నేను ఎవరు?
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:27 AM
ఆధ్యాత్మికమైన, తాత్త్వికమైన మార్గంలో సాధన చేసే వారికి తమ అస్తిత్వానికి మూలం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. క్రమేపీ ఆ తపన పెరుగుతుంది. ఆత్మవిచారణ...
చింతన
ఆధ్యాత్మికమైన, తాత్త్వికమైన మార్గంలో సాధన చేసే వారికి తమ అస్తిత్వానికి మూలం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. క్రమేపీ ఆ తపన పెరుగుతుంది. ఆత్మవిచారణ సాగిస్తున్నప్పుడు ‘నేను ఎవరు?’ అనే ప్రశ్న తరచూ వారిని వెంటాడుతూ ఉంటుంది. అటువంటి అన్వేషకుల్లో ఎం.శివప్రకాశం పిళ్ళై ఒకరు. ఆయన తత్త్వ శాస్త్రంలో పట్టభద్రుడు. ఆనాటి దక్షిణ ఆర్కాట్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారి. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా... 1902లో తిరువణ్ణామలై (అరుణాచలం)కి వెళ్ళారు. అక్కడ విరూపాక్ష గుహలో ఉన్న శ్రీరమణ మహర్షిని కలిశారు. తన సందేహాలన్నిటినీ స్వామి ముందు ఉంచారు. తనకు ఆధ్యాత్మికంగా దారి చూపించాలని, తన అంతరంగంలో మెదులుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరారు.
భగవాన్ రమణులు అప్పట్లో మౌనంగా ఉండేవారు. అది ఆయనకు దీక్ష తీసుకోవడం వల్ల కాదు... మాట్లాడాలనే ఆసక్తిని వదులుకోవడం వల్ల. ఎవరైనా తనను ప్రశ్నలు అడిగినప్పుడు... వాటికి సైగలతో జవాబు ఇచ్చేవారు. ఆ సైగలు అవతలి వ్యక్తులకు అర్థం కాకపోతే... లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చేవారు. శివప్రకాశం పిళ్ళై సందేహాలను కూడా ఆ విధంగానే తీర్చారు. వాటిలో ప్రధానమైన ప్రశ్న: నేను ఎవరు? సమస్త జీవులు ఎలాంటి దుఃఖం లేకుండా... ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాయి. అద్వితీయమైన, అవధులులేని, అలౌకికమైన ఆనందాన్ని పొందాలంటే... మానవులు తమను తాము తెలుసుకోవాలి. దానికి జ్ఞానమార్గంలో పయనించడం, ఆత్మ విచారణే ప్రధాన సాధనాలు అవుతాయి.
‘‘నేను ఎవరు?’’ అనే పిళ్ళై ప్రశ్నకు శ్రీరమణులు బదులిస్తూ... ‘‘ఏడు ధాతువులతో కూడిన శరీరాన్ని ‘నేను’ కాదు. శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన (వినడం, స్పృశించడం, చూడడం, రుచి చూడడం, వాసన చూడడం) అనే కార్యాలను నిర్వహించే జ్ఞానేంద్రియాలు ‘నేను’ కాదు. మాట్లాడడం, కదలడం, పట్టుకోవడం, విసర్జించడం, సంతానోత్పత్తి చేసే (నోరు, పాదం, హస్తం, పాయువు, ఉపస్థ) కర్మేంద్రియాలు ‘నేను’ కాదు. శ్వాస తీసుకోవడం లాంటి అయిదు పనులను నిర్వర్తించే ప్రాణ, వ్యాన, సమాన, అపాన, ఉదానాలనే అయిదు ప్రాణవాయువులు ‘నేను’ కాదు. ఆలోచించే మనస్సు కూడా ‘నేను’ కాదు. బాహ్య విషయాలు కానీ, క్రియలు కానీ, అజ్ఞానం కానీ... ఇవేవీ ‘నేను’ కాదు’’ అన్నారు.
‘‘వీటిలో ఏదీ కాకపోతే మరి ఎవరు నేను?’’ అని పిళ్ళై అడిగారు.
‘‘పైన నేను పేర్కొన్న వాటన్నిటిలో ‘ఇది కాదు’, ‘ఇది కాదు’ అని నిరాకరిస్తూ పోయిన తరువాత... చిట్టచివరకు ఏ చైతన్యమైతే మిగిలి ఉంటుందో అదే ‘‘నేను’’...’’ అని బదులిచ్చారు శ్రీ రమణులు.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది