రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్‌కు..
ABN , Publish Date - May 28 , 2026 | 08:11 PM
రెండు దశాబ్దాల పాటు సౌదీ జైల్లో మగ్గిపోయిన ఒక మలయాళీ మరణ శిక్ష ముప్పు తప్పిపోయాక ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రెండు దశాబ్దాల పాటు సౌదీ జైల్లో మగ్గిపోయిన ఒక మలయాళీ మరణ శిక్ష ముప్పు తప్పిపోయాక ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనను చూసిన తల్లి భావోద్వేగంతో కన్నీరుపెట్టుకున్నారు.
కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ తన కుటుంబానికి అండగా ఉండేందుకు 2006 నవంబర్‌లో డ్రైవర్ వీసాతో సౌదీకి వెళ్లారు. అక్కడి సౌదీ కుటుంబంలో దివ్యాంగుడైన అనాస్ అల్ ఫయాస్ (15) బాధ్యతలను కుటుంబపెద్దలు రహీమ్‌కు అప్పగించారు. అయితే, ఒక రోజు కారులో వెళుతుండగా రహీమ్ చేయి పొరపాటున అనాస్‌కు ఉన్న జీవాధార వ్యవస్థకు తగలడంతో పైపు ఊడిపోయింది. ఆ తరువాత కొన్ని క్షణాలకే అనాస్ మరణించాడు.
దీంతో, 2006 డిసెంబర్‌లో సౌదీ పోలీసులు రహీమ్‌ను అరెస్టు చేశారు. 2012లో సౌదీ కోర్టు రహీమ్‌కు మరణ శిక్ష విధించింది. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటని రహీమ్ ఎంతగా ప్రాథేయపడ్డా న్యాయస్థానం కనికరించలేదు.
ఈ నేపథ్యంలో రహీమ్‌ను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా మలయాళీ ఎన్నారైలు ఏకమయ్యారు. ఆయనకు మరణశిక్ష తప్పించేందుకు విస్తృతస్థాయి ప్రయత్నాలు ప్రారంభించారు. వారి ప్రయత్నాలు ఫలించి అనాస్ కుటుంబం బ్లడ్ మనీ తీసుకుని రహీమ్‌ను క్షమించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు అబ్దుల్ రహీమ్ లీగల్ అసిస్టెన్స్ కమిటీ ద్వారా రూ.34 కోట్ల నగదును విరాళల ద్వారా సేకరించి అనాస్ కుటుంబానికి ఇవ్వడంతో రహీమ్‌కు 2024లో మరణ శిక్ష ముప్పు తప్పిపోయింది.
అయితే, సౌదీ చట్టాల ప్రకారం రహీమ్ కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష తప్పనిసరి కావడంతో ఇటీవలే ఆయన విడుదలయ్యారు. బుధవారం రాత్రి సౌదీలో విమానమెక్కిన ఆయన తాజాగా స్వదేశానికి చేరుకున్నారు. యువ్వనంలో సౌదీకి వెళ్లి మధ్య వయస్కుడిగా తిరిగొచ్చిన రహీమ్‌ను చూసి ఆయన కన్నతల్లి, బంధువులు, స్నేహితులు తీవ్రభావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ రహీమ్ ధన్యవాదాలు తెలిపారు. కన్నీరుకారుస్తూ చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
బే ఏరియాలో ‘మహానాడు’కు తరలిరండి.. ఎన్నారై టీడీపీ నేతల పిలుపు
ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు.. బర్మింగ్‌హామ్‌లో అన్నదానం