గంటలో డ్రోన్.. మేడిన్ విశాఖ
ABN , Publish Date - Apr 19 , 2026 | 02:04 AM
చిన్ననాటి కల నెరవేరలేదు. కానీ నిరాశపడలేదు. పదిమందికీ పనికొచ్చే పని చెయ్యాలనుకున్నారు. చిన్న సార్టప్‌తో మొదలైన అతని ప్రయాణం... భారత సైన్యానికి డ్రోన్లు సరఫరా...
చిన్ననాటి కల నెరవేరలేదు. కానీ నిరాశపడలేదు. పదిమందికీ పనికొచ్చే పని చెయ్యాలనుకున్నారు. చిన్న సార్టప్‌తో మొదలైన అతని ప్రయాణం... భారత సైన్యానికి డ్రోన్లు సరఫరా చేస్తూ, కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. అతను తయారుచేసిన డ్రోన్లను ఆపరేషన్ సిందూర్‌లో శత్రు స్థావరాలను నాశనం చేసేందుకు వినియోగించారు. విభిన్న ఫీచర్లతో డ్రోన్లు రూపొందిస్తున్న విశాఖ యువకుడు కొమర నాగేశ్వరరావు ‘నవ్య’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలివి.
‘‘నాకు చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని ఉండేది. ఇంటర్మీడియట్ తరువాత పైలట్ కావడానికి ఎంత ఖర్చవుతుందని ఆరా తీస్తే లక్షల్లో కావాలని తెలిసింది. కమర్షియల్ పైలట్ లైసెన్స్‌కే లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుందని చెప్పడంతో ప్రత్నామ్నాయం ఆలోచించాను. ‘ఏది చేసినా పది మందికీ ఉపయోగపడాలి. నాకంటూ ప్రత్యేకత ఉండాలి’ అనుకున్నాను. ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తరువాత 2023లో చెన్నైలో డిప్లమా ఇన్ ఏరోనాటిక్స్ కోర్సు పూర్తిచేశాను. ఉద్యోగానికి వెళ్లడం కంటే ఏదైనా పది మందికి ఉపయోగపడే పరికరాలను తయారుచేయాలని నిర్ణయించుకున్నా. ఇంజనీరింగ్ సెకండియర్‌లో ఉన్నప్పుడు... థర్డ్, ఫైనలియర్ విద్యార్థులకు అవసరమైన ప్రాజెక్టులు తయారుచేసి ఇచ్చేవాడిని. అప్పట్లో ఎంతోమంది ప్రశంసించారు. అదే రోబోలు, డ్రోన్ల తయారీ ఆలోచనకు కారణమైంది. మొదట్లో చిన్న స్థాయి రోబోలు, డ్రోన్లు తయారుచేయడం ప్రారంభించాను. మంచి ఫలితాలు రావడంతో... స్టార్టప్ ప్రారంభించాలనుకున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ ‘ఏ- హబ్’లో 2023లో ‘అక్షయ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’ను ప్రారంభించాను.
500కు పైగా...
స్టార్టప్ ప్రారంభించిన తొలినాళ్లలో అగ్రికల్చర్ డ్రోన్, కెమెరా డ్రోన్లు లాంటివి తయారుచేశాం. ఆ తరువాత పెద్ద పెద్ద సంస్థల అవసరాలకు వినియోగించే డ్రోన్లు రూపొందించాం. మా పని తీరు తెలుసుకున్న అనేక ప్రభుత్వ శాఖలు తమకు కావాల్సిన విధంగా డ్రోన్లు తయారు చేయించుకునేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటివరకు సుమారు 100 డ్రోన్లను వివిధ ప్రభుత్వ శాఖలకు అందించాం. వీటిలో ఇండియన్ నేవీ, పోలీస్ శాఖలు ఉన్నాయి. అగ్రికల్చర్, ఫొటోగ్రఫీ, సర్వే వంటి అనేక అవసరాల కోసం పదుల సంఖ్యలో డ్రోన్లు తయారు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా డ్రోన్లు తయారుచేస్తున్న ఏకైక సంస్థ మాదే. డ్రోన్ల తయారీకి అవసరమైన సామగ్రిని తైవాన్, సింగపూర్, అమెరికా, థాయ్‌లాండ్, మలేషియా లాంటి దేశాల నుంచి తెప్పిస్తుంటాను. మెటీరియల్ అందుబాటులో ఉంటే గంట నుంచి రెండు గంటల్లో డ్రోన్ తయారుచేసి అందించగలం. ఒక్కో డ్రోన్‌కు లక్షన్నర నుంచి మూడు లక్షల వరకు ఛార్జి చేస్తాం. మార్కెట్‌తో పోలిస్తే 40 శాతం వరకు తక్కువ ధరకు వీటిని అందిస్తున్నాం.
ఆపరేషన్ సిందూర్‌కు...
ఇండియన్ నేవీకి ఎప్పటి నుంచో డ్రోన్లు సరఫరా చేస్తున్నాం. మా పనితీరు నచ్చిన ఇక్కడి అధికారులు ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో డెహ్రాడూన్, పంజాబ్ వెళ్లాలని కోరారు. వెంటనే అక్కడకు వెళ్లి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన 28 డ్రోన్లను తయారుచేసి అందించాను. 300 కిలో మీటర్లు వేగంతో ప్రయాణించే ఈ డ్రోన్లు ‘సూసైడల్ డ్రోన్స్’గా పనిచేసేలా డిజైన్ చేసి అందించాను. శత్రుమూకల మీదికి, వారి స్థావరాలపైకి వెళ్లి ఇవి బ్లాస్ట్ అవుతాయి. ఇండియన్ నేవీ అధికారుల నుంచి ఆ సమయంలో ప్రశంసలు దక్కాయి. ఇటీవల నగరంలో నిర్వహించిన ‘మిలాన్’ సందర్భంగా వీడియో చిత్రీకరణ బాధ్యతలను మాకే అప్పగించారు. ఇప్పటివరకు పోలీసు శాఖకు 30, ఐఎన్‌ఎ్‌స కళింగకు 16, డేగాకు 17, నేవల్ డాక్‌యార్డుకు మూడు, ఎయిర్‌పోర్టుకు 13 డ్రోన్లు తయారు చేసి ఇచ్చాం. అంకితభావంతో పనిచేయాలి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అనుకొనేవారు ఎవరైనా నా దగ్గరకు వస్తే శిక్షణ ఇస్తాను. ప్రస్తుతం మా సంస్థలో 18 మంది పనిచేస్తున్నారు. ఎవరైనా డ్రోన్ల తయారీ యూనిట్‌కు తగిన ఫండింగ్ చేస్తే పెద్దస్థాయిలో తయారీ చేపడతాను.’’
బూటు శ్రీనివాసరావు,
ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం
ఎయిర్ ట్యాక్సీ తయారు చేస్తా...
భవిష్యత్తులో ఎయిర్ ట్యాక్సీ డిజైన్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. మేము డ్రోన్లు అందించడంతోపాటు వాటి వినియోగంపై శిక్షణ ఇస్తాం. ఏడాదిపాటు నిర్వహణ బాధ్యత తీసుకుంటాం. ప్రతినెలా 20 నుంచి 25 వరకు డ్రోన్లు తయారుచేస్తున్నాం. మా నాన్న తారకేశ్వరరావు మెకానికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అమ్మ కోదండవేణి. గృహిణి. వీరిద్దరి సహకారం, ప్రోత్సహంతో ఈ స్థాయికి ఈ సంస్థను తీసుకువెళ్లగలిగాను.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్