Share News

బయట బతుకమ్మ, బోనాలు బరాబర్ చేయాల: కాన్సుల్ జనరల్ విష్ణువర్ధన్ రెడ్డి

ABN , Publish Date - Sep 06 , 2026 | 08:32 PM

సాంస్కృతిక వారసత్వమైన బతుకమ్మ, బోనాలు, జనాపద గీతాలను తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా సగర్వంగా ఆచరించి, ఆసాధ్వించాలని దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.

బయట బతుకమ్మ, బోనాలు బరాబర్ చేయాల: కాన్సుల్ జనరల్ విష్ణువర్ధన్ రెడ్డి
Indian Consul General Dubai E Vishnuvardhan Reddy

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: బతుకమ్మ, బోనాలు, జనాపద గీతాలు తెలంగాణ సాంస్కృతిక వారసత్వమని దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీన్ని తెలంగాణ ప్రజానీకం ఎక్కడున్నా సగర్వంగా ఆచరించి, ఆసాధ్వించాలని పిలుపునిచ్చారు. భారతీయ బ్రాండ్‌లో తెలంగాణ సాంస్కృతి ఒక భాగమని ఆయన అన్నారు.

దుబాయిలో ఆదివారం తెలంగాణ ప్రవాసీ కార్మిక సంఘం జి.డబ్ల్యు.సి.ఎ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన స్థానిక తెలుగు ప్రవాసీయుల స్థితిగతులపై మాట్లాడిన తీరు ప్రవాసీయులను ఆకట్టుకుంది. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. నెల రోజుల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రప్రథమంగా ప్రవాసీయులను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాలలోని భారతీయ బ్రాండులో తెలంగాణ బ్రాండు కూడా ఒక ముఖ్య భాగమని అన్నారు. అందుకు తెలంగాణ ప్రవాసీయులు తమ వంతు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఏ రకమైన పరిస్థితుల్లో కార్మికులుగా దుబాయికి వచ్చినా అక్కడున్న సమయంలో కేవలం నిమిత్త కార్మికులుగా మాత్రమే గడపకుండా తమ పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో వృత్తిపరమైన నిపుణులుగా ఎదగాలని కాన్సుల్ జనరల్ ఉద్బోధించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, దాన్ని కొనసాగించాలని ఆయన నొక్కి చెప్పారు.


అమెరికా, ఐరోపా ఖండాల్లో తెలుగు ప్రవాసీయులు వైద్య, సాఫ్ట్‌వేర్ నిపుణులుగా గుర్తింపు పొందగా గల్ఫ్ దేశాలలో భారీ సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు ఉన్నప్పటికీ వృత్తిపరంగా ఆ రకమైన విశిష్ఠమైన గుర్తింపు పొందలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తమ వృత్తిలో ఎదిగి రాణించిన అనంతరం పారిశ్రామికవేత్తలుగా లేదా వాణిజ్యవేత్తలుగా ఎదగడం నిజమైన పురోగతిగా గుర్తించాలని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

దుబాయి-భారత్‌ల మధ్య 150 సంవత్సరాలకు పైగా వలసల చరిత్ర ఉందని, ఈ సుదీర్ఘ కాలంలో అనేక అభివృద్ధితో పాటు కార్మిక సంక్షేమ రంగంలో అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయని కాన్సుల్ జనరల్ చెప్పారు. భారతదేశంలో కూడా ఇమిగ్రేషన్ రంగంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన గుర్తు చేసారు.

తమ కుటుంబాల ప్రగతి కోసం దుబాయికు వస్తున్న యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రయత్నించాలని విష్ణువర్ధన్ రెడ్డి హితువు పలికారు.

Indian Consul General Dubai E Vishnuvardhan Reddy


ప్రపంచంలోని అన్ని భారతీయ దౌత్య కార్యాలయాల కంటే దుబాయి భారతీయ దౌత్య కార్యాలయం సంఖ్యాపరంగా కీలకమైందని అన్నారు. అందునా తెలుగు వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడం, ప్రప్రథమంగా తాను కాన్సుల్ జనరల్‌గా దుబాయికి రావడం సంతోషకరమని ఆయన చెప్పారు.

జి.డబ్ల్యూ.సి.ఎ సంస్థ గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమం, హక్కుల గురించి కొనసాగించిన ఉద్యమాన్ని సంస్థ అధ్యక్షుడు కృష్ణ ధోనికెని వివరించారు. గ్రామగ్రామానా ఎన్నారై పాలసీ కోసం తాము చేసిన పాదయాత్ర, గల్ఫ్ మృతుల కుటుంబాలకు సహాయం చేస్తున్న విధి విధానాలను ఆయన వివరించారు. ఒక తెలుగు అధికారి దౌత్యవేత్తగా రావాలని తాము కన్న కల సాకారమైనందుకు తమ ఆనందానికి అవధులు లేవని కృష్ణ ధోనికెని భావోద్వేగంతో కన్నీరు పెట్టూకుంటూ చెప్పారు. తమ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన రాధారపు సత్యం, ఇతర స్పాన్సర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహాయం లేకుండా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయే వారమని కృష్ణ చెప్పారు.


సభికులకు సంస్థ అధ్యక్షుడు కృష్ణ ధోనికెని, నాయకులు కటుకం రవి, వంశీ గౌడ్, గడ్ఛరోలి నరేందర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులు అనేక మంది ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ జానపద గాయని శ్రీరేలరె గంగా పాడిన తెలంగాణ గేయాలు సభికులను తెలంగాణ పల్లెల ఊహల్లో విహరింపచేశాయి. స్థానికంగా దుబాయి గంగపుత్ర సంఘం సభ్యులు వీసా గోసపై ఒక పాటను పాడారు.

Updated Date - Sep 06 , 2026 | 08:44 PM