ఖతర్‌లో దాతృత్వం చాటిన ఆంధ్రా ప్రవాసీ సమాజం
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:19 PM
ఒక తెలుగు వ్యక్తి కోసం తెలంగాణ-ఆంధ్రా లేదా ఫలానా కులం ఫలానా మతం అనే వివక్ష లేకుండా ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సమాజం ఒక్కటిగా నిలిచి మానవత్వాన్ని పరిమళించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: జీవితం అనేది ఒడిదుడుకులు, ఆనందం, బాధ, కన్నీళ్లతో కూడిన ప్రయాణం. అందునా అది పరాయి గడ్డపై అనూహ్యంగా మలుపు తిరిగితే సవాళ్లను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఆ సవాళ్ల ముళ్ల కంచెను దాటించడానికి మానవత్వం ఉండాలి. హృదయ స్పందన అనేది ప్రాంతీయత, కులం, మతం మొదలైన సంకుచితాలకు అతీతంగా ఉంటుందనే విషయాన్ని ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయులు నిరూపించారు.
తమకు తెలియని ఒక తెలుగు వ్యక్తి కోసం తెలంగాణ-ఆంధ్రా లేదా ఫలానా కులం ఫలానా మతం అనే వివక్ష లేకుండా ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సమాజం ఒక్కటిగా నిలిచి మానవత్వాన్ని పరిమళించింది.
ఖతర్‌లో 20 సంవత్సరాలుగా పని చేసిన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలానికి చెందిన సుంకై మల్లేష్ జీవన నౌక సాఫీగా కొనసాగింది. ఎదిగిన కూతురుకు వివాహ నిశ్చితార్థం జరిగి త్వరలో కన్యాదానం చేయడానికి సిద్ధమవుతుండగా మల్లేష్‌ను మృత్యువు కబళించింది. పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన ఆయన మరణంతో కూతురి వివాహానికి కుటుంబం వెనుకంజ వేసే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఖతర్‌లోని కొందరు నిజామాబాద్ జిల్లా ప్రముఖులు మృతుడి కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకుని ఆయన కోసం విరాళాలు సేకరించారు.
మల్లేష్ కుటుంబానికి మొత్తం 42,966 రియాళ్లు అనగా సుమారు 11 లక్షల రూపాయలను ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయులు అందజేశారు.
ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఈ మొత్తంలో 16,350 రియాళ్లు మాత్రమే తెలంగాణ సంఘాలు సేకరించగా అందులో 30 శాతం అనగా ఐదు వేల రియాళ్లు కేవలం ఒకే ఒక్క వ్యక్తి అందించారు. దోహాలో లయోలా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకురాలైన డాక్టర్ ఆర్. అమూల్య రావు దీన్ని అందించారు. అబుదాబిలో, హైదరాబాద్‌లో కూడా ఈ సంస్థ విద్యాలయాలు కలిగి ఉండగా దీని వ్యవహారాలను ఆమె చూస్తుంటారు.
మిగిలిన 26,616 రియాళ్లను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సంఘం నేతృత్వంలో ఏపీ ప్రవాసులు అందజేశారు. మృతుడి స్వస్థలానికి చెందిన ఒక తెలంగాణ ప్రవాసీ ప్రముఖుడితో పాటు అక్కడికి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రకాశం జిల్లా ప్రముఖుడు కూడా అదే మొత్తంలో సహాయం చేశారు. మొత్తం ఆర్థిక సహాయంలో దాదాపు 62 శాతం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రవాసీయులు తమకు తెలియని తెలంగాణ కుటుంబానికి అందించి తమ ఉదారతను ప్రదర్శించారు.
దుబాయి సహా ఎక్కడా లేని సందడి, తెలంగాణ పేరిట ఖతర్‌లో ఉంటుంది. దాని పేర సంఘాలు, కార్యకలాపాలు అనేకం ఉన్నాయి. అందరితో పాటు ప్రతి బుధవారం శాలువ సన్మానాలు అందుకోవడంలో కూడా అవి ముందు వరుసలో ఉంటాయి. కానీ ఈ రకమైన దాతృత్వం విషయం వచ్చే సరికి మాత్రం ఎందుకో గానీ అందులో ఆశించిన విధంగా తెలంగాణ జోష్ సన్నగిల్లుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఫిలడెల్ఫియాలో ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు ఘన సన్మానం!
TANA, TAMA కమ్యూనిటీ రక్తదాన శిబిరం: అట్లాంటా యూఎస్