గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:08 PM
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియమితులయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా టీడీపీని బలోపేతం చేయడం, పార్టీలో యువత భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కీలక అడుగు పడింది. తెలుగుదేశం పార్టీ సంస్థాగత విస్తరణ, ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ నెట్‌వర్క్ బలోపేతం లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డాక్టర్ రాజా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రచారానికి దూరంగా ఉంటూ పార్టీ కోసం తెరవెనుక విశేషంగా పనిచేసిన డాక్టర్ రాజా సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం, ప్రవాస తెలుగువారితో ఆయనకున్న అనుబంధం, సంస్థాగత అనుభవం, నాయకత్వం, వ్యూహాత్మక దృష్టిని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలను అప్పగించింది.
ఈ సందర్భంగా డాక్టర్ రాజా మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాలను సమన్వయం చేసి బలమైన గ్లోబల్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని అన్నారు. ప్రవాస తెలుగు వారి మేధస్సు, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నవకల్పన, యువత సాధికారతకు అనుసంధానం చేస్తామని చెప్పారు.
ఏఐ, డిజిటల్ పరివర్తన యుగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువ నిపుణులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్య, వైద్యం, వ్యవసాయం, స్టార్టప్‌లు, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో భవిష్యత్‌కు తగిన పరిష్కారాల కోసం పనిచేస్తామని డా. రాజా చెప్పారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని మరింత బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలక శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా తదితర దేశాల్లోని ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డాక్టర్ రాజా నియామకాన్ని హర్షాతిరేకాలతో స్వాగతించారు. వివిధ దేశాల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
సంస్కృతి బహ్రెయిన్ నూతన కార్యవర్గం ఎన్నిక
జోరందుకున్న ప్రవాసాంధ్ర పదవుల పందేరం.. టీడీపీ శ్రేణుల సంబరాలు