సౌదీ రాయబారిగా ఐఎఫ్ఎస్ అధికారి విపుల్
ABN , Publish Date - Jun 03 , 2026 | 08:16 AM
గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల వ్యవహారాలపై అవగాహన కల్గిన దౌత్యవేత్త విపుల్ ను సౌదీ అరేబియాలో నూతన రాయబారిగా భారత ప్రభుత్వం నియమించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల వ్యవహారాలపై అవగాహన కలిగిన దౌత్యవేత్త విపుల్‌ను సౌదీ అరేబియాలో నూతన రాయబారిగా భారత ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుతం ఖతర్‌లో భారతీయ రాయబారిగా పని చేస్తున్న ఆయన 1998 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో దుబాయిలో భారతీయ కాన్సుల్ జనరల్‌గా పని చేశారు. ఆ తరువాత న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాలలో గల్ఫ్ విభాగం సంయుక్త కార్యదర్శిగా కూడా పని చేశారు.
మక్కా, మదీనా పుణ్యక్షేత్రాల్లో భారతీయ హాజ్ యాత్రికుల కోసం సౌదీ అరేబియాలో కేవలం ముస్లిం దౌత్యవేత్తలను మాత్రమే రాయబారులుగా భారతదేశం నియమించింది. అదే సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు కూడా కొనసాగించింది. కానీ ప్రస్తుత రాయబారి సోహేల్ ఎజాస్ ఖాన్ గడువు ముగిసిన అనంతరం విపుల్‌ను నియమించింది. దీన్ని మాములు నియామకంగా కాకుండా ఒక చరిత్ర్మాక నిర్ణయంగా భావించాలి. సమర్థుడిగా పేరొందిన విపుల్ సౌదీ అరేబియా-భారత ద్వైపాక్షిక సంబంధాలలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తారని ఆశించవచ్చు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రవాసీయుల తీరుతెన్నుల గురించి విపుల్‌కు మంచి అవగాహన ఉంది. దుబాయిలో ప్రజల మన్ననలు పొందిన అధికారిగా ఆయనకు పేరుంది. ఖతర్‌లో కూడా ఆయన ప్రజలతో మమేకమయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజెర్సీలో విజయవంతంగా తానా పికిల్‌బాల్ టోర్నమెంట్
మన ఐక్యతకు నిదర్శనం గాంధీ మెమోరియల్: జయరాం కోమటి