్రభావితం చేసే శక్తి వీరికి ఉంది.


కానీ దురదృష్టవశాత్తూ గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంధ్ర ప్రముఖులందరూ కూడా దశ, దిశా తెలియక గుంపులో గోవిందగా ఉన్నారు. స్వయంకృతాపరాధం దీనికి కారణం. గల్ఫ్ దేశాలలో ప్రప్రథమంగా మహానాడును నిర్వహించిన ములకల సుబ్బారాయుడు (కువైత్) గురించి తెలుసుకొని తిరుపతి మహానాడు (2007) లో ప్రత్యెకంగా ప్రస్తావించి చంద్రబాబు నాయుడు అభినందించగా ఆయన అనామకుడిగా మిగిలారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులుగా చెప్పుకునే వారు సగటు ప్రవాసీ సమస్యలపై గళం విప్పితే ఒట్టు.

మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి ఫోటోలను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం వరకే మిగిలిపోతున్నారు. పల్లకీలో ఎక్కడం కోసం పాకులాడుతూ దాన్ని మోసే అత్యధికులను పూర్తిగా విస్మరిస్తున్నారు. బలమైన ఈ వర్గాలకు చేరువ కావడానికి ఏ రకమైన ప్రయత్నం చేయడం లేదు. 43 లక్షల మంది భారతీయులు, అందునా లక్షలాది మంది ఆంధ్రులు కల్గిన దుబాయి మహానగరంలో తెలుగుదేశం పార్టీ పేరిట కార్యక్రమం జరిపితే పట్టుమని ఒక పది మంది కూడా ఫొటో ఫ్రేంలోకి రాని పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది. పైరవీలు, పనులు దేవుడికెరుక కానీ కనీసం ఏడు కొండల స్వామిని దర్శించుకోవడానికి పాసు కూడా పొందలేకపోతున్నామని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.


తమ ఉనికిని చాటడంలో గల్ఫ్ ప్రవాసాంధ్ర నాయకులు విఫలమవుతుండగా, ఈ శక్తిని సరిగా అంచనా వేసి సద్వినియోగం చేసుకోవడంలో పార్టీ నాయకత్వం కూడా విఫలమవుతోంది. దశాబ్దకాలంగా పార్టీ నాయకత్వం గత్యంతరం లేని పరిస్థితులలో రెండు దేశాలు మినహాయించి మిగిలిన పెద్ద దేశాల్లో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా పర్యటించని వైనం పరిస్థితికి అద్దం పడుతోంది. పార్టీ నాయకత్వ వైఫల్యం వలన వర్గపోరాటాలు రచ్చకెక్కి ఒక చోట స్థానిక పోలీసుల వరకూ పరిస్ధితి వెళ్లిందంటే తీవ్రతను ఊహించవచ్చు. విశాల దృక్పథంలో అందర్నీ కలుపుకుపోయే దార్శనికత కొరవడింది. ఇప్పుడిప్పుడే ఇక్కడ పురుడుపోసుకుంటున్న పార్టీలో పార్టీ కంటే తమ వ్యక్తిగత ప్రాబల్యం సామాజిక ఆధిపత్యం ప్రదర్శించే పోకడలు ఎక్కువ కావడం చిరాకు కల్గిస్తోంది.


ఈ రకమైన పరిస్థితుల్లో కొలువుదీరిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై నూతన కార్యవర్గంలో ప్రప్రథమంగా పది మందికి చోటు దక్కింది. సంప్రదాయంగా ఇప్పటి వరకూ చెలామాణీలో ఉన్న నాయకులకు భిన్నమైన వారు, దాదాపుగా కొత్త ముఖాలని చెప్పవచ్చు. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సత్తా చూపుతారా? లేదా? అనేది రానున్న కాలం చెబుతుంది. పార్టీ ఎన్నారై కార్యవర్గం అసంఖ్యాకంగా ఉన్న అన్ని వర్గాల వారిని ఆకర్షించడంతో పాటు అభిమానులను ఉత్తేజపరిచి వారిని కార్యకర్తలుగా మార్చి, కార్యోన్ముఖులుగా చేసి పార్టీకి నూతన జవసత్వాలు చేకూర్చే దిశగా అడుగులు వేయాలి.


ఈ వార్తలనూ చదవండి:

ఘనంగా తానా మిడ్-అట్లాంటిక్ సమ్మర్ చెస్ టోర్నమెంట్-2026

అమెరికాలో దేశీ డాన్స్ వర్కవుట్ విజయవంతం

Updated Date - Sep 16 , 2026 | 08:39 PM