Share News

దుబాయిలో వైభవంగా GTWCA బతుకమ్మ సంబరాలు

ABN , Publish Date - Oct 19 , 2026 | 07:31 PM

గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం (జి.టి.డబ్ల్యూ.సి.ఏ) శనివారం తెలంగాణ కుటుంబాల ఆత్మీయత కలయికగా బతుకమ్మ సంబరాలను నిర్వహించింది.

దుబాయిలో వైభవంగా GTWCA బతుకమ్మ సంబరాలు
Bathukamma celebrations - Dubai

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పెద్దా చిన్నా తేడాల్లేకుండా అందరూ కలిసిమెలిసి పాడుకుంటూ మహిళలు మనస్ఫూర్తిగా పాల్గొనే పండుగ బతుకమ్మ. ప్రకృతిని మనిషి తన చేతులతో పేర్చుకున్న రూపం బతుకమ్మ. ఆ రూపంలో పూలు ఉంటాయి, భక్తి ఉంటుంది, ఆటాపాటా ఉంటాయి, సమాజం ఉంటుంది. ప్రకృతికి పెద్ద పీట వేస్తూ పూలను దేవతగా భావించే విశ్వాసం ఒకవైపు, పూలు పూసే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మరోవైపు.. ఈ రెండిటినీ కలిపే వారధిగా బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి తెలంగాణ ఆడపడుచుకు సరిహద్దులు అడ్డురావు. తరాలు మారుతూ ఆధునిక పోకడలు వస్తున్నా తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ ఆడబిడ్డల మురిపాల వేడుక బతుకమ్మ ఆ సంబరాలను చేసుకోవడానికి అరబ్బు దేశం లేదా అమెరికా అంతకన్నా అడ్డుకాదు.

4.jpg


విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతిని చాటుకోవడం ఒక నేరం లేదా అత్మన్యూనతగా పరిగణించే కాలంలో ధైర్యంగా దుబాయి గడ్డపై దాదాపు రెండు దశాబ్దాల క్రితం బతుకమ్మ సంబరాలకు శ్రీకారం చుట్టిన గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం (జి.టి.డబ్ల్యూ.సి.ఏ) ప్రతి సంవత్సరం తెలంగాణ పూల పండుగను జరుపుకుంటోంది. ఈ క్రమంలో శనివారం తెలంగాణ కుటుంబాల ఆత్మీయత కలయికగా బతుకమ్మ సంబరాలను నిర్వహించింది. రాజకీయ, కుల,మతాలు, ప్రాంతాలకు అతీతంగా గోదావరి తీరంలోని జగిత్యాల జిల్లా నుంచి కృష్ణా నదీ తీరంలోని నల్గొండ జిల్లా వరకూ అన్ని జిల్లాలకు చెందిన తెలంగాణ మహిళలు ఎనలేని ఉత్సాహంతో ఇందులో పాల్గొన్నారు.

6.jpg


తమ పూర్వీకులు తెలంగాణ అస్తిత్వం కల్గిన వారైనప్పటికీ ముంబైలో మహారాష్ట్ర పౌరులుగా స్థిరపడ్డ అనేకులు కూడా ఉరకలు వేసే ఉత్సాహంతో సంబరాలలో పాల్గొన్నారు. గాలిపల్లి జగదీశ్, యోగిత, రచన, ఉమేశ్ గనపుర్, క్యాతం అనితలు ముంబైలో పుట్టి పెరిగి దుబాయిలో స్థిరపడినప్పటికీ తెలంగాణలో తమ పూర్వీకులు పాడినట్లుగా బతుకమ్మ పాటలను పాడారు.

Jagadish Yogitha.jpg

గోదావరి తీరంలోని జగిత్యాల జిల్లాకు చెందిన పాలడుగు సబితా మహిపాల్ రెడ్డి (రాయికల్) నుంచి కృష్ణా నది తీరంలోని నల్గొండ జిల్లాకు చెందిన ఉషాశ్రీ నవీన్ రెడ్డి (పెద్దవూర) వరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విభిన్న ప్రాంతాలకు చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పన్నెండేళ్ల సాయి శ్రీకరి, సాన్వీక, జెన్ జీ తరానికి చెందిన ఉవీణా రెడ్డి, అంకిత గుప్త సురిశెట్టి, సాయి కృతికల మొదలు గతంలో గ్రామంలోని చెరువు గట్టపై గనుగు పూలతో సద్దుల బతుకమ్మ ఆడిన బామ్మ రాజలక్ష్మి వరకూ బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నవ్వుతూ ఆప్యాయతతో గడిపారు.

Sabita Mahipal Reddy.jpg


తెలంగాణ నేలపై పూలు పువ్వులు పూసినంత కాలం తెలంగాణ ఆడబిడ్డ ఎక్కడున్నా బతుకమ్మ సంప్రదాయం సజీవంగా ఉంటుందని జువ్వాడి సౌమ్య, దామెర నాగమణి, జయబద్దూరులు వ్యాఖ్యానించారు. తమ ఊరి కూడలిలో బతుకమ్మ ఆడిన అనుభూతి కల్గిందని వరంగల్ జిల్లాకు చెందిన శీలం లక్ష్మి మల్లిఖార్జున రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పాటల ద్వారా భాష, యాస, సంప్రదాయాలు ఒక తరం నుంచి మరో తరానికి చేరుతాయని హైదరాబాద్‌ నగరానికి చెందిన వీరమల్ల అశ్వీని, ముంబైకి చెందిన శారద పుట్టవర్తి అన్నారు. దుబాయిలో కాదు తమ కోరుట్లలో ఉన్న అనుభూతి కల్గుతోందని ఆడెపు కల్పన ప్రణ్యరాజ్ అన్నారు.

Madhusri Bhavani.jpg

ప్రతి సంవత్సరం తామందరం కలిసిమెలిసి దుబాయిలో బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఒక మధుర అనుభూతి అని హైదరాబాద్‌కు చెందిన స్వప్న పారెపు చెప్పారు. దుబాయిలో పుట్టిపెరిగిన తాను టీవీలలో తప్ప నిజమైన బతుకమ్మను దుబాయిలో మాత్రమే చూస్తున్నట్లుగా మధుశ్రీ భవానీ అనే యువతి చెప్పింది. తెలంగాణకు దీటుగా తాము దుబాయిలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం గర్వంగా ఉందని రజిత గంజి, యోగిత, విజేత సుద్దాలలు చెప్పారు. షార్జాలోని భారతీయ పాఠశాలలో 9వ తరగతి బేతి వినూత్న రెడ్డి (జగిత్యాల జిల్లా మోరపల్లి గ్రామం) అనే బాలిక గౌరమ్మను సంప్రదాయబద్ధంగా పూలతో అలంకరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. తమ సుదీర్ఘ ప్రవాసీ జీవనంలో ఈ బతుకమ్మ అనేది జీవితాంతం గుర్తుగా ఉంటుందని అన్నపూర్ణ అతకానీ (కరీంనగర్) అన్నారు.

Mother of.jpg


బతుకమ్మలో వినియోగించే సంప్రదాయ తంగేడు, ఇతర పూలను ప్రత్యేకంగా తెలంగాణ నుంచి తీసుకువచ్చి పేర్చారు. జగిత్యాల జిల్లా మంగేళ గ్రామానికి చెందిన దాసరి రమేశ్ స్వదేశం నుండి ప్రత్యేకంగా పూలను తీసుకువచ్చారు.

రాజకీయ సభలకు జనాలను తరలించడం తరహాలో కాకుండా పూర్తిగా గౌరమ్మపై విశ్వాసంతో ఆధ్యాత్మికంగా, సంప్రదాయబద్ధంగా ఆనందాన్ని పంచుకోవాలనుకోనే ఆసక్తి కల్గిన సామాన్య కుటుంబాల లక్ష్యంగా మాత్రమే తాము ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తామని నిర్వాహకులు జువ్వాడి శ్రీనివాస రావు, సలాఓద్దీన్, సామ్యుల్ తెలిపారు. గత 19 సంవత్సరాలుగా ఏకధాటిగా బతుకమ్మను దుబాయిలో నిర్వహించడం ఒక మధుర అనుభూతి అని మహిళ నాయకురాళ్లు భారతి రెడ్డి, జ్యోతి, సౌమ్యలు పేర్కొన్నారు.

5.jpg


ముస్లింలు, క్రైస్తవులు కూడా వాలంటీర్లుగా వచ్చి భోజన వసతి, ఇతర ఏర్పాట్లను చూసుకోవడం ద్వారా తెలంగాణ గంగా జమునా సంస్కృతిని చాటారు. ప్రొఫెసర్ నవీద్, ముజఫర్, ముజీబ్, అబ్బు, షకీల్ తదితరులు భోజన వసతి ఏర్పాట్లను చూసారు.

మాక్ ఇంటర్నేషనల్, మిరల్డ్ గోల్డ్, ఎస్.ఆర్.ఆర్ బిల్డింగ్ మెటీరియల్స్, ఎల్.ఎస్.పి.ఎం.కె, స్క్వేర్ యార్డ్స్, లెమన్ పోటోగ్రూఫ్, ఏటీయం రెస్టారెంట్ తదితరులు కార్యక్రమానికి తోడ్పాటు అందించారు.

2.jpg3.jpg


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో తెలంగాణ సంస్కృతి వైభవం.. బతుకమ్మ పాటలు, ఆటలతో హోరెత్తిన నార్త్ కరోలినా!

పూల పరిమళాలతో పరవశించిన మలేషియా.. తెలుగు సంస్కృతికి ప్రవాసుల నీరాజనం

Updated Date - Oct 19 , 2026 | 07:44 PM