Share News

సంగీతాన్ని...ఏఐ ఆక్రమిస్తుందేమో!

ABN , Publish Date - May 31 , 2026 | 04:18 AM

‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌన రాగాలెన్నినాళ్లో..’ ‘అందంగా లేనా... అసలేం బాలేనా...’ దశాబ్దాలు గడిచినా ఆమె పాట ప్రతి నోట సజీవమే. బాణీకి శృతి కలిపినా రాగమే...

సంగీతాన్ని...ఏఐ ఆక్రమిస్తుందేమో!

‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌన రాగాలెన్నినాళ్లో..’ ‘అందంగా లేనా... అసలేం బాలేనా...’ దశాబ్దాలు గడిచినా ఆమె పాట ప్రతి నోట సజీవమే. బాణీకి శృతి కలిపినా రాగమే... వేరొకరి పాత్రకు గొంతు పలికినా రాగమే. పాటకు ప్రాణం పల్లవి అయితే... ఆ పల్లవులు ఆమె గాత్రంలో కోయిలను మరిపిస్తాయి. ముప్ఫై ఏళ్లుగా కొనసాగుతున్న గానప్రవాహం... మూడు వేలకు పైగా గీతాలు ఆలపించిన సుమధుర స్వరం... సునీత ఉపద్రష్ట. ప్రస్తుతం విభిన్న థీమ్‌తో ప్రేక్షకులను ప్రత్యక్షంగా అలరించేందుకు సన్నద్ధమవుతున్న సునీతను ‘నవ్య’ పలుకరించింది.

‘‘టైమ్‌లెస్‌ విత్‌ సునీత ఉపద్రష్ట... ప్రస్తుతం నేను తలపెట్టిన కాన్సర్ట్‌ ఇది. తరచూ వేదికలపై పాటలు పాడుతూనే ఉంటాను కానీ... ఇది వాటికి భిన్నమైనది. దీన్ని ఒక థీమ్‌ ఆధారిత కార్యక్రమంలా తీర్చిదిద్దాం. ఉదాహరణకు ‘మాయాబజార్‌’ థీమ్‌. ఆ తరం నుంచి ఈతరం వరకు... ఒక జ్ఞాపకాల దొంతరలాగా. ఇందులో నేను, సాహితి చాగంటి, శ్రీకృష్ణ, ధనుంజయ్‌ కలిసి గీతాలాపన చేస్తున్నాం. ఏ పాటలైతే ‘టైమ్‌లె్‌స’గా మనం భావించామో, అందరం కలిసి పాడుకొంటామో అలాంటి గీతాలు. నేను చిన్నప్పటి నుంచీ ‘మాయాబజార్‌’, ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిక్స్‌ రెండుమూడు రోజులకు ఒకసారైనా చూస్తుంటాను. అలాగే నేను పని చేసినవాటిల్లో ‘గోదావరి’ నాకు చాలా ఇష్టం. నాకు మంచి పేరు తెచ్చిన చిత్రం. ఆ సినిమాకు సంబంధించి కూడా ఒక థీమ్‌ చేస్తున్నాం. జూన్‌ 13న హైదరాబాద్‌ శిల్పకళావేదిక లో ‘ఎలెవెన్‌ పాయింట్‌ టు, వేదమ్‌ ఆర్ట్స్‌’ నిర్వహిస్తున్న ఈ షోలో 150 ఏళ్ల వందేమాతరం థీమ్‌తో పాటు, ఎనిమిది మంది మ్యుజీషియన్స్‌ వారి వాయిద్యాల ప్రత్యేకతను ప్రదర్శించేలా రూపొందించాం.

పాటల్లో లోతు తగ్గింది...

నేను పరిశ్రమలోకి వచ్చి ముప్ఫై ఏళ్లు దాటిపోయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మార్పులు చూశాను. బాలు గారు కానీ, జానకి గారు కానీ ఎప్పుడూ ఏం చెప్పేవారంటే... ‘మార్పు అనేది నిరంతరం’ అని. ఆ వాస్తవాన్ని అంగీకరిస్తూ ముందుకు వెళ్లాలి. కానీ మన గుర్తింపును, సహజత్వాన్ని, మూలాలను మరిచిపోకుండా ఉండాలి. అయితే ప్రధానంగా నేను గమనించిన మార్పు... ఇప్పుడు పాటల్లో లోతు చాలా తగ్గిపోయిందని అనిపిస్తోంది. అంటే ఒక పాటను మనం విశ్లేషించి, దాని గురించి మాట్లాడుకొనేంతగా సాహిత్యం లేదు. మనుషుల్లో సహజంగా వచ్చే మార్పువల్లనా, సమాజంలో వచ్చిన మార్పులవల్లనా, లేక అసలు సినిమాల్లోనే మార్పు వచ్చిందా! ఒకప్పుడు సినిమాలో ఐదారు పాటలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అన్నీ అనడంలేదు. ‘సీతారామం, మహానటి, ఉప్పెన’ లాంటి చిత్రాల్లో నేనూ మంచి పాటలు పాడాను. మంచి సాహిత్యం వస్తూనే ఉంది. కానీ ఎక్కువ వయోలెన్స్‌ కావచ్చు, మరేదైనా కావచ్చు, తీవ్రత ఎక్కువున్న చిత్రాలు వస్తున్నాయి. ఆ హోరులో కొన్ని కొట్టుకుపోతున్నాయి. గతంలో చాలామంది పాటల కోసమే మళ్లీ మళ్లీ సినిమాకు వెళ్లేవారు.


జీర్ణించుకోవడం కష్టం...

నాకు ఇంకో భయం... రాబోయే రోజుల్లో సంగీతాన్ని ఏఐ ఆక్రమిస్తుందేమోనని! కారణం... మనం చాలా ప్రయోగాలకు అలవాటుపడిపోయాం. రోజూ అదే అన్నం, ఆవకాయ వేసుకొని తినడం రుచించడం లేదేమో! ప్రపంచీకరణలో పిజ్జాలు, బర్గర్లు రోజువారీ తిండి అయిపోయాయి. మార్పు అనేది సహజం. సంగీతంలోనే కాదు, అన్ని రంగాల్లో వచ్చిన మార్పులో భాగమే ఇదనేది నా అభిప్రాయం. ఇన్ని మార్పుల మధ్య, ఇన్ని భయాల మధ్య కొన్ని చూసీచూడనట్టు, కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సాగిపోతున్నా. కాకపోతే ఈ మార్పును జీర్ణించుకోవడం మనసుకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను సాహిత్యపు ప్రేమికురాలిని. ప్రతిదీ ప్రకృతితో పోల్చుకొని చూడటం నా లక్షణం. నా దృష్టిలో కళ అనేది మనలో ఉండే గుణాలను, లక్షణాలను మారుస్తుంటుంది. అయితే ఇప్పుడు తీవ్రమైన ఎండల్లా మనుషుల్లోనూ, సినిమాల్లోనూ కొన్ని భరించలేనితనాలు, తత్వాలు ఎక్కువగా ఉన్నాయి.

క్రమశిక్షణే నిలబెట్టింది...

ఇన్నేళ్లయినా ఇంకా నేను పరిశ్రమలో నిలబడటానికి కారణం నాలో ఉన్న క్రమిశిక్షణ అనుకొంటున్నా. ఇంకొకటి... దేన్నీ తేలికగా తీసుకోకపోవడం. అవకాశం కావచ్చు, మరేదైనా కావచ్చు. ప్రయత్న లోపం ఉండకూడదన్నది మొదటి నుంచీ నా తత్వం. అలాగే ఇటీవల కాలంలో నేను చేస్తున్న పబ్లిక్‌ ఈవెంట్స్‌. శిల్పకళావేదికల్లాంటివే కాకుండా క్లబ్స్‌లోనూ చేస్తున్నాను. బ్యాండ్‌ తీసుకువెళ్లి విదేశాల్లో ప్రదర్శనలూ ఇస్తున్నాను. పాటలను నేటి అభిరుచులకు తగ్గట్టుగా, కొత్తతరం కూడా ఆస్వాదించేలా ఈవెంట్లను డిజైన్‌ చేసుకొంటున్నా. అందుకు అనుగుణంగా నన్ను నేను మలుచుకొంటున్నా. అయితే క్లబ్స్‌లో కూడా ‘అలనాటి రామచంద్రుడు’ లాంటి పాటలే పాడతాను. అక్కడకు వెళ్లాను కాబట్టి ఫాస్ట్‌ బీట్‌ పాటలే పాడాలని లేదు. నన్ను పిలిచినప్పుడు ‘ఇలా అయితేనే వస్తాను. అలా అయితేనే పాడతాను’ అని కచ్చితంగా చెబుతాను. అప్పుడు నా ఐడెంటిటీ మారదు. నా నియమాలకు విరుద్ధమూ కాదు. అంటే నేను ట్రెండ్‌ను ఫాలో అవుతున్నానా? లేక నా పంథాలో నేను వెళుతున్నానా? ఒక్కటి నిజం... ఇప్పటికీ మంచి పాటలు వినే శ్రోతలు ప్రాంతాలు, వయసులకు అతీతంగా ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నారు. ‘పాడుతా తీయగా, స్వరాభిషేకం’ లాంటి టీవీ షోలు కూడా ప్రేక్షకుల్లో సంగీతాభిరుచిని సజీవంగా ఉంచుతున్నాయి.


ఆ భావన ఎప్పుడూ లేదు...

ఎన్నో అద్భుతమైన చిత్రాలు... మనసుకు హత్తుకొనే మధుర గీతాలు... ఇప్పటివరకు మూడు వేలకు పైగా పాటలు పాడాను. భగవంతుడి కృపవల్ల ఇంకా పరిశ్రమలో కొనసాగుతున్నా. పాటలకే కాదు... నా డబ్బింగ్‌కు కూడా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా, యాంకర్‌గా... విభిన్న పాత్రలు. అన్నిటిలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగాను. అయితే నేనేదో సాధించానన్న భావన నాకు ఎప్పుడూ లేదు. ఇప్పుడైతే లక్ష్యాలు కూడా ఏవీ లేవు. ప్రస్తుతానికైతే నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొంటూ... ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలనేది నా సంకల్పం. ఐదేళ్ల కిందట ఇదే ప్రశ్న ఎవరైనా అడిగివుంటే వేరే ఏవైనా లక్ష్యాలు ఉన్నాయని చెప్పేదాన్నేమో. ఎందుకంటే... అప్పుడు నలభైల మొదట్లో ఉన్నాను. ఇది వయసు రీత్యా ఆలోచనా విధానంలో వచ్చిన మార్పులు కావచ్చు... ఒక మహిళగా జీవసంబంధమైన మార్పులు కావచ్చు.

10.jpg

అది వాళ్ల లోపం...

సామాజిక మాధ్యమాల యుగంలో కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయన్నది వాస్తవమే. అయితే ఎవరేమన్నా నేను పట్టించుకోను. పనిలేని వాళ్లు చేసే పనులతో నాకు సంబంధం లేదు. నా జీవితంలో నేను ముందుకు వెళుతూనే ఉంటాను. విమర్శలు చేసేవాళ్ల జీవితం అక్కడే ఆగిపోతుంది. పక్కింట్లో శ్రీను ఏంచేస్తున్నాడో? ఎదిరింట్లో సుజాత నన్ను ఏమందో నాకు అవసరంలేదు. ఒకళ్లింట్లో కూరలో ఉప్పు ఎక్కువైనా... ‘సునీత ఏంటి ఇలా చేసింది’ అనే రోజులివి. వారిలో ఏ మలినం ఉన్నా, వాళ్లింట్లో ఏ సమస్య వచ్చినా కూడా పక్కవాళ్లను చూసి విమర్శించే తత్వం ఎక్కువైపోయింది. అది వాళ్లలో లోపం తప్ప... అవి అంటించుకొనే రోజులు పోయాయి. రాత్రి ఉన్నప్పుడు పగలు ఉన్నట్టే ప్రశంస ఉన్నప్పుడు విమర్శ ఉంటుంది. అలాగని నేను వాటి బారిన పడలేదా అంటే పడ్డాను. ఆ తరువాతనే మాట్లాడుతున్నాను. నేనూ ఏడ్చాను. చాలా క్షోభ పడ్డాను. నేనేంటో నా జీవితం ఏంటో ఒంటరిగానే గడిపాను. ఒక్కళ్లు వచ్చి నాకు సాయం చేయలేదు. నేను వెళ్లి ఎవరినీ సాయం అడగలేదు. ముప్ఫై ఏళ్లకు పైబడిన కెరీర్‌లో నేను బానే సంపాదించుకొని ఉంటాను కదా. కానీ నాకు డబ్బు లేక పెళ్లి చేసుకున్నానని అనుకున్నవాళ్లూ ఉన్నారు.

దురదృష్టం ఏమిటంటే... విజయవంతమైన మహిళను హ్యాండిల్‌ చేసే స్థాయి, స్థోమత, సౌమ్యత ఈ ప్రపంచంలో చాలా తక్కువ. నా దగ్గర డబ్బుంటే ఎవరిచ్చారని అడుగుతారు. అవకాశం వస్తే ఏంచేస్తే వచ్చిందో అంటారు. దాన్ని కూడా విమర్శించగలిగారంటే వారిలోని నీచమైన, సహించలేని తత్వం అర్థమవుతుంది. అలాంటివాళ్లను నేను పేషెంట్లుగా చూస్తాను. వాళ్లెప్పుడూ నాకు అవరోధం కాలేరు. ఇవాళ నాలో వచ్చిన పరిణతి అది. నాలాగా కష్టపడి పైకివచ్చిన ఆడపిల్లను మగవాళ్లే కాదు, ఆడవారు కూడా కామెంట్‌ చేస్తారు. కచ్చితంగా ఇంకా ఇది పురుషాధిక్య సమాజమే. నాకైతే పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించడంలేదు. అందరికీ మహిళ సులువైన లక్ష్యంగా మారుతోంది.’’

Updated Date - May 31 , 2026 | 04:18 AM