విజయం విశ్వాసానిదే
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:24 AM
తమ ఇష్టదైవం నిర్దేశించిన నైతిక విలువలు కాపాడుకోవడానికి, తమ ప్రాంతాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అసాధారణమైన పోరాటాలు చేసిన మహిళలు బైబిల్‌లో కనిపిస్తారు. వారిలో...
దైవమార్గం
తమ ఇష్టదైవం నిర్దేశించిన నైతిక విలువలు కాపాడుకోవడానికి, తమ ప్రాంతాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అసాధారణమైన పోరాటాలు చేసిన మహిళలు బైబిల్‌లో కనిపిస్తారు. వారిలో యూదిత్ ఒకరు. ఆనాడు ఆమె చేసిన సాహసం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ‘‘దేవునిపై నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది’’ అని ఆమె కథ నిరూపిస్తోంది.
ఆ రోజుల్లో ఇజ్రాయేలీయుల ప్రముఖ పట్టణాల్లో బేతూలియా ఒకటి. ఆ పట్టణం మీద శత్రు సైన్యం దాడి చేసింది. పట్టణ ప్రజలకు నీరు అందకుండా నిరోధించింది. దీంతో ప్రజలు 34 రోజుల పాటు నీరు లేక అల్లాడిపోయారు. దేవుణ్ణి ప్రార్థించారు. ‘‘మన దైవమైన యెహోవా నిర్ణయమే శిరోధార్యం. అయిదు రోజుల్లో దేవుడు సహాయం చేయకపోతే లొంగిపోదాం’’ అని నిరాశతో తీర్మానం చేసుకున్నారు.
ఆ పట్టణంలో యూదిత్ అనే దైవ భీతి కలిగిన వితంతువు నివసిస్తోంది. ఆమె రోజూ ఉపవాసం, ప్రార్థన చేసేది. ‘‘మనం దేవుణ్ణి పరీక్షించవద్దు. ఆయన మనల్ని తప్పకుండా కాపాడుతాడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి’’ అని పట్టణ పెద్దలను కోరింది. వారి అనుమతితో... మూడు రోజుల పాటు దేవుణ్ణి వేడుకుంటూ, ప్రజల కోసం ప్రార్థన చేసింది. యూదిత్ విశ్వాసానికి మెచ్చిన దేవుడు... నాలుగోరోజున అపరిమితమైన బలాన్ని ఆమెకు ప్రసాదించాడు. తన తెలివితేటలతో ఆమె శత్రు శిబిరంలోకి నేర్పుగా ప్రవేశించింది. శత్రు సైన్యాధిపతి పథకాలను విఫలం చేసింది. అతని తలను నరికి, తమ వారి దగ్గరకు తీసుకువచ్చి చూపించింది.
దాంతో శత్రువులు భయపడిపోయారు. అక్కడినుంచి పారిపోయారు. అప్పుడు యూదిత్ ‘‘దేవుడు బలవంతులను సామాన్యుల చేతిలో కూడా ఓడించగలడు’’ అని దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తన పాడింది. ఆమె 105 సంవత్సరాలు జీవించింది. దేశంలో శాంతిని స్థాపించింది. ‘ఎంత బలహీనులైనా సరే... ప్రార్థన చేస్తూ, విశ్వాసం, ధైర్యం ఉంటే దేవుడు వారితో గొప్ప కార్యాలు చేయిస్తాడు’’ అనే సందేశాన్ని యూదిత్ జీవితం మనకు అందిస్తోంది.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక