Share News

గల్ఫ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం

ABN , Publish Date - Aug 15 , 2026 | 06:58 PM

గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించి భారతీయ ఎంబసీల వేడుకల్లో పూర్తి ఆరు చరణాల వందేమాతర గేయాన్ని ఆలపించారు.

గల్ఫ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం
Indian Independence Day Celebrations in Gulf

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించి భారతీయ ఎంబసీల వేడుకల్లో పూర్తి ఆరు చరణాల వందేమాతర గేయాన్ని ఆలపించారు. సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల్లో జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు కూడా చేశారు. గతంలో ఎప్పుడూ లేని ఈసారి దుబాయిలో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’, ‘భారత్ కో జానీయే’ కార్యక్రమాలకు కూడా విదేశాల్లో ఆశాజనకమైన స్పందన లభించింది.

కాలమానం ప్రకారం సూర్యపథ్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఒక దేశం తర్వాత మరో దేశంలోని ఎంబసీలు క్రమంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వినూత్న కార్యక్రమం జరిగింది. సమయ పీఠిక ప్రకారం సెంట్రల్ ఆసియాలోని ఉజ్బెకిస్థాన్ మొదలు గల్ఫ్ లోని ఒమాన్‌, సౌదీ అరేబియాల్లో.. ఆపై ఇథియోపియాలో వేడుకలు జరిగాయి.


Indian Independence Day Celebrations in Gulf

దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేసి రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు. పాస్‌పోర్టుల జారీలో గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కరించినట్లుగా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రవాసీయుల సంక్షేమం, భారతీయ వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

ఈ సందర్భంగా నూతనంగా పదవీ భాద్యతలను స్వీకరించిన విష్ణువర్ధన్ రెడ్డిని కలువడానికి భారతీయ ప్రముఖులు ఆసక్తి ప్రదర్శించారు. అనేక మంది తెలుగు ప్రవాసీ ప్రముఖులు కూడా ఆయనను వేదికపై కలుసుకున్నారు. తెలుగు రసమయి పక్షాన యస్వీరెడ్డి, తెలుగు అసోసియేషన్ పక్షాన మసీయోద్దీన్, దినేష్, జాఫర్, భీం, తౌఫీఖ్, సౌజన్య, ఉషా, అరుణ్, వలీ, శివ, మోహన్, అభిషేక్ తదితరులు ఆయనను కలుసుకున్నారు.

అబుదాబిలో రాయబారి దీపక్ మిట్టల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంబసీ, కాన్సులేటుకు చెందిన సీనియర్ అధికారులు వివిధ ఎమిరేట్లలోని భారతీయ సంఘాలు, భారతీయ పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Independence Day5.jpg


సౌదీ అరేబియాలోని రియాధ్‌లో భారత రాయబారి విపుల్ జాతీయ జెండాను ఎగురవేశారు. భారత-సౌదీ మైత్రిలో ప్రవాసీయుల పాత్రను ఆయన తన ప్రసంగంలో ప్రశంసించారు. నూతనంగా వచ్చిన రాయబారితో సమావేశం కావడానికి పెద్ద సంఖ్యలో భారతీయ ప్రముఖులు ఈ సందర్భంగా ఎంబసీకి వచ్చారు. జెద్ధాలో కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరి జెండాను ఎగురవేసి రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని చదివారు.

కువైత్‌లో రాయబారి పారమిత త్రిపాఠి మువ్వన్నెలు కల్గిన భారతీయ సంప్రదాయ చీరను ధరించి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వచ్ఛత హీ సేవా అనే స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమాన్, ఖతర్, బహ్రెయిన్‌లలో కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

3.jpgIndependence Day4.jpg


ఈ వార్తలనూ చదవండి:

తెలుగు సాంస్కృతిక సమితికి 50 ఏళ్లు.. హ్యూస్టన్‌లో ఘనంగా స్వర్ణోత్సవాలు

AAA ఆధ్వర్యంలో.. అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ ఏర్పాటు

Updated Date - Aug 15 , 2026 | 08:32 PM