విశిష్టాద్వైత దీప్తి
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:55 AM
గురువు ఆదేశాలను ధిక్కరించి, గురు స్థానంలో నిలిచిన అద్వితీయమైన చరిత్ర శ్రీమద్రామానుజాచార్యులది. ‘‘ఈ లోకం ఆ పరమాత్ముడి లీలా విలాసం. దాన్ని కల్పించిన ఆ...
విశేషం
గురువు ఆదేశాలను ధిక్కరించి, గురు స్థానంలో నిలిచిన అద్వితీయమైన చరిత్ర శ్రీమద్రామానుజాచార్యులది. ‘‘ఈ లోకం ఆ పరమాత్ముడి లీలా విలాసం. దాన్ని కల్పించిన ఆ పరమాత్ముడి పట్ల అచంచలమైన భక్తే మోక్షానికి మార్గం’’ అని ఆయన ప్రవచించారు. ‘‘శ్రీహరిని స్వచ్ఛమైన చిత్తంతో పూజించేవారందరూ వైష్ణవులే. భక్తి కొన్ని కులాలకో, కొన్ని వర్గాలకో పరిమితం కాదు. అది సార్వజనీనమైనది’’ అని బోధించారు. మానవుల అంతిమ లక్ష్యం మోక్షం. దాన్ని సాధించడానికి ఎందరో మహనీయులు ఎన్నో మార్గాలను, సిద్ధాంతాలను అందించారు. వారిలో ముఖ్యులైన ముగ్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీమద్రామానుజాచార్యులు, శ్రీమధ్యాచార్యులు. వీరిని ‘త్రిమతాచార్యులు’ అంటారు. శ్రీమద్రామానుజులు బోధించిన సిద్ధాంతం విశిష్టాద్వైతం. ‘‘పరమాత్మ వేరు. ఆత్మ వేరు. వాటి స్వభావాలు కూడా భిన్నమే. అయితే ఆ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంది. అవి విడదీయలేనివి’ అని సూత్రీకరించారు రామానుజులు. అదే విశిష్టాద్వైత సిద్ధాంతం.
అందరికీ అష్టాక్షరి...
తమిళనాట శ్రీపెరంబదూరులో రామానుజులు జన్మించారు. ఆయన తండ్రి కేశవాచార్యులు. తల్లి కాంతిమతి. తల్లిదండ్రుల నుంచి చిన్న వయసులోనే రామానుజులకు దైవ చింతన అలవడింది. క్రమంగా అది జ్ఞానకాంక్షగా మారింది. తనకు మార్గనిర్దేశం చేసే గురువుకోసం అన్వేషణ సాగించారు. అటువంటి గురువు తిరుగోష్టియూరు అనే చోట ఉన్నారని తెలిసింది. ఆ ఊరు వెళ్ళి, ఆ గురువును కలుసుకున్నారు. అయితే ఆయనకు ఆ గురువు ఎన్నో పరీక్షలు పెట్టారు. ‘‘అప్పుడు కాదు, మరోసారి రావాలి’’ అంటూ వెనక్కి పంపించేవారు. తను నివసిస్తున్న శ్రీరంగం నుంచి తిరుగోష్ఠియూరుకు కాలినడకన పద్ధెనిమిదిసార్లు శ్రీరామానుజులు తిరిగారు. ఆయన పట్టుదలకు, జ్ఞానాభిలాషకు మెచ్చుకున్న గురువు... ‘అష్టాక్షరి’ మహామంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్ర రహస్యాలను బోధించారు. వాటిని సామాన్యులకు వెల్లడించరాదని ఆదేశించారు. ‘ఎంతో శ్రమపడి, ఎన్నోసార్లు తిరిగితే కాని ఈ మంత్రం నాకు లభించలేదు. మోక్షానికి దారి చూపించే ఈ మంత్రం కొందరికే పరిమితమయిపోతే... మిగిలినవారి పరిస్థితి ఏమిటి? ఆ పరాత్పరుడి దృష్టిలో మానవులందరూ సమానులైనప్పుడు... కొందరే మోక్షానికి అర్హులు ఎలా అవుతారు?’ అని ఆవేదన చెందారు రామానుజులు. ‘ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే... నారాయణ మంత్రం, దాని రహస్యాలు అందరికీ తెలియవలసిందే’ అనుకున్నారు. ఆలయ గోపురాన్ని ఎక్కి ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని లోకులందరికీ ఎలుగెత్తి చాటారు.
మానవత, సమత
నూట ఇరవయ్యేళ్ళ పరిపూర్ణ జీవనం గడిపిన రామానుజులు శీవైష్ణవాన్ని కుల, లింగ భేదాలు లేని ధర్మంగా తీర్చిదిద్దారు. దేశమంతటా పర్యటనలు చేశారు. వైష్ణవ సంప్రదాయాన్ని, విశిష్టాద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేశారు. ఎందరినో తన వాదనలతో ఓడించారు. శిథిలమైన ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారు. దేవాలయాలలో భక్తులకు, ఆర్తులకు భోజన వితరణ చేసే విధానాన్ని ‘రామానుజ కూటమి’ పేరుతో ప్రారంభించారు, సహపంక్తి భోజనాలకు శ్రీకారం చుట్టారు. ఈ సంప్రదాయం వైష్ణవ ఆలయాలలో నేటికీ కొనసాగుతోంది. కులాలకు అతీతంగా అందరికీ భక్తి, ముక్తి మార్గాలను చూపించిన రామానుజులు అనేక గ్రంథాలు రచించారు. భగవద్గీతకు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వీటిలో ప్రసిద్ధమైనవి. సమస్త లోకానికి సృష్టికర్త అయిన శ్రీమన్నారాయణుడి ఆరాధనే సకల దుఃఖాల నుంచి విముక్తి కలిగిస్తుందని ప్రబోధించిన శ్రీరామనుజులు మానవతను, సమతను బోధించిన మహనీయుడు.
ఇవీ చదవండి:
మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ
డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి