Share News

జయ పీసపాటి గౌరవార్థం సింగపూర్‌లో ఆత్మీయ సమ్మేళనం

ABN , Publish Date - Sep 06 , 2026 | 09:04 PM

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.

జయ పీసపాటి గౌరవార్థం సింగపూర్‌లో ఆత్మీయ సమ్మేళనం
Singapore Telugu Community

సింగపూర్: హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్‌లో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.

సుబ్బు వి. పాలకుర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి జయ పీసపాటి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, సింగపూర్‌లోని తెలుగు ప్రముఖులతో ఆత్మీయంగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ, హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు, గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.

4.jpg


మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలవగలరని జయ పీసపాటి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు.

ఆదివారం వంటి వారాంతపు రోజున కూడా ఇంతమంది తెలుగువారు ఒకచోట చేరి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సింగపూర్, హాంగ్ కాంగ్ తెలుగు సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

5.jpg


సింగపూర్‌తో 2016 నుంచే ప్రత్యేక అనుబంధం

హాంగ్ కాంగ్‌లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న తనకు విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగువారి ఐక్యత, చురుకుదనం తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్‌మార్క్‌గా నిలిచాయని ఆమె అభినందించారు. ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు, గద్యాలను స్పష్టంగా చదివి వినిపించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.

మలేషియా తెలుగు సమాజం చూపించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెంది, భావితరాల్లో సజీవంగా కొనసాగాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.

6.jpg


ఈ సందర్భంగా రత్న కుమార్ మాట్లాడుతూ, జయ పీసపాటి గారితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2016లో తొలిసారి పరిచయం ఏర్పడినప్పటి నుంచి, అనంతరం జూమ్ వేదికగా నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్యతో తమ అనుబంధం మరింత బలపడిందని తెలిపారు.

‘జయ పీసపాటి ఇప్పుడు మా అందరికీ ఆత్మీయమైన ‘జయక్క’గా మారిపోయారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆమె సలహాలు, సూచనలు తీసుకోవడం మాకు ఎంతో సహజంగా మారింది. ఆమె ప్రసంగాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలు మాకు ఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయి’ అని రత్న కుమార్ పేర్కొన్నారు.

తెలుగు భాషాభిమానం, ఆత్మీయత, సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ జరిగిన ఈ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ యాజమాన్యం అతిథుల కోసం అల్పాహారాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

1.jpg2.jpg3.jpg


ఈ వార్తలనూ చదవండి:

బయట బతుకమ్మ, బోనాలు బరాబర్ చేయాల: కాన్సుల్ జనరల్ విష్ణువర్ధన్ రెడ్డి

TANA (తానా) ఆధ్వర్యంలో మిన్నియాపోలిస్‌లో విద్యార్థులకు బ్యాక్ ప్యాక్స్ పంపిణీ

Updated Date - Sep 06 , 2026 | 09:34 PM