వరదాయిని నేడు వరలక్ష్మీ వ్రతం
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:53 AM
శ్రావణ మాసం వ్రతాలకు నోములకు ప్రసిద్ధి. ఈ మాసంలో పార్వతిని మంగళగౌరిగా మంగళవారం, మహాలక్ష్మిని శ్రీవరలక్ష్మిగా శుక్రవారం పూజిస్తారు. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు...
విశేషం
నేడు వరలక్ష్మీ వ్రతం
శ్రావణ మాసం వ్రతాలకు నోములకు ప్రసిద్ధి. ఈ మాసంలో పార్వతిని మంగళగౌరిగా మంగళవారం, మహాలక్ష్మిని శ్రీవరలక్ష్మిగా శుక్రవారం పూజిస్తారు. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో ప్రధానమైనది.... శ్రీవరలక్ష్మీ వ్రతం. శావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వరలక్ష్మీ వ్రతం గొప్పదనాన్ని గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది.
మానవులలో దైవిక శక్తులు అంతర్గతంగా ఉంటాయి. ఆ శక్తులను చైతన్యపరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీమహాలక్ష్మి. ఆమె ఆరాధనే వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మి... శ్రావణ మాసానికి అధిష్ఠాత్రి. శ్రద్ధాభక్తులతో ఆమెను పూజించినవారిని ఎలాంటి కొరతా లేకుండా కటాక్షిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. తారతమ్యాలకు తావివ్వకుండా... సమష్ఠిగా వ్రతాలనూ, సత్కార్యాలనూ ఆచరించి, వచ్చిన ఫలితాన్ని సమానంగా అనుభవించాలని ఈ వ్రత కథ తెలియజేస్తోంది. దాని ప్రకారం...
పూర్వం చారుమతి అనే ఇల్లాలు భర్తను, అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవించేది. బంఽధువులకు, ఇరుగు పొరుగువారికి అవసరమైన సాయం చేస్తూ ఉండేది. తన భక్తుల మనోవాంఛలను తీర్చాలనే సంకల్పంతో భూలోకానికి వచ్చిన మహాలక్ష్మిని చారుమతి సద్గుణాలు మెప్పించాయి. చారుమతి కలలో ఆమె ప్రత్యక్షమై... శ్రావణ మాసంలో తనను వరలక్ష్మిగా పూజించాలని చెబుతూ, వ్రత విధి విధానాలను తెలియజేసింది. తెల్లవారిన తరువాత తన స్వప్న వృత్తాంతాన్ని తన కుటుంబానికి, ఇరుగుపొరుగు గృహిణులకు చారుమతి తెలియజేసింది. అందరూ సంతోషించారు. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురుచూశారు. ఆ రోజున... చారుమతి ఇంట్లో ఆమెతో పాటు ఇరుగు పొరుగు ఇల్లాళ్ళందరూ.... వరలక్ష్మి చెప్పిన వ్రత విధానాన్ని పాటిస్తూ... షోడశోపచారాలతో ఆ తల్లిని అర్చించారు. వ్రతాన్ని పూర్తి చేసి, పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విధంగా వ్రతం ఆచరించి... వారందరూ ఐశ్వర్య సంపన్నులయ్యారని ఆ వ్రత కథ వివరిస్తోంది. విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది. నిస్వార్థత, తోటివారికి మేలు కలగాలనే మనస్తత్వం, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పేర్కొం టూ... ఈ లక్షణాలను అందరూ అలవరచుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది. కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ కటాక్షం ద్వారా కలుగుతాయి. వాటిని పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు