Share News

షడ్భుజ చక్రంలో ధ్యాన హనుమాన్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:35 AM

రామాలయాల్లో శ్రీరాముని చెంత అంజలిముద్రతో దర్శనమిచ్చే ఆంజనేయుడికి దేశమంతటా ప్రత్యేకంగా ఆలయాలున్నాయి. వాటిలో ఆయన ప్రధానంగా గదాధారిగా...

షడ్భుజ చక్రంలో ధ్యాన హనుమాన్‌

ఆలయ దర్శనం

రామాలయాల్లో శ్రీరాముని చెంత అంజలిముద్రతో దర్శనమిచ్చే ఆంజనేయుడికి దేశమంతటా ప్రత్యేకంగా ఆలయాలున్నాయి. వాటిలో ఆయన ప్రధానంగా గదాధారిగా, అభయముద్రతో కనిపిస్తాడు. అలాగే రహదారులపైన కూడా హనుమంతుడి విగ్రహాలు సమున్నతంగా నిలిచి ఉంటాయి. అయితే వీటన్నిటికన్నా భిన్నంగా... యంత్రం మధ్యలో కొలువైన పవనసుతుడి మందిరం కర్ణాటకలో ఉంది. చారిత్రకంగానూ విశేషమైన ఆలయం ఇది.

కర్ణాటకలోని హంపీ సమీపంలో ఉన్న అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుడి జన్మ స్థలంగా పరిగణిస్తారు. (మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా అంజనేరి, జార్ఖండ్‌లోని అంజన్‌ గ్రామ్‌లు కూడా ఆంజనేయుడు పుట్టిన ప్రదేశాలుగా ప్రాచుర్యం పొందాయి). త్రేతాయుగంలో శ్రీరాముణ్ణి హనుమంతుడు తొలిసారిగా కలుసుకున్న చోటు అంజనాద్రేనని స్థల పురాణం చెబుతోంది. భక్తులు ఈ ప్రదేశాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. హనుమంతుడి విగ్రహం ఒక యంత్రం మధ్యలో... పద్మాసనంలో కూర్చొని ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ద్వైత సిద్ధాంత ప్రచారకుడు, విజయనగర సామ్రాజ్యానికి రాజగురువు అయిన శ్రీవ్యాసరాజులు 500 ఏళ్ళ క్రితం... అక్కడ యంత్రోద్ధారక హనుమంతుడి ఆలయాన్ని నిర్మించినట్టు, విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి.

హనుమంతుడి ఆదేశం

శ్రీవ్యాసరాజులు ప్రతిరోజూ తుంగభధ్ర తీరంలో ఉన్న అంజనాద్రి పర్వతంపైన... రాళ్ళ మీద హనుమంతుడి బొమ్మను బొగ్గుతో గీసి పూజలు చేసేవారట. పూజలు ముగిసిన వెంటనే ఆ బొమ్మ మాయమయ్యేదట. అలా పన్నెండు రోజులు జరిగిన తరువాత... హనుమంతుడు ఆయనకు ప్రత్యక్షమై... అక్కడ షడ్భుజాకార యంత్రం లోపల ధ్యానం చేస్తూ ఆసీనుడై ఉన్న రీతిలో తన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆదేశించాడట. ఆ ప్రకారం ఎనిమిది అడుగుల ఏక శిల మీద ఈ విగ్రహాన్ని చెక్కించి ప్రతిష్ఠించారనే కథ ఉంది. హంపీలోని విరూపాక్ష ఆలయం తరువాత అతి ముఖ్యమైన ఆలయంగా దీన్ని పరిగణిస్తారు. శ్రీవ్యాసరాజులు మొత్తం 732 హనుమాన్‌ విగ్రహాలను ప్రతిష్ఠించారనీ, వాటిలో ఇదే మొదటిదనీ చెబుతారు. శ్రీవ్యాసరాజులు పన్నెండు రోజులు అక్కడ స్వామిని ఆరాధించినదానికి గుర్తుగా... ఆ విగ్రహం చుట్టూ పన్నెండు వానరాకృతులు ఉంటాయి. స్వామి ఆలయంలో యంత్రోద్ధారక హనుమాన్‌ స్తోత్రం లిఖించి ఉంటుంది. దాన్ని ఆరు నెలల పాటు రోజుకు మూడుసార్లు పఠిస్తే అభీష్టాలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే... శ్రీనివాసుడి ఆలయం ఉంది. అందులోని విగ్రహాన్ని స్వయంగా శ్రీవ్యాసరాజులే చెక్కారని ప్రతీతి.


ఎలా వెళ్ళాలి?

యంత్రోద్ధారక హనుమాన్‌ ఆలయం హంపీ పట్టణం దగ్గరలోని అంజనాద్రిపై ఉంది. సమీప రైల్వే స్టేషన్‌ 15 కిలోమీటర్ల దూరంలోని హోస్పేటలో ఉంది.

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 05:35 AM