Share News

జోరందుకున్న ప్రవాసాంధ్ర పదవుల పందేరం.. టీడీపీ శ్రేణుల సంబరాలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:21 PM

విదేశాల్లోని తెలుగుదేశం శ్రేణులు సుదీర్ఘ కాలం పాటు ఎదురు చూసిన వివిధ కమిటీల నియామకాలను ఏపీ సర్కారు దాదాపు పూర్తి చేసింది.

జోరందుకున్న ప్రవాసాంధ్ర పదవుల పందేరం.. టీడీపీ శ్రేణుల సంబరాలు
Radhakrishna, Jayakumar, Srinivas Rao

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: విదేశాల్లోని తెలుగుదేశం శ్రేణులు సుదీర్ఘకాలం పాటు ఎదురుచూసిన వివిధ కమిటీల నియామకాలను ఏపీ సర్కారు దాదాపు పూర్తి చేసింది. విశ్వవ్యాప్తంగా ప్రవాసాంధ్రులకు చేరువ కావాలనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాల్లో భాగంగా విదేశాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా ముగ్గురు ప్రవాసాంధ్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులుగా ప్రత్యేక జీతభత్యాలు, గౌరవమర్యాదలు వీరికి ఉంటాయి.

ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న మధ్యప్రాచ్య అరబ్బు దేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాలకు రావి రాధాకృష్ణ, ఐరోపా దేశాలకు జయకుమార్ గుంటుపల్లి, ప్రపంచంలోని మిగిలిన దేశాలకు శ్రీనివాస్ పల్లపోటులు ప్రత్యేక ప్రతినిధిలుగా నియమితులయ్యారు. వీరితో పాటు ఉత్తర అమెరికాలో పెట్టుబడుల వ్యవహారాల కోసం ప్రధాన సంధానకర్తగా సతీష్ మండువ కూడా నియమితులయ్యారు.

Liason Officer.jpg


చమురు ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామి అయిన సౌదీ అరేబియాలో ఆయిల్, గ్యాస్ రంగంలో వ్యాపారం చేసే రాధాకృష్ణ స్వస్థలం కోనసీమ జిల్లా సఖీనేటిపల్లి మండలం. భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు నివసిస్తున్న కోనసీమ జిల్లా నుంచి ప్రాధాన్యం కలిగిన పదవి అందుకొన్న ప్రప్రథమ ప్రవాసీయుడిగా గుర్తింపు పొందారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా దాన్ని అంటిపెట్టుకునే ఉన్న ఆయన గత ఎన్నికల సందర్భంగా తన వ్యాపారాలను వదిలి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రేయింబవళ్ళు పని చేశారు. విదేశాలలోని ప్రవాసాంధ్రులతో ఫోన్ల ద్వారా తమ తమ స్వస్థలాల్లో వారికి తెలుగుదేశానికి ఓటు వేయడానికి చెప్పించే వినూత్న కార్యక్రమానికి ఆయన సారథ్యం వహించడంతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వివాదరహితుడిగా పేరొందిన ఆయనకు ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోని మిగిలిన వారి కంటే ఎక్కువ సానుకూల ఓట్లు వచ్చాయి. గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీ పటిష్ఠతకు నిబద్ధతతో పని చేస్తున్న ఆయన కృషికి దక్కిన ఫలితం ఇదని చెప్పవచ్చు.

ఐరోపా ఖండంలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన జయకుమార్ గుంటుపల్లి స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. లండన్ లోని బ్రిటన్ తెలుగు సంఘానికి రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేసిన ఆయన దశాబ్ద కాలానికి పైగా తెలుగుదేశం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. బ్రిటిష్ జాతీయుడైన ఆయన అక్కడే విద్యాభ్యాసం చేసి హోటల్ రంగంలో ఉన్నారు. తెలుగుతో పాటు ఆనర్గళంగా గుజరాతీ, పంజాబీ భాషలు మాట్లాడే జయకుమార్‌కు బ్రిటన్‌లో అధిక సంఖ్యలో ఈ వర్గ ప్రవాస భారతీయులతో కూడా మంచి సంబంధాలున్నాయి.


ఆఫ్రికా, ఆస్ట్రేలియా సహా ఇతరులకు కేటాయించని అన్ని దేశాలకు ఆస్ట్రేలియాలో నివసించే పల్లపోతు శ్రీనివాస రావును ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. గుడివాడకు చెందిన ఆయన తన బాల్యం నుంచి టీడీపీ అభిమాని. గత ఎన్నికల్లో ప్రత్యేకంగా వచ్చి కొడాలి నానీ ఓటమికి తనవంతు కృషి చేశారనే పేరుంది.

అమెరికాలో పెట్టుబడుల వ్యవహారాలకు లియేసాన్ ఆఫీసర్‌గా నియమితులైన సతీష్ మండువది ప్రకాశం జిల్లా, అమెరికాలో మూడు దశాబ్దాలకు పైగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఆయనకు తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడిగా పేరుంది.

ఈ నాలుగు పేర్లను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోద ముద్ర వేసింది.

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీఎన్నార్టీ సంస్థలో కోఆర్డినేటర్లుగా 600 మంది ప్రవాసాంధ్రులను నియమించగా అందులో అత్యధికులు కూటమి భాగస్వామ్య జనసేనకు చెందిన వారున్నారు. దీనిపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే, తెలుగుదేశం పార్టీ ప్రవాసాంధ్ర విభాగాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ సమూల మార్పులతో, వివిధ సమీకరణలతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో పార్టీ కార్యకర్తలతో నూతన కార్యవర్గాన్ని కూడా త్వరలో ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

తానా ఛార్లెట్ నాయకుల దాతృత్వం

BATA ఆధ్వర్యంలో లైవ్ కాన్సర్ట్.. అదరగొట్టిన దేవీ శ్రీ ప్రసాద్

Updated Date - Jul 07 , 2026 | 06:37 PM