భారత్‌లో పార్లమెంటు సమావేశాలు.. దుబాయిలో రసవత్తర రాజకీయ డ్రామా
ABN , Publish Date - Nov 29 , 2026 | 07:53 PM
కీలకమైన పార్లమెంటు సమావేశాలలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ఓ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడిని దుబాయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాకుండా రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన కుటుంబం అరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: కీలకమైన పార్లమెంటు సమావేశాలలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ఓ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడిని దుబాయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాకుండా రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన కుటుంబం అరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
నరాల వ్యాధితో బాధపడుతున్న కేరళలోని కన్నూర్ లోక్‌సభ సభ్యుడు కె. సుధాకరన్ వైద్య చికిత్స కోసం ఆబుధాబి మీదుగా అమెరికాకు వెళ్తుండగా, మార్గమధ్యంలో పార్టీ ఆదేశానుసారం తన అమెరికా ప్రయాణాన్ని విరమించుకుని వైద్య సలహాల నిమిత్తం దుబాయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అయితే, ఎంపీ, కుటుంబం అభిప్రాయంతో సంబంధం లేకుండా ఆయనను ఐసీయుకు తరలించారనే అరోపణ ఉంది.
ఎంపీ తనయుడు, అల్లుడు పరామర్శ కోసం ఆసుపత్రికి వెళ్లినా కలుసుకోవడానికి అనుమతించకపోవడం, ఆ పేరు కలిగిన రోగి ఎవరూ లేరని ఒకసారి చెప్పడం.. న్యూ ఢిల్లీ నుంచి అధికార పెద్ద ఒకరి సూచన మేరకు చికిత్స జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు మరోసారి చెప్పడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వారు కాంగ్రెస్ నాయకులు రమేశ్ చెన్నితాల, కె.సి. వేణుగోపాల్‌లకు పరిస్థితిని వివరించడంతో పాటు ఎంపీ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారా రాహుల్ గాంధీని కూడా సంప్రదించారు.
ఆ తరువాత దుబాయిలోని ఒక న్యాయవాది జోక్యం చేసుకోవడంతో రోగికి ఏమి జరిగినా తాను బాధ్యత తీసుకోంటానని ఆయన తనయుడు సంజోగ్ లిఖితపూర్వక హామిని ఇచ్చిన తర్వాత మాత్రమే పార్లమెంటు సభ్యుడిని ఆసుపత్రి నుండి ఆదివారం డిశ్చార్జి చేసారు. కానీ ప్రయాణానికి ముందు మరోసారి ఆసుపత్రి నుంచి అనుమతి పొందాలని షరతు విధించడంతో ఇతర ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని అనుమతి తీసుకుంటామని ఎంపీ కుటుంబం చెప్పింది. న్యూఢిల్లీలోని ఉన్నత స్థాయి రాజకీయ కుట్రలో భాగంగా ఎంపీ ప్రయాణాన్ని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
దుబాయి నుంచి న్యూఢిల్లీకి ఆదివారం రాత్రి ఎమిరేట్స్ విమానం ద్వారా వెళ్లడానికి ఎంపీ టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ ఎంపీ విమానమెక్కే వరకూ ఉత్కంఠ కొనసాగుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ సంగీత విభావరి విజయవంతం
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం వైస్ ప్రెసిడెంట్‌గా యష్ బొడ్డులూరి ఎన్నిక..