Share News

ఫ్రాన్స్‌లో ఎన్నారై టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

ABN , Publish Date - Aug 11 , 2026 | 08:09 AM

ప్యారిస్ నగరంలోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ వద్ద ఫ్రాన్స్ దేశ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

ఫ్రాన్స్‌లో ఎన్నారై టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
France TDP

ప్యారిస్ నగరంలోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ వద్ద ఫ్రాన్స్ దేశ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని విదేశాల్లో మరింత బలోపేతం చేయడం, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ విజయాలను తీసుకువెళ్లడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఎంతోకాలం కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో పాల్గొని, తమ ప్రతిభతో ఉద్యోగాలను సాధించారని మహేశ్ గనుపూరు గుర్తుచేశారు. ఎంపికైన అభ్యర్థులపై అనవసర ఆరోపణలు చేయడం, నియామకాల్లో అక్రమాలు జరిగాయని నిరాధార ప్రచారం చేయడం ద్వారా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మంచిది కాదని హితవు పలికారు.

‘ఏళ్ల తరబడి కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపించి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కష్టాన్ని, ప్రతిభను రాజకీయ ప్రయోజనాల కోసం అవమానించడం సరికాదు. వాస్తవాలు తెలియకుండా తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల అభ్యర్థుల కుటుంబాల్లో కూడా ఆందోళన ఏర్పడుతుంది’ అని ఆయన అన్నారు.


భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మైలురాయి

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యంత వైభవోపేతంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం అభినందనీయమని మహేష్ గనుపూరు అన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కీలకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేకంగా భోగాపురం నుంచి ప్యారిస్‌తో పాటు ఇతర ఐరోపా దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య శాఖ మంత్రి లోకేష్ చొరవ తీసుకోవాలని మహేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి యూరప్, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా అంతర్జాతీయ విమాన సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం, వ్యయం తగ్గడంతో పాటు వాణిజ్య సంబంధాలు కూడా మరింత బలపడతాయని ఆయన అన్నారు.

రాష్ట్రాభివృద్ధిలో NRIల భాగస్వామ్యం కీలకం

ప్రవాసాంధ్రుల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఎన్నారైలలో అవగాహన కల్పించాలని సమావేశంలో చర్చించారు.

ఈ కార్యక్రమంలో సంతోష్ పిల్లా, పవన్ కుమార్ మాచా, పురంధర్ చౌదరి వేమూరి, హేమంత్ గెల్లి, వేదవ్యాస్ పువ్వాడ, చరణ్ చౌదరి దబ్బారా, తరుణ్ తేజ యారం, హనుమాన్ చౌదరి పరిటాల, చరిత్ వంశీ గంట, మణికంఠ అమరేశ్వరపు, నన్నపనేని హరికిరణ్ చౌదరి, గోపి చందు పల్లపు, అరక్షి ఆకాశ్ కొల్లి, గోల్డెన్ బాబు మువ్వ, మణికంఠ యెమినేని, అభినవ్ చౌదరి వెలివెల్లి, రామకాంత్ ఆదిగొప్పుల, భువన చంద్ర మోర్ల తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

హాంకాంగ్‌లో వైభవంగా కార్గిల్ విజయ్ దివస్

గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహాలు

Updated Date - Aug 11 , 2026 | 08:22 AM