Share News

నోరూరించే సరికొత్త దోశలు..!

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:24 AM

అందరూ ఇష్టపడే సంప్రదాయ అల్పాహార వంటకం దోశ. మనం తరచూ మసాలా దోశ, ఉల్లి దోశ, పనీర్‌ దోశ... ఇలా ఎన్నో రకాల రుచికరమైన దోశలను ఇంట్లో తయారుచేసుకుని...

నోరూరించే సరికొత్త దోశలు..!

వంటిల్లు

అందరూ ఇష్టపడే సంప్రదాయ అల్పాహార వంటకం దోశ. మనం తరచూ మసాలా దోశ, ఉల్లి దోశ, పనీర్‌ దోశ... ఇలా ఎన్నో రకాల రుచికరమైన దోశలను ఇంట్లో తయారుచేసుకుని తింటూ ఉంటాం. వీటిలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటూ సులువుగా తయారుచేసుకోదగ్గ విభిన్న దోశ రుచులు మీ కోసం..

బనానా దోశ

కావాల్సిన పదార్థాలు

  • అరటి పండు- ఒకటి, బొంబాయి రవ్వ- ఒక కప్పు, అటుకులు- ముప్పావు కప్పు, పెరుగు- ఒక కప్పు, బెల్లం తురుం- రెండు చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా, ఉప్పు- అర చెంచా, పసుపు- పావు చెంచా, బేకింగ్‌ సోడా- పావు చెంచా

తయారీ విధానం

  • మిక్సీలో అరటిపండు ముక్కలు, బొంబాయి రవ్వ, అటుకులు, పెరుగు, బెల్లం, యాలకుల పొడి, ఉప్పు వేసి తగినంత నీటిని చిలకరించి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని పసుపు, బేకింగ్‌ సోడా వేసి గంటె జారుగా ఉండేలా నీటిని పోసి కలపాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి నూనె రాయాలి. గంటెతో పిండిని తీసుకుని వేడెక్కిన పెనం మీద దోశలా వేయాలి. చిన్న మంట మీద రెండు వైపులా ఎర్రగా వేగనిచ్చి పళ్లెంలోకి తీయాలి. ఈ బనానా దోశను స్వీట్‌ చట్నీ లేదా తేనెతో సర్వ్‌ చేయవచ్చు.

పోహా దోశ

కావాల్సిన పదార్థాలు

  • ఉప్పుడు బియ్యం (ఇడ్లీ బియ్యం)- ఒక కప్పు, మినపగుండ్లు- పావు కప్పు, అటుకులు- ఒక కప్పు, మెంతులు- చెంచా, కంది పప్పు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నూనె- మూడు చెంచాలు

తయారీ విధానం

  • వెడల్పాటి గిన్నెలో ఉప్పుడు బియ్యం, మినపగుండ్లు, కందిపప్పు, మెంతులు తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆపైన నిండా నీటిని పోసి ఆరుగంటలు నానబెట్టాలి. మరో గిన్నెలో అటుకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత అవి మునిగే వరకు మంచినీటిని పోసి గంట సేపు నానబెట్టాలి. మిక్సీ గిన్నెలో బియ్యం, పప్పుల మిశ్రమం వేసి కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఆపైన నానిన అటుకులు వేసి అర కప్పు నీటిని చిలకరించి మరోసారి గ్రైండ్‌ చేయాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసి తగినంత ఉప్పువేసి బాగా కలిపి మూతపెట్టి ఎనిమిది గంటలపాటు నాననివ్వాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి కొద్దిగా నూనె రాయాలి. గంటె నిండా పిండిని తీసుకుని వేడెక్కిన పెనంపై మందపాటి దోశలా వేయాలి. పైన మూతపెట్టి రెండు వైపులా దోరగా వేగిన తరువాత పళ్లెంలోకి తీయాలి. ఈ పోహా దోశను అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీతో తినవచ్చు.


వాటర్‌మెలాన్‌ దోశ

కావాల్సిన పదార్థాలు

  • ఉప్పుడు బియ్యం (ఇడ్లీ బియ్యం)- ఒక కప్పు, అటుకులు- పావు కప్పు, మెంతులు- పావు చెంచా, పుచ్చకాయ ముక్కలు- ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుం- పావు కప్పు, ఉప్పు- తగినంత, నూనె- రెండు చెంచాలు

తయారీ విధానం

  • గిన్నెలో ఉప్పుడు బియ్యం, మెంతులు వేసి బాగా కడిగి నిండా నీటిని పోసి ఎనిమిది గంటలు నానబెట్టాలి. మరో గిన్నెలో అటుకులు తీసుకుని శుభ్రంగా కడిగి మునిగే వరకు నీటిని పోసి గంటసేపు నానబెట్టాలి. మిక్సీలో పుచ్చకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుం వేసి గ్రైండ్‌ చేసి గిన్నెలోకి తీయాలి. ఆపైన నానిన బియ్యం, అటుకులు వేసి ముప్పావు కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పిండిని పుచ్చకాయ- కొబ్బరి మిశ్రమంలోకి తీసి ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి ఎనిమిది గంటలు నాననివ్వాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి నూనె రాయాలి. గంటెతో పిండిని తీసుకుని పెనం మీద దోశలా వేసి రెండు వైపులా ఎర్రగా వేగనివ్వాలి. ఆపైన పళ్లెంలోకి తీసి ఏదైనా కూర్మా, ఉల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్‌లతో సర్వ్‌ చేయాలి.

నీర్‌ దోశ

కావాల్సిన పదార్థాలు

  • బియ్యం- ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుం- అర కప్పు, ఉప్పు- చెంచా, నూనె- మూడు చెంచాలు

తయారీ విధానం

  • గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి నిండా నీటిని పోసి అయిదు గంటలు నానబెట్టాలి. మిక్సీ గిన్నెలో నానిన బియ్యం, పచ్చి కొబ్బరి తురుం వేసి ఒక కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసి మరో రెండు కప్పుల నీటిని పోసి ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి నూనె రాయాలి. గంటెతో పిండిని తీసుకుని పెనం మీద దోశలా వేయాలి. చిన్న మంట మీద ఎర్రగా వేగనిచ్చి పళ్లెంలోకి తీయాలి. ఈ నీర్‌ దోశను టమాటా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.

కిరణ్‌ కుమార్‌

ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌, కడలి రెస్టారెంట్‌,

హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 01:24 AM