ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు.. బర్మింగ్‌హామ్‌లో అన్నదానం
ABN , Publish Date - May 27 , 2026 | 03:22 PM
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 103వ జయంతి ఉత్సవాలు అలబామాలోని (యూఎస్‌ఏ) బర్మింగ్‌హామ్‌లో ఘనంగా జరిగాయి.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 103వ జయంతి ఉత్సవాలు అలబామాలోని (యూఎస్‌ఏ) బర్మింగ్‌హామ్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు, అన్న ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లే, వరుసగా 4వ సంవత్సరం కూడా అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం (Food Donation Drive) ద జమ్మీహేల్ మిషన్ ఆధ్వర్యంలో బర్మింగ్‌హామ్‌లోగల హోమ్‌లెస్ షెల్టర్‌లో నిర్వహించారు. ‘పేదవారికి పట్టెడన్నం పెట్టాలి’ అనే అన్నగారి ఆశయాన్ని కొనసాగిస్తూ, అవసరమైన వారికి భోజనం అందించడం ద్వారా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో బాల బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, స్వయంగా వంట చేయడం (Cooking), భోజనం వడ్డించడం (Serving) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు సేవా భావంతో ముందుకు వచ్చి నిరాశ్రయులకు ఆత్మీయంగా భోజనం అందించడం అందరినీ ఆకట్టుకుంది.
అదేవిధంగా, భావితరాలకు ఎన్టీఆర్ గొప్పతనం, సేవా స్ఫూర్తి, సంస్కారాలను చేరవేసే ఉద్దేశంతో బాలలకు చిత్రలేఖనం (Painting), ప్రసంగ పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఎన్టీఆర్ వ్యక్తిత్వం, తెలుగు జాతికి చేసిన సేవలు, అలాగే అవసరంలో ఉన్న వారికి ఆహారం పంచడం ప్రాముఖ్యత గురించి ఎంతో చక్కగా మాట్లాడారు.

ఈ కార్యక్రమం ద్వారా మన సంప్రదాయాలను, సేవా భావాన్ని భావితరాలకు అందించడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. పిల్లల్లో సేవా దృక్పథాన్ని పెంపొందిస్తూ, ఎన్టీఆర్ ఆశయాలను తదుపరి తరాలకు తీసుకెళ్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ అభినందించారు.
చివరగా, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ, బాల బాలికలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

