విశ్వాసం విలువ
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:49 AM
ఒక చిన్న గ్రామంలో అహ్మద్ అనే యువకుడు నివసించేవాడు. నిత్యం మసీదుకు వెళ్ళే అతని మనసులో ఎన్నో ప్రశ్నలు కదిలేవి. మనం ఈ భూమి మీదకు ఎందుకు...
సందేశం
ఒక చిన్న గ్రామంలో అహ్మద్ అనే యువకుడు నివసించేవాడు. నిత్యం మసీదుకు వెళ్ళే అతని మనసులో ఎన్నో ప్రశ్నలు కదిలేవి. మనం ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాం? ఈ జీవితం సుమారు 70, 80 ఏళ్ళు ఎందుకు ఉంటుంది? అల్లాహ్ మనల్ని ఎందుకు సృష్టించాడు? మరణం తరువాత మరొక జీవితం ఉందా? స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? నిజమైన సుఖం ఎక్కడ ఉంది?... రోజూ అతనికి ఇవే ఆలోచనలు.
ఒక రోజు ఫరాజ్ నమాజ్ తరువాత మసీదులో ఒక మూల కూర్చున్న అహ్మద్ దగ్గరకు ఇమామ్ వచ్చి ‘‘బేటా... ఏమైంది? ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావ్?’’ అని అడిగాడు.
తన ప్రశ్నలన్నిటినీ ఆయనకు అహ్మద్ వివరించి నాకు జీవితం అర్థం కావడం లేదు. ‘‘ఏది నిజం? ఏది అబద్ధం? ఎవరి మాట నమ్మాలి?’’ అని అన్నాడు.
అప్పుడు ఇమామ్ నవ్వుతూ ‘‘జీవితం అనేది చాలా సరళమైనది. దాన్ని మనం కష్టతరం చేసుకుంటాం. ఇంతకూ... నీ దగ్గర దివ్య ఖుర్‌ఆన్ గ్రంథం ఉందా?’’ అని ప్రశ్నించాడు.
‘‘ఉంది... కానీ నేను ఎక్కువగా చదవలేదు’’ అన్నాడు అహ్మద్.
‘‘అదే నీ సమస్యకు సమాధానం. ఖుర్‌ఆన్ కేవలం ఒక పుస్తకం కాదు. అది అల్లాహ్ మాట. మన జీవితానికి మార్గదర్శి. దాన్ని నిత్యం పఠించు’’ అని సూచించాడు ఇమామ్.
అప్పటినుంచి అహ్మద్ రోజూ కొంత సమయం పాటు ఖుర్‌ఆన్‌ను చదవడం, అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. అయితే అతని రోజువారీ జీవితం కష్టంగానే సాగుతోంది. తల్లిదండ్రుల అనారోగ్యం, ఉద్యోగం లేకపోవడం... ఇలా ఇంటా బయటా ఇబ్బందులు. ‘అల్లాహ్! నేను నీ ఆదేశాలను పాటిస్తున్నాను. కానీ ఎందుకు ఇన్ని కష్టాలు?’’ అని అతను బాధపడేవాడు.
కొన్నాళ్ళ తరువాత మళ్ళీ ఇమామ్ అతన్ని పలకరిస్తూ ‘‘బేటా... ఖుర్‌ఆన్ ఏమంటోంది?’’ అని అడిగాడు. జరుగుతున్నదంతా చెప్పాడు అహ్మద్.
‘‘అల్లాహ్ తనకు ప్రియమైన వారిని పరీక్షిస్తాడు... ఇది శిక్ష కాదని గ్రహించు. సహనంగా ఉండడం నేర్చుకో. మంచి జరుగుతుంది’’ అని చెప్పాడు ఇమామ్.
అహ్మద్‌కు కన్నీళ్ళు వచ్చాయి... నిరాశతో కాదు నమ్మకంతో. సహనం నేర్చుకున్నాడు. ప్రతి సమస్యకు దైవికమైన అర్థం ఒకటి ఉంటుందని గ్రహించాడు. ఖుర్‌ఆన్ పఠనాన్ని మరింత దీక్షతో కొనసాగించాడు.
అతని తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడింది. అతనికి చిన్న ఉద్యోగం దొరికింది. దైవంపై అపారమైన నమ్మకం ఉన్న అమ్మాయితో వివాహం అయింది. ‘అల్లాహ్ ఆలస్యం చేస్తాడు... కానీ అన్యాయం చెయ్యడు’ అనుకున్నాడు. అంతకుముందు బాధపడేవాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు. గతంలో అనుమానాలతో ఉండేవాడు. ఇప్పుడు నమ్మకంతో జీవిస్తున్నాడు. విశ్వాసం విలువ అతనికి అర్థమయింది. ‘నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా జీవించ గలుగుతున్నావు?’ అని ఒక స్నేహితుడు అతణ్ణి అడిగాడు. ‘‘నా హృదయాన్ని అల్లాహ్‌కు, ఖుర్‌ఆన్‌కు ఇచ్చేశాను’’ అని బదులిచ్చాడు అహ్మద్.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News