బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ బోనాల పండుగ
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:12 PM
ఇరాన్ క్షిపణి దాడులతో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న బహ్రెయిన్‌లో తెలుగు ప్రవాసీ సమాజం శాంతిసౌభాగ్యాలు కోరుతూ బోనాల పండుగను జరుపుకుంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఇరాన్ క్షిపణి దాడులతో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న బహ్రెయిన్‌లో తెలుగు ప్రవాసీ సమాజం శాంతిసౌభాగ్యాల కోసం మహంకాళీ అమ్మవారిని ప్రార్థిస్తూ బోనాల పండుగను జరుపుకుంది. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బోనాల పండుగలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు పాల్గొన్నారు. బోనాలు అనేది నిండు తెలంగాణ సంప్రదాయక పండుగ అయినప్పటికీ ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రవాసీయులు పాల్గొనడమే కాకుండా కార్యక్రమ నిర్వహణలో అగ్రభాగాన ఉండడం ద్వారా పరాయి దేశంలో తెలుగువారందరూ ఒక్కటేనని చాటారు.

భారతీయ రాయబారి వినోద్ జాకబ్ ముఖ్య అతిథిగా, భారతీయ స్టేట్ బ్యాంకు సీనియర్ అధికారులు షణ్ముగ రాజ్, ప్రశాంత్ రెడ్డిలు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోతరాజుల ప్రదర్శన, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోతరాజు పాత్ర వేసిన ప్రతిసారి తాను హైదరాబాద్‌లో మహంకాళీ అమ్మవారి ఎదురుగా ఉన్న అనుభూతి కలుగుతుందని బహ్రెయిన్‌లో నాలుగేళ్ల క్రితం ప్రప్రథమంగా పోతరాజు వేషధారణ చేసిన హైదరాబాదీ శ్రీరాం చెప్పారు. బాల్యంలో తాను తన తాత పోతరాజు పాత్రధారులను అలంకరించే తీరును చూసి బహ్రెయిన్‌లో పోతరాజుల పాత్రధారులను అలంకరిస్తున్నట్లుగా జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మ్యాదరి అక్షయ అన్నారు.

ఈ సందర్భంగా చిన్నారులు వివిధ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించగా వీటికి లక్ష్మీ దీపక్, తన్మయి, ఉషా శెట్టి, జశ్వీత, హాసినిలు దర్శకత్వం వహించారు. రేవతి మార్గదర్శకత్వంలో ప్రహాస్య, తస్య, చిత్రా, మౌలిక, సునైనా, శ్రీదేవి, రోణికా, అన్వితలు.. అష్ట లక్ష్మి అవతారంలో ప్రదర్శించిన పాత్రలు పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. గంగ సాయి, ప్రసాద్‌ల బృందం పాడిన బోనాల పాటలు, భానుమతి సమన్వయంతో జరిగిన బోనాల ప్రదర్శన లాల్ దర్వాజ అమ్మవార్ల సందడిని పునరావృతం చేసింది.

పెద్దపులి వేషధారణలో కరుణాకర్, రాజ్యం, బుమ్మన ఉమ, ప్రసాద్‌లు ఆహ్లదపర్చగా డప్పు వాయిద్యంతో రవి నేతృత్వంలోని బృందం దండోరా మోగించింది. వేదికను అమృత్ సహాయంతో వాణి, సింధూజలు అలకరించగా సింగిరెడ్డి రాంరెడ్డి భారతదేశం నుండి ప్రత్యేకంగా మామిడి ఆకులను తెప్పించారు. బహ్రెయిన్‌లో కుల, మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి తెలుగువారి పండుగలను తాము కలిసిమెలిసి నిర్వహించుకుంటామని తెలుగు ప్రవాసీ ప్రముఖులు తక్కెళ్లపల్లి హరిబాబు, కె. వెంకటస్వామిలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:
మిస్సోరీలో శతచండీ సహిత రుద్రయాగంలో సహస్ర కుంకుమార్చన
తెలుగు బాలిక సత్తా... యూఎస్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం