ఆరోగ్యవంతమైన తెలుగు సమాజం దిశగా ఖతర్‌లో ఆరోగ్య శిబిరం
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:38 PM
ఖతర్‌లో తెలుగు ప్రవాసీ సంఘం ఆంధ్రకళా వేదిక అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య నేతృత్వంలో మూడు తెలుగు ప్రవాసీ సంఘాలు సంయుక్తంగా తెలుగు ప్రవాసీయులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఖతర్‌తో పాటు గల్ఫ్ దేశాలన్నింటిలోనూ భారతీయులు, ఇతర విదేశీ కార్మికుల్లో మధుమేహం (డయాబెటిస్) వ్యాధి మెల్లగా తెలియకుండా విస్తరిస్తూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. దీన్ని ముందుగా పసిగట్టి తగు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు కానీ దీనిపై నిర్లిప్తత వల్ల పరిస్థితి చేజారిపోతోంది. సాధారణంగా మధుమేహన్ని ముందుగా గుర్తించడం కష్టం, పైగా దీనికి ప్రవాసీయుల నిర్లక్ష్యం అదనం.
ఖతర్‌లో తెలుగు ప్రవాసీ సంఘం ఆంధ్రకళా వేదిక అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య నేతృత్వంలో మూడు తెలుగు ప్రవాసీ సంఘాలు సంయుక్తంగా తెలుగు ప్రవాసీయులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించాయి. తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్), ఆంధ్ర కళా వేదిక (ఏకేవీ), తెలుగు డయాస్పోరా ఫెడరేషన్‌లు KIMS హాస్పిటల్ సౌజన్యంతో తెలుగు ప్రవాసీయుల కుటుంబాల కోసం దీన్ని నిర్వహించాయి.
63 ఏళ్ళ వయస్సులో కూడా రేయింబవళ్లు అనే తేడా లేకుండా పని చేసే రమణయ్య తన తరహాలోనే తెలుగు సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ రకమైన ఆరోగ్య శిబిరం నిర్వహణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నిద్రవేళలు, ఆహార నిబంధనలు, వ్యాయామంపై తెలుగు ప్రవాసీ యువకులు ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా డయాబెటిస్‌తో పాటు అనేక రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చని ఈ సందర్భంగా రమణయ్య పేర్కొన్నారు.

ఆరోగ్యం, వ్యాధులపై అవగాహన, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ శిబిరంలో 170 తెలుగు కుటుంబాలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ప్రధానమైన డయాబెటిస్ నిర్ధారణ కోసం రక్త పరీక్షలతో పాటు ప్రప్రథమంగా స్త్రీల ఆరోగ్య విషయమై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. మహిళలకు అవసరమైన గైనకాలజీ సంబంధిత సూచనలు, సలహాలతో పాటు రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంపై కూడా మహిళలకు స్త్రీ వైద్యులు ప్రత్యేక అవగాహన కల్పించారు. అదే విధంగా చర్మ సంబంధిత రోగాలపై కూడా సూచనలు అందించారు. ఇ.ఎన్.టి, అర్థోపెడిక్‌కు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో వైద్యుల సలహాలు, సూచనలు పొందారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన సీనియర్ దౌత్యవేత్త డాక్టర్ వైభవ్ టండలే మాట్లాడుతూ ఈ రకమైన శిబిరాల ద్వారా భారతీయుల్లో ఆరోగ్యవంత సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సేవ, మానవతా విలువలు, సమాజం పట్ల బాధ్యతను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించడం గాంధీ మహాత్ముడికి అర్థవంతమైన నివాళి అని కూడా ఆయన పేర్కొన్నారు. భారతీయ సంఘాల ప్రతినిధిగా ఐసీసీ ఉపాధ్యక్షుడు శాంత కూడా తెలుగు సంఘాల శిబిరాన్ని కొనియడారు.
తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ రావు, ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య, తెలుగు డయాస్పోరా ఫెడరేషన్ అధ్యక్షుడు శాంతను ఎల్లమంచిలిలు మాట్లాడుతూ సమాజానికి అవసరమైన సమయంలో వివిధ సంస్థలు ఒక లక్ష్యంగా కలిసిమెలిసి పనిచేయడం సంతోషకరమని, ఈ ఐక్యతను కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో హిందూ ఆచారాలపై పిల్లలకు 'రిచువల్స్ అండ్ రీజన్' సదస్సులు
అట్లాంటాలో తానా కళాశాల థియరీ.. ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతం