మధుర ప్రవాసంలో కఠోర బాల్యం.. స్నేహితులు కరువై ఒంటరితనం
ABN , Publish Date - Jun 03 , 2026 | 07:24 PM
మెరుగైన ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే అనేక మంది క్రమేణా కుటుంబ సమేతంగా సుదీర్ఘ కాలం పాటు అక్కడ నివసిస్తుంటారు. ఈ క్రమంలో ఆ విదేశీగడ్డపై పుట్టిపెరిగే చిన్నారులు ఆప్యాయత, అనురాగాల లేమితో యాంత్రికంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మెరుగైన ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే అనేక మంది క్రమేణా కుటుంబ సమేతంగా సుదీర్ఘ కాలం పాటు అక్కడ నివసిస్తుంటారు. ఈ క్రమంలో ఆ విదేశీగడ్డపై పుట్టిపెరిగే చిన్నారులు ఆప్యాయత, అనురాగాల లేమితో యాంత్రికంగా కాలం వెళ్లదీస్తున్నారు. మాతృదేశం, సంస్కృతిపై మమకారం ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న అవకాశాలను వదులుకోలేక చివరకు తమ అస్తిత్వం గురించి తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. చదువు, డిజిటల్ గేమ్స్‌తో అలసిపోయి చిన్న వయస్సులో వ్యక్తీకరించలేని భావోద్వేగ ఒంటరితనంతో నలిగిపోతున్నారు. భారతదేశంలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం తల్లిదండ్రులు రోజు మొత్తం మీద పిల్లలకు కేటాయిస్తున్న సమయం 30 నిమిషాలు మాత్రమే! పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.

బడిలో నేర్పే అక్షరాలు మాత్రమే ఏకైక లక్ష్యంగా భావిస్తూ అనుబంధాలను నేర్పే కుటుంబం.. లోకాన్ని అర్థం చేయించే సమాజం ప్రాధాన్యతను సగటు తెలుగు మనిషి విస్మరిస్తున్నాడు. ఇంట్లో మాట్లాడే మాతృభాషకు, పాఠశాలలో ప్రయోగించే భాషకు మధ్య సమతౌల్యత సాధించడం గణితం కంటే కూడా ఎక్కువగా చికాకు కలిగిస్తూ మాతృభాషను మరిచిపోతూ మోబైల్ ఫోన్‌లో బందీలుగా మారుతున్నారు. ఖైదీలు వ్యానులో కోర్టుకు వచ్చి వెళ్ళినట్లుగా.. పిల్లలు బడికి వచ్చి వెళ్తూ.. అప్పుడప్పుడు తల్లిదండ్రులతో మార్కేట్లకు వెళ్లడం మినహా ఇక్కడి చిన్నారులకు బాల్యానందం ఆందకుండాపోతోంది. శరవేగంగా పరిగెడుతున్న కాలంలో మనకు తెలియకుండా పిల్లలు ఎదుగుతున్నారు. పై చదువుల కోసం మన కళ్ల ముందు నుంచి కదిలిపోతున్నారు. ప్రాజెక్టులు పూర్తయి, ఉద్యోగరీత్యా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తండ్రి మారడం కూడా పిల్లలపై ప్రభావం చూపుతోంది.

ఒకప్పుడు బాల్యమంటే బంగారు జ్ఞాపకాలు, ఆటపాటలు, విలువల పాఠాలు, బంధాలకు పునాది. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి ప్రయాణం, వర్షపు నీటిలో కాగితపు పడవలు.. ఇవి కేవలం జ్ఞాపకాలే కాదు, వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదులు కూడా. బాల్య జ్ఞాపకాలు, అనుభవాలు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఓ వ్యక్తి రాబోయే రోజుల్లో ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? అని నిర్దేశించేది బాల్యమే. అప్పటి జ్ఞాపకాలే. అవి మనుషులపై గాఢ ప్రభావం చూపిస్తాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. బాల్య మిత్రులు, ఆప్తులు కరువవడంతోనే నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో మానసిక ఆరోగ్య సమస్యలు, అవలక్షణాలు పెరిగిపోతున్నాయి. బాల్యం పర్యవసానం ఏంటో రియాధ్‌లో రాజమండ్రి దుర్ఘటన చాటింది.

డబ్బు సంపాదన, మంచి పాఠశాల ఒక్కటే ముఖ్యం కాదు, మన ఇరుగుపొరుగు మరియు సమాజం కూడా ముఖ్యమని గుర్తించాలి. ప్రపంచం అనే సిలబస్‌ను నేర్పే పాఠశాలలు ఇవే అనే విషయాన్ని ఆంగీకరించాలి. భారతదేశంలో పుట్టి నలుగురి మధ్యలో పెరిగిన పిల్లలను, విదేశాలలో పుట్టి పెరుగుతున్న పిల్లల లోక జ్ఞానాన్ని, చలాకీతనాన్ని ఒక సారి గమనిస్తే వ్యత్యాసం అర్థమవుతుంది. గల్ఫ్ దేశాలలోని అన్ని నగరాలలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో తెలుగు ప్రవాసీ కుటుంబాలు ఉండగా వారిలో పెద్దలు కలుస్తున్నా చిన్నారులలో తమ వయస్సుకు తగినట్లుగా స్నేహితులు లభ్యం కావడం కష్టతరంగా మారుతోంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లలు డిజిటల్ వ్యసనానికి గురవుతున్నారు. 2024లో నిర్వహించిన ఒక పరిశోధనలో ఐదు నుంచి 16 ఏళ్ల వయసు పిల్లల్లో 60 శాతం మంది డిజిటల్ అడిక్షన్ బారిన పడ్డారని తేలింది. ఈ ధోరణి పిల్లల శారీరక మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అందుకే నేటి తరం పిల్లల్లో ఆటిజం, ఏడీహెచ్‌డీ డెవలప్‌మెంటల్ డిజార్డర్, స్పీచ్ డిలే వంటివి ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పుడిప్పుడే తమ చిన్నారులకు స్నేహితుల ఆవశ్యకత ఉందనే విషయాన్ని అనేక మంది తల్లిదండ్రులు గుర్తిస్తూ వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని తెలుగు ప్రవాసీ సంఘాలు వారికి ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నాయి. పెద్దలతో పాటు చిన్నారులకు ఒక వారధిగా నిలుస్తున్నాయి. వీటిల్లో సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో క్రియాశీలకంగా ఉన్న తెలుగు ప్రవాసీ సంఘం ‘సాటా’ ఒకటి.
చిన్నారుల ఉల్లాసం, వ్యక్తిత్వ వికాసం కూడా తమ సంఘ ప్రధాన ఉద్దెశమని సాటా నాయకురాలు గుండుబొగుల రమ్య పేర్కొన్నారు. పెద్దలున్న తమ సంఘంలో పిల్లలకు కూడా ప్రధాన భాగస్వామ్యం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. స్వదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్న వేళ ప్రవాసంలో తామందరం ఒక ఉమ్మడి కుటుంబమని మరో మహిళ నాయకురాలు లోకె సుధా అన్నారు. ఇంట్లో ఉండి అల్లరి చేస్తే మొబైల్ ఇచ్చి గేములను ఆడిస్తూ తినిపించడం ద్వారా చిన్నారుల బాల్యాన్ని హరిస్తున్నారని మహిళ ప్రముఖురాలు శ్రీదేవీ అన్నారు.

ఇంట్లో ఉండే పిల్లలకు ట్యాబ్, మొబైల్ మాత్రమే దిక్కు కాగా సంఘజీవనం పిల్లల మానసిక అభివృద్ధికి ఎనలేని దోహదం చేస్తుందని, పిల్లలు నలుగురితో కలిసిన తర్వాత ఎనలేని సంతోషంతో గడుపుతున్నారని రియాధ్‌లోని తెలుగు ప్రవాసీ సంఘం టాసా నాయకురాలు బిందూ వెల్లడించారు. సమావేశాలు, సందర్భాల పేర పిల్లల కలయిక అనేది అత్యంత అనివార్యత, ఆవశ్యకత అని ఆమె అన్నారు.
సమాజానికి దూరంగా ఉండే కుటుంబాల పిల్లలకు మాటాలు రావడంలో జాప్యం జరుగుతోందని, కానీ నలుగురితో కలిసి మెలిసి ఉండే కుటుంబాలలో పిల్లలకు మాటలు సకాలంలో వస్తున్నయాని దమ్మాంలోని సాటా మహిళ నాయకురాలు పల్లెం వర్షిత అభిప్రాయపడ్డారు. వివిధ సందర్భాలలో పెద్దలు కలుసుకోవడం ద్వారా చిన్నారులు కూడా కలుసుకుని మాట్లాడుకోవడం ద్వారా తెలుగు భాషపై పట్టు కూడా వస్తుందని ఆమె పేర్కొన్నారు.
పిల్లలకు సామాజిక వాతావరణం అనివార్యమని దమ్మాంలోని మరో తెలుగు ప్రవాసీ సంఘం సాట్స్ మహిళా నాయకురాలు కె. రాజలక్ష్మి అభిప్రాయపడ్డారు. వివిధ సమావేశాల సందర్భంగా కలిసినప్పుడల్లా, తమ వయసుకు తగినట్లుగా చిన్న పిల్లలు గ్రూపులుగా ఏర్పడి పరస్పరం ఆడుకుంటూ పాడుకొంటూ ఆరోగ్యవంతమైన సామాజిక వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. భారతదేశంతో పోల్చితే గల్ఫ్‌లో ఉండే సహజ క్రమశిక్షణ, తెలుగు వాతావరణంలో పిల్లల పెంపకం బాగుందని రాజలక్ష్మి అన్నారు.

ప్రతిష్ఠాత్మకమైన నియోం ప్రాజెక్టులో నియమితులైన అనేక మంది ప్రవాసీయులు అకస్మాత్తుగా తమ ఉద్యోగాలు కోల్పోవడంతో కొందరు అర్థాంతరంగా తమ పిల్లలను ఇతర నగరాలకు లేదా స్వదేశానికి పంపించడంతో పిల్లలు ఒక్కసారిగా ఏకాంతమయ్యారు. వివిధ సమావేశాల సందర్భంగా పెద్దలు కలిసినప్పుడు పిల్లలు కూడా తమకంటూ ఒక బంధం ఏర్పాటు చేసుకొన్నారు. అరేబియాకు అవతలి వైపు ఎర్ర సముద్రం తీరం తబూక్‌లో తనతో ఆడుకునే అనేక మంది తెలుగు పిల్లలు ఒక్కసారిగా వెళ్లిపోవడంతో ఏడేళ్ల సన్నిధి ధిత్రి ఒక్కసారిగా ఒంటరైపోయింది.
గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అరేబియా మహానగరాలలో రాణించే అనేక మంది.. నగరాలలో పుట్టి పెరిగిన తమ పిల్లలను తమతో పోల్చుకుంటే ఎక్కడ ఉన్నారని తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికా రాజధానిలో గన్నికి ఆత్మీయ సత్కారం
తానా మిడ్ అట్లాంటిక్ బ్లడ్ డ్రైవ్‌కు మంచి స్పందన