Share News

రాస్ అల్ ఖైమా రోడ్డు ప్రమాదం- మృతుల్లో ఆంధ్రా అమర ప్రేమికుడు

ABN , Publish Date - Nov 26 , 2026 | 02:23 PM

మంగళవారం రాస్ అల్ ఖైమాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన వినోద్ కుమార్ దుర్మణం చెందారు.

రాస్ అల్ ఖైమా రోడ్డు ప్రమాదం- మృతుల్లో ఆంధ్రా అమర ప్రేమికుడు
Vinod Kumar

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మొదటి చూపులో ప్రేమ కంటే చివరి చూపులో తోడు ఉండే ప్రేమ చాలా గొప్పది అని నిరూపించారు ఒంగోలు జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన బ్రహ్మణకాక వినోద్ కుమార్. మంగళవారం రాస్ అల్ ఖైమాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 13 మందిలో వినోద్ కుమార్ ఒకరు.

31 ఏళ్ల వయసులో ఇటీవలే దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన ఆయన అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. తన బంగారు భవిష్యత్తు కోసం ఎమిరేట్స్‌ను ఎంచుకొన్న ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు. విజిటింగ్ వీసాపై వెళ్లి ఉద్యోగం చూసుకుని ఎంప్లాయ్‌మెంట్ వీసాగా మార్చుకునేందుకు బస్సులో ఒమాన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా ఆగి ఉన్న ఒక ట్రక్కును ఆ బస్సు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.


వినోద్ కుమార్ భార్య రిజి రాస్ అల్ ఖైమాలో పని చేస్తున్నారు. కేరళకు చెందిన ఆమె ఒంగోలులో నర్సింగ్ విద్యకు వచ్చినప్పడు వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమబంధంలో ఒక్కటై పెళ్లి చేసుకున్నారు. తనకు ఉద్యోగం లభించిన తర్వాత రాస్ అల్ ఖైమాకు వెళ్లిన ఆమె తన భర్తను కూడా విజిటింగ్ వీసాపై పిలిపించుకున్నారు. వినోద్‌కు ఒక ఉద్యోగం కూడా దొరికింది.

ఇద్దరి ఉద్యోగాలతో వారి కలలు సాకారమవుతున్న వేళ విధి కాటేసింది. వారి అన్యోన్యమై దాంపత్యం అరంభంలోనే అంతమైంది. శోక సముద్రంలో మునిగిపోయిన వినోద్ భార్యను పరామర్శించేందుకు వెళ్లిన వారి నోట మాట పెగల్లేదు.


ప్రమాదంపై వివరాలను తెలుసుకోవడానికి రాస్ అల్ ఖైమా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని బుధవారం దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబీకులతోనూ మాట్లాడారు. మృతుల సంఖ్య ఎంతో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని కూడా కాన్సుల్ జనరల్ అన్నారు.

ప్రమాదం జరిగిన వెనువెంటనే రాస్ అల్ ఖైమాలోని అన్ని అత్యవసర విభాగాలతో పాటు దుబాయి వైమానిక అంబులెన్సులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని మృతులను, క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు.

రోడ్డు ప్రమాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఖతర్‌లో తెలుగు కళా సమితి వనభోజనం

అమెరికాలో ఒక్కచోట చేరిన విశాఖవాసులు.. అట్లాంటాలో ఘనంగా ‘మీట్ అండ్ గ్రీట్’

Updated Date - Nov 26 , 2026 | 02:40 PM