దేవుళ్లే దిగి వస్తే..!
ABN , Publish Date - Mar 30 , 2026 | 03:24 AM
పురాణ గాథలను వాటి చుట్టూ అల్లుకున్న తన చిన్ననాటి జ్ఞాపకాలను అందమైన సాఫ్ట్ టాయ్స్‌గా మార్చేస్తోంది 22 ఏళ్ల ప్రిష కుందా. భారత, భాగవత, రామాయణ కథల్లోని...
పురాణ గాథలను వాటి చుట్టూ అల్లుకున్న తన చిన్ననాటి జ్ఞాపకాలను అందమైన సాఫ్ట్ టాయ్స్‌గా మార్చేస్తోంది 22 ఏళ్ల ప్రిష కుందా. భారత, భాగవత, రామాయణ కథల్లోని ప్రధాన పాత్రలను సూపర్ హీరోలుగా మార్చి నేటి తరం పిల్లల ముందు నిలబెడుతోందామె. ‘మైత్రో’ బ్రాండ్ పేరుతో ఆమె రూపొందించిన దేవతా మూర్తుల సాఫ్ట్ టాయ్స్... పిల్లలతో సహా పెద్దలనూ అలరిస్తున్నాయి. అంతేకాదు పురాణాల్లోని కథలు, సాహసాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. బొమ్మల ద్వారా పిల్లలకు పురాణాలను దగ్గర చేయాలనే ఆశయంతో వినూత్నంగా ప్రయత్నిస్తున్న ప్రిష ప్రస్థానమిది...
ఆలోచన ఎలా వచ్చిందంటే...
చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్య చెప్పే పురాణ కథలు వింటూ పెరిగింది ప్రిష. ఆ కథల్లోని దేవతా పాత్రలు చేసే సాహసాలు విన్నప్పుడు వారిని హీరోలుగా ఊహించుకునేది. వయసుతోపాటే ఆమెకు పురాణ కథల పట్ల ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. హైస్కూల్లో చదువుతున్నప్పుడే భారత, భాగవత, రామాయణాలను లోతుగా అధ్యయనం చేసి అనేక అంశాలపై పట్టు సాధించింది. విష్ణు అవతారాలతో సహా సత్య, త్రేతా, ద్వాపర, కలి యుగాల్లో జరిగిన పలు సంఘటనలన్నీ ప్రస్తుత సమాజాన్ని ఇప్పటి మానవ జీవితాన్ని ప్రతిబింబించడం ఆమె గమనించింది. తనకు తెలిసిన ఈ విషయాలను అందరికీ ముఖ్యంగా పిల్లలకు చెప్పాలనుకుంది. ఈ పురాణ సంఘటనలనే చిన్న చిన్న కథలుగా మార్చి చెబితే పిల్లలకు చిన్నప్పటినుంచే విలువల గురించి తెలియజేస్తూ జీవితంపై సరైన అవగాహన కల్పించవచ్చనే ఆలోచన ఆమెకు వచ్చింది. పిల్లల సైకాలజీ గురించి ప్రిషకు బాగా తెలుసు. పిల్లలు కళ్లతో పరిశీలిస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ముఖంలో హావభావాలు పలికిస్తూ కథ చెప్పడంతోపాటు ఆయా పాత్రలను కళ్ల ముందు ఉంచితే పిల్లలు ఇంకా బాగా అర్థం చేసుకోగల్గుతారంటారు ప్రిష. అందుకే పిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మలతో కథలు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుందనుకున్నారు. నాలుగేళ్ల కిందట ‘మైత్రో టాయ్స్’ సంస్థను నెలకొల్పి దేవతా మూర్తుల రూపాలతో సాఫ్ట్ టాయ్స్ తయారీకి ప్రయత్నాలు ప్రారంభించారు.

ఎదురైన కష్టాలెన్నో...
బొమ్మల తయారీకి సంబంధించి ఎలాంటి అనుభవమూ లేకపోవడంతో ప్రిషకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. నెలల తరబడి ఎంతోమంది తయారీదారులను కలుస్తూ 70కి పైగా ఫ్యాక్టరీలను సందర్శించారు. చాలామందికి ఇలాంటి బొమ్మలను తయారుచేయడంలో సరైన అవగాహన లేదు. చివరకు బొమ్మల తయారీలో ప్రయోగాలు చేసే ఓ ఫ్యాక్టరీ ముందుకు వచ్చింది. రెండేళ్లపాటు రకరకాల నమూనాలు తయారుచేస్తూ వాటిని మెరుగుపరుస్తూ ఎట్టకేలకు అందమైన సాఫ్ట్ టాయ్స్‌ను రూపొందించడంలో విజయం సాధించారు ప్రిష. ప్రస్తుతం హనుమాన్, గణేశ్, కృష్ణ, భీమ్ తదితర మూర్తుల బొమ్మలను రూపొందిస్తున్నారు. వీటితో పిల్లలు కేవలం ఆడుకోవడమే కాదు ఆ పాత్రలను అర్థం చేసుకోవడానికి వారి సాహసగాథలను తెలుసుకోవడానికి ఉత్సుకత చూపడం విశేషం అంటున్నారామె. ప్రస్తుతం ప్రిష యూకేలోని ససెక్స్ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్-మార్కెటింగ్ విత్ సైకాలజీ కోర్సు చేస్తున్నారు. రెండు మూడు నెలలకోసారి భారతదేశానికి వస్తూ సాఫ్ట్ టాయ్స్ తయారీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. సోదరుడు ప్రతీక్ సహకారంతో దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవహారాలు నిర్వహిస్తున్నారు.
ఆనందంగా ఉంది..!
ప్రస్తుతం పిల్లలు విపరీతంగా మొబైల్ ఫోన్స్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. పాప్ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ఈ ధోరణిని మార్చి పిల్లలను పౌరాణిక గాథలవైపునకు మరల్చేందుకు మైత్రో టాయ్స్ దోహదం చేస్తాయని ప్రిష నమ్మకంగా చెబుతున్నారు. కుటుంబ విలువలతో నీతి నియమాలతో నిర్దేశించిన జీవన విధానాన్ని సూచించే గాథలెన్నో మరుగున పడుతున్నాయి. వీటన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి కొంతమేరకు ఆధునీకరించి పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారామె. ప్రస్తుతం పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులనుంచి మంచి స్పందన వస్తోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కేవలం వ్యాపార విస్తరణ మాత్రమే తన లక్ష్యం కాదని మైత్రో టాయ్స్ ద్వారా కొంతమంది పిల్లలకైనా పౌరాణిక గాథల పట్ల అవగాహన కల్పించి వారి పురోగతికి తోడ్పడితే విజయం సాధించినట్లే భావిస్తానంటున్నారు ప్రిష. ఎన్ని యుగాలు మారినా చక్కని విలువల కారణంగా పౌరాణిక గాథలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని మైత్రో టాయ్స్ నిశ్శబ్దంగా చెబుతున్నాయి.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు