Share News

దుబాయిలో నూలు పోగుతో మొదలై పద్మంగా వికసించిన పద్మశాలీ సమాజం

ABN , Publish Date - Nov 23 , 2026 | 08:36 PM

దుబాయి పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వనభోజనాలలో నిత్య యాంత్రిక జీవనంతో నిమగ్నమై ఉండే దుబాయి నగర పద్మశాలీల్లో ఆధ్యాత్మికత, ఆత్మీయత వెల్లివిరిసింది.

దుబాయిలో నూలు పోగుతో మొదలై పద్మంగా వికసించిన పద్మశాలీ సమాజం
Dubai Padmashali Association Karthika Vanabhojanam

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: గల్ఫ్ దేశాలకు వలసలు అరంభమైన కాలంలో నౌకలలో ప్రయాణించి వెళ్లిన తెలుగు వారిలో పద్మశాలీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఒక చిన్న నూలు పోగుతో మొదలైన వారి ప్రవాసం ప్రస్తుతం ఒక సువిశాల ఎడారి వరకూ చేరుకుని సగర్వంగా పద్మశాలీగా చెప్పుకుంటూ పండుగలు చేసుకునే స్థాయికి ఎదిగింది.
NRI2.jpg


అలనాడు బొంబాయి, భీవండి, షోలాపూర్‌లకు వలస వెళ్లి మరాఠీ సంస్కృతిలో మమేకమైనా తమ మూల తెలుగుతనాన్ని మరువలేదు. ఇప్పుడు, ఎల్లలు దాటినా తమ సంస్కృతి, ఆచారాల పట్ల పద్మశాలీలకు ఉన్న అభిరుచి కార్తీక మాసం సందర్భంగా దుబాయిలో ఆదివారం జరిగిన వన భోజనాల కార్యక్రమం ప్రతిబింబించింది. దుబాయి పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వనభోజనాలతో నిత్య యాంత్రిక జీవనంతో నిమగ్నమై ఉండే దుబాయి నగర పద్మశాలీలలో ఆధ్యాత్మికత, ఆత్మీయత వెల్లివిరిసింది. కార్యక్రమం కేవలం ఒక సంప్రదాయంగా కాకుండా, ఆత్మీయత, ఐకమత్యాలను ప్రతిబింబించింది.

NRI3.jpg


ఆకాశంలో సగం ...వనంలో మొత్తం తామంటూ ఆడపడుచులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్రవహించారు. యోగిత గాలిపెల్లి, దీపిక అలిగేటి, జయ బద్దూరి, లక్ష్మి గుంటుక, అనూజ అనుమల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్దేశించారు. ముంబైలో పుట్టి పెరిగినా తెలుగు వాసన అందునా తెలంగాణ మాగాణిని మరువని ఆడబిడ్డలు తమ సత్తాను ప్రదర్శించారు. దీన్ని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా మాత్రమే కాకుండా వివిధ రకాల ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు, పెద్దలందరూ కలిసి అందర్నీ అలరించారు.

NRI4.jpg


బాలబాలికల ఆటల పోటీలను స్థానిక మెట్రోపోలిటన్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివే నందిని ఏలిగేటి అనే బాలిక రసవత్తంగా నిర్వహించింది. భార్యాభర్తలు కలిసి కపుల్ గేమ్స్‌గా నిర్వహించిన వివిధ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమ నిర్వహణను పద్మశాలీ సంఘం నాయకులు సదానందం, లక్ష్మీ నారాయాణ, జగదీష్, సుధాకర్, ఆశోక్, శ్రీనివాస్‌లు సమన్వయం చేశారు.

NRI5.jpg


ఈ వార్తలనూ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో తానా ఫౌండేషన్ సేవలను విస్తృతం చేస్తాం: చైర్మన్ డాక్టర్ నల్లూరి ప్రసాద్

సంక్రాంతి ఇండియన్ కిచెన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ నిమ్మగడ్డకు ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’ గౌరవం

Updated Date - Nov 23 , 2026 | 08:56 PM