అమెరికాలో వైభవంగా ముగిసిన మాటా మహాసభలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 07:44 AM
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండు రోజుల పాటు సాగిన ఈ మహాసభలు తెలుగు ఐక్యతకు సజీవ ప్రతీకగా నిలిచాయి.
పెన్సిల్వేనియా, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఉత్తర అమెరికా తెలుగు సమాజ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండు రోజుల పాటు సాగిన ఈ మహాసభలు తెలుగు ఐక్యతకు సజీవ ప్రతీకగా నిలిచాయి. సంస్కృతి, ఆధ్యాత్మికత, వినోదంతో పాటు సామాజిక చైతన్యం, సాంకేతికతను సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 7,500లకు పైగా తెలుగు కుటుంబాలు ఒకే వేదికపైకి రావడం విశేషం. మత సామరస్యానికి అద్దం పడుతూ ఒక ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి సంయుక్తంగా నిర్వహించిన ప్రార్థనలతో మహాసభలు ప్రారంభమయ్యాయి.
తెలుగు సినీ, సాంస్కృతిక రంగ ప్రముఖుల రాకతో మహాసభల ప్రాంగణం కళకళలాడింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ నిర్వహించిన లైవ్ కాన్సర్ట్ వేలాది మంది ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. యువ గాయకుడు రామ్ మిర్యాల సంగీత విభావరితో ఆకట్టుకున్నారు. నటీనటులు నిఖిల్, సిద్దార్థ్, ఐశ్వర్య రాజేష్, సుమన్, అలీ, విషి అయ్యర్, శివారెడ్డి, అదిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తమ ప్రదర్శనలతో అలరించారు.
ఈ మహాసభలలో ప్రముఖ నటి జయప్రద మాటా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. శ్రీనివాసరావు, భాస్కర్ గంటి, సాయినాథ్ కర్నాటి, స్వాతి అట్లూరి, దాము గేదల, విజయభాస్కర్, నాగేశ్వరరావు పూజారి, రాజు చామర్తి, కృష్ణ మద్దిపట్ల మాటా ఎక్సలెన్స్ అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల, సభ్యులు విజయభాస్కర్ కలాల్, ప్రవీణ్, కళ్యాణి, శ్రీనివాస్ గణగోని, ప్రవీప్ సామల, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
తానా-పాఠశాల ఆధ్వర్యంలో వర్జీనియాలో వైభవంగా ఫాదర్స్ డే వేడుకలు