బ్రెయిలీ నుంచి... బెంచ్ వరకు
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:12 AM
శారీరక వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించారు తాన్యా నాథన్. కేరళ తొలి అంధ మహిళా జడ్జిగా రికార్డు సృష్టించబోతున్న ఆమె ప్రయాణం అంధకారం నుంచి అద్భుత వెలుగుల వైపు...
శారీరక వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించారు తాన్యా నాథన్. కేరళ తొలి అంధ మహిళా జడ్జిగా రికార్డు సృష్టించబోతున్న ఆమె ప్రయాణం అంధకారం నుంచి అద్భుత వెలుగుల వైపు సాగిన ఒక అసాధారణ పోరాటం.
చట్టం కళ్లకు గంతలు ఉంటాయి. అది నిష్పక్షపాతానికి సంకేతం. కానీ, అదే న్యాయపీఠంపై ఒక అంధురాలు కూర్చుని తీర్పులు ఇస్తే.. ఆ ఆలోచనే ఒకప్పుడు అసాధ్యం. కానీ, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు 24 ఏళ్ల తాన్యా నాథన్. కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన ఈ యువతి రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి అంధ మహిళా జడ్జిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కేరళ జ్యుడీషియల్ ఎగ్జామినేషన్ 2025లో దివ్యాంగుల విభాగంలో ఆమె టాపర్‌గా నిలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అక్షరమే ఆయుధమై
తాన్యా ప్రస్థానం కన్నూరులోని మంగడ్ అనే చిన్న గ్రామం నుంచి మొదలైంది. పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు జగన్నాథన్, బబిత ఆమెను ఎప్పుడూ వెనకడుగు వెయ్యనివ్వలేదు. ధర్మడంలోని అంధ పాఠశాలలో ప్రాథమిక విద్యను బ్రెయిలీ లిపిలో అభ్యసించిన తాన్యా.. ఆ తర్వాత సాధారణ పాఠశాలల్లో విద్యార్థులతో పోటీపడి చదివారు. పదో తరగతిలో ఉన్నప్పుడే సమాజంలోని వివక్షను గమనించిన ఆమెకు.. చట్టంపై పట్టు ఉంటేనే బలహీన వర్గాలకు రక్షణ ఉంటుందని అర్థమైంది. అదే ఆమెను న్యాయశాస్త్రం వైపు నడిపించింది.
గంటల కొద్దీ పాఠాలు వింటూ
కన్నూరు యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. న్యాయశాస్త్ర పుస్తకాలు బ్రెయిలీ లిపిలో లేవు. ఒక మామూలు పేజీని బ్రెయిలీ లిపిలోకి మారిస్తే ఐదు పేజీలు అవుతుంది. దీంతో ఆమె స్ర్కీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడ్డారు. గంటల కొద్దీ పాఠాలు వింటూ ముఖ్యమైన పాయింట్లను బ్రెయిలీలో నోట్స్ రాసుకునేవారు. కాలేజీలో అంధురాలైన ఏకైక విద్యార్థి అయినప్పటికీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ యూనివర్సిటీలోనే ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఆ తర్వాత తలిపరంబలో సీనియర్ అడ్వకేట్ సునీల్ కుమార్ వద్ద జూనియర్ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టి సివిల్, క్రిమినల్ కేసుల్లో అనుభవం సంపాదించారు.
కోచింగ్ తీసుకోకుండానే..
విశేషం ఏంటంటే.. తాన్యా ఏ కోచింగ్ సెంటర్‌కు వెళ్లలేదు. పగలు కోర్టులో ప్రాక్టీస్ చేస్తూనే, రాత్రిపూట సొంతంగా ప్రిపేర్ అయ్యేవారు. దశాబ్దాల కాలం నాటి ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స) వంటి చట్టాలను కూడా డిజిటల్ సాఫ్ట్‌వేర్ సాయంతో క్షుణ్ణంగా చదివారు. పాత చట్టాలకు, కొత్త మార్పులకు మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం అనుభవజ్ఞులకే సవాలుగా మారిన తరుణంలో తాన్యా ఏకాగ్రతతో వాటన్నింటిపై పట్టు సాధించారు. పరీక్షలో ప్రశ్నలను ఒకరు చదివి వినిపిస్తే, తాన్యా సమాధానాలను డిక్టేట్ చేసేవారు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ దాటి ఇంటర్వ్యూలోనూ తన మేధస్సుతో బోర్డును మెప్పించారు.
సాంకేతికతే నా కన్ను
‘‘సాంకేతిక పెరిగిన ఈ రోజుల్లో అంధత్వం ఒక అడ్డంకి కాదు’’ అంటారు తాన్యా. స్ర్కీన్ రీడర్స్, డిక్టేషన్ సాఫ్ట్‌వేర్ సాయంతో తాను న్యాయమూర్తిగా అన్ని పనులను చక్కబెట్టగలనని ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. కోర్టులో మౌలిక సదుపాయాలు దివ్యాంగులకు అనుకూలంగా ఉంటే తనలాంటి వారు మరింత సమర్థంగా పనిచేయగలరని తాన్యా చెబుతున్నారు. అంధకారాన్ని చీల్చుకుంటూ న్యాయపీఠాన్ని అధిష్టించబోతున్న తాన్యా భవిష్యత్తులో మరెంతోమందికి స్ఫూర్తిదాయకం.
కలను నిజం చేసి సుప్రీం తీర్పు
తాన్యా న్యాయవాదిగా పనిచేస్తున్నా జడ్జి కావాలనే ఆమె లక్ష్యం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎందుకంటే న్యాయమూర్తుల నియామకాల్లో అంధులకు గతంలో అవకాశం ఉండేది కాదు. అయితే, 2025 మార్చిలో జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పు తాన్యా జీవితాన్ని మలుపుతిప్పింది. ‘‘వైకల్యం ఉన్న కారణంతో ఎవరినీ జ్యుడీషియల్ సర్వీసెస్ నుంచి తప్పించకూడదు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ తీర్పు ఇచ్చిన స్ఫూర్తితో ఆమె జడ్జి పరీక్షలకు దరఖాస్తు చేశారు.
ఇవి కూడా చదవండి:
254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్
అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..