Share News

ఎడారుల నుంచి శబరిమల వరకూ స్వామియే శరణం

ABN , Publish Date - Nov 29 , 2026 | 07:25 PM

గల్ఫ్ దేశాలలో అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. భక్తులు తమ మండల దీక్ష అనంతరం బృందాల వారీగా శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు.

ఎడారుల నుంచి శబరిమల వరకూ స్వామియే శరణం
Gulf Ayyappa Devotees

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: అకుంఠిత దీక్ష, అంతులేని ఆత్మవిశ్వాసం, అంతకుమించి సన్నిధానానికి చేరుకుని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యం! ఇందుకు అరబ్బు, అమెరికా, ఆంధ్ర ... ఏదీ కాదు అడ్డంకి అంటున్నారు ప్రవాసీ స్వాములు.

గల్ఫ్ దేశాలలో అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. భక్తులు తమ మండల దీక్ష అనంతరం బృందాల వారీగా శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు. గల్ఫ్ దేశాల నుంచి కొచ్చిన్ విమానశ్రాయానికి వచ్చే భక్తులు అక్కడ గురు దీక్షల అనంతరం ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరుతుండగా అందులో దుబాయి, యూఏఈ నుంచి బయలుదేరే స్వాముల సంఖ్య ఎక్కువగా ఉంది. దీక్ష వల్ల వచ్చే మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని వర్ణించలేమని ప్రతి సంవత్సరం దీక్షను పాటించే ఆబుధాబిలోని తెలుగు ప్రవాసీ ప్రముఖుడు రాజ శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. ఎడారి దేశం నుంచి క్రమం తప్పకుండా శబరిమలకు తీర్థయాత్రకు వెళ్లడం ఒక గొప్ప అనుభూతి అని ఆయన వ్యాఖ్యానించారు.

Ayyappa2.jpg


సౌదీ అరేబియాలో కొన్ని తెలుగు కుటుంబాలు భక్తితో వడి పూజను నిర్వహిస్తున్నట్లుగా స్థానిక తెలుగు ప్రవాసీ ప్రముఖుడు రంజీత్ చిట్టలూరి చెప్పారు. అయ్యప్ప సన్నిధానంలోని 18 మెట్లలలో ఒకటయిన పడిపూజ (మెట్టు పూజ) మనిషిలోని 18 రకాల చెడు గుణాలు తొలగిపోవడానికి దోహదం చేస్తుందని చెబుతూ అయ్యప్ప మాల ధరించిన ప్రతిసారీ చెడు లక్షణాలను విడిచిపెట్టి మంచి వారిగా మారాలని కోరుకుంటూ గురుస్వాముల సూచనలతో ఈ పూజను నిర్వహిస్తామని రంజీత్ వివరించారు.

బహ్రెయిన్‌లోని అయ్యప్ప సమాజం మండల దీక్ష కాలంలో ఆధ్యాత్మికతతో నిమగ్నమై ఉంటుందని అయ్యప్ప సేవా మండలికి చెందిన సాంబశివరావు జటవాత్ అన్నారు. గతంలో సౌదీ అరేబియాలో పని చేసిన ఆయన ఆ దేశంలో దీక్షావస్త్రం, చెప్పులు ధరించిన అతి కొద్ది మంది స్వాములలో ఒకరు. త్వరలో 18 మంది భక్తులు బహ్రెయిన్ నుంచి శబరిమలకు వెళ్తున్నట్లుగా సాంబశివరావు చెప్పారు.

Ayyappa3.jpg


ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్య నియమాల కలబోత అయిన అయ్యప్ప దీక్ష విశేషాలపై కార్తికమాసంలో భక్తులలో మరింత అవగాహన అవసరమని ఖతర్‌లోని అయ్యప్ప స్వామి భక్తులలో ఒకరయిన శ్రీనివాస్ గద్దె అభిప్రాయపడ్డారు.

ఒమాన్ నుంచి ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వంతుల వారీగా అనేక మంది భక్తులు వచ్చి వెళ్లగా మరికొందరు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కువైత్ నుంచి కూడా కొంత మంది భక్తులు ఇప్పటికే శబరిమలకు బయలుదేరగా మరికొందరు త్వరలో వెళ్లనున్నారు. ఇక్కడ దీక్షను పాటిస్తున్నప్పటికీ ఉద్యోగరీత్యా, ఇతరత్రా కారణాల వలన నల్ల బట్టలను ధరించడం లేదని తెలుస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ సంగీత విభావరి విజయవంతం

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం వైస్ ప్రెసిడెంట్‌గా యష్ బొడ్డులూరి ఎన్నిక..

Updated Date - Nov 29 , 2026 | 07:34 PM