దేవాలయంలో దాడికి కుట్ర.. రైఫిల్ జామ్ కావడంతో తప్పిన నరమేధం
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:17 PM
భారతీయులను హత్య చేసేందుకు బయలుదేరిన యూఎస్ యువకుడు అలెగ్జాండ్రో మార్గమధ్యంలో రైఫిల్ జామ్ అయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అప్పటికే నిందితుడి గురించి తెలిసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులను మట్టుపెడదామని భారీ కుట్రపన్నిన ఇల్లినోయ్ (యూఎస్) యువకుడు అలెగ్జాండ్రో పపోరాకిస్ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. దాడి చేసేందుకు అతడు బయలుదేరినప్పటికీ మార్గమధ్యంలో రైఫిల్ పనిచేయకపోవడం, అప్పటికే అతడి సహోద్యోగి పోలీసులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 11న దాడికి సిద్ధమైన రోజే స్థానిక పోలీసులకు నిందితుడు చిక్కాడు.
అమెరికా మీడియా కథనాల ప్రకారం, నిందితుడు చికాగోలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని టార్గెట్ చేశాడు. సాధారణంగా ఆదివారాల్లో అక్కడికి వేల మంది వస్తుంటారు. ప్రస్తుతం నవరాత్రి వేడుకలు కూడా ప్రారంభం కావడంతో సహజంగానే రద్దీ పెరిగింది. ఈ విషయాలన్నీ తెలిసే అలెగ్జాండ్రో అక్టోబర్ 11 ఆదివారం నాడు దాడి చేద్దామనుకున్నాడా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అలెగ్జాండ్రో పపోరాకిస్ స్థానికంగా ఉండే టాకో బెల్ కేంద్రంలో క్యాషియర్‌గా చేస్తున్నాడు. శ్వేతజాతీయులే అందరికంటే ఉన్నతులంటూ తరచూ జాత్యాహంకారం ప్రదర్శించేవాడని సహోద్యోగులు పేర్కొన్నారు. భారతీయుల్ని చంపడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాని, ఆదివారం ప్రత్యేక రోజు కాబోతోందని అతడు చెప్పినట్టు సహోద్యోగులు పేర్కొన్నారు. అయితే, అతడి వయసు 19 కావడంతో తోటి ఉద్యోగులు అతడిని సీరియస్‌గా తీసుకోలేదని చెప్పారు.
కానీ అక్టోబర్ 11న మాత్రం అలెగ్జాండ్రో యుద్ధానికి సిద్ధైనట్టు బాడీ ఆర్మర్ ధరించి, ఏఆర్ స్టైల్ రైఫిల్‌తో తన తల్లి ఇంటి నుంచి కారులో బయలుదేరాడు. డ్రైవ్ చేసుకుంటూ 40 మేళ్ల దూరం వెళ్లాడు. ఇంతలో రైఫిల్ జామ్ అయినట్టు గుర్తించి మళ్లీ ఇంటికెళ్లి రిపేర్ చేసేందుకు ప్రయత్నించాడు. సమాచారం కోసం నెట్టింట వెతికాడు. తన సహోద్యోగికి ఫోన్ చేసిన తను చేయబోయే ఘోరం గురించి చెప్పాడు. ఆ వ్యక్తి అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మారణహోం తృటిలో తప్పిపోయింది. ఈ కేసులో ఫోన్ కాల్యే కీలక ఆధారంగా మారినట్టు తెలుస్తోంది.
తనిఖీల సందర్భంగా అతడి ఇంట్లో 300 రౌండ్ల తూటాలు, బాడీ ఆర్మర్, గ్యాస్ క్యానిస్టర్, నాజీ గుర్తులు ఉన్న పలు వస్తువులను పోలీసులు గుర్తించారు. అక్కడ లభించిన మేనిఫెస్టోలో నిందితుడు తనని తాను అరోరా షూటర్‌గా పేర్కొన్నాడు. భారతీయులతో పాటు యూదులు, నల్లజాతీయులు, ఇతర శ్వేతజాతీయేతరులపై అతడికున్న ద్వేషం ఆ పత్రాల్లో స్పష్టంగా బయటపడింది.
ఈ వార్తలనూ చదవండి:
హిందూ దేవాలయంలో కాల్పులకు కుట్ర.. యూఎస్ యువకుడి అరెస్టు
హ్యూస్టన్‌లో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమాగమం