Telugu comedian Sudarshan Interview: ఎంక‘రైజింగ్’గా ఉంది
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:47 AM
నిత్యం గుండుతో నిగనిగలాడుతూ, నవ్వుతూ కనిపించే హాస్య నటుడు సుదర్శన్. తను నటించిన చిత్రాలు వందల్లో ఉన్నా గుర్తింపు తెచ్చినవి పదుల్లోనే ఉంటాయని నిజయితీగా చెప్తారాయన...
అతిథి
నిత్యం గుండుతో నిగనిగలాడుతూ, నవ్వుతూ కనిపించే హాస్య నటుడు సుదర్శన్. తను నటించిన చిత్రాలు వందల్లో ఉన్నా గుర్తింపు తెచ్చినవి పదుల్లోనే ఉంటాయని నిజయితీగా చెప్తారాయన. సుదర్శన్‌తో కాసేపు మాట్లాడితే చాలు... ఆ మాటల్లో పంచ్‌లు, మెరుపులు, విరుపులు ఉంటాయి. ‘నవ్య’ కోసం సుదర్శన్‌తో జరిపిన ఫన్నీ ముచ్చట్లు.
ఎలా ఉన్నారు?
మీరనుకున్నట్లే ఉన్నానులెండి.
ఈ మధ్య డిఫెరెంట్ రోల్స్, వెరైటీ గెటప్స్ వేస్తున్నారు. రొటీన్ రోల్స్ నుంచి బయట పడ్డట్టున్నారు?
యంగ్ డైరెక్టర్స్ గుడ్ లుక్స్‌లో పడ్డాను. ఇప్పుడు ఫ్రెష్ క్యారెక్టర్స్‌తో జోష్ వచ్చింది.
మీరు రిజెక్ట్ చేసిన రోల్స్ ఉన్నాయా?
ఉన్నాయి. నాకు రానివన్నీ.
లెక్చరర్‌గా చేస్తూ కాలేజ్ ఎందుకు వదిలేశారు?
స్టూడెంట్‌గా ఉండగా వదిలేసే అవకాశం లేక.
పవర్ ఆఫ్ కామెడీ.. కామెంట్ ప్లీజ్!
వెంకటేశ్ నుంచి మెగాస్టార్ వరకూ ఉతికి ఆరేస్తుంటే, శ్రీను వైట్ల నుంచి అనిల్ రావిపూడి వరకూ చించేస్తుంటే మీరు కామెడీ పవర్ గురించి అడుగుతున్నారే. కామెంట్ ప్లీజ్ కాదు.. కాంప్లిమెంట్ ప్లీజ్ అనండి.
మీ రీసెంట్ జర్నీ ఎలా ఉంది?
సెంట్‌పర్సంట్ ఎంక ‘రైజింగ్’గా ఉందంటాను
మీ ఇన్‌కమ్ ఎంత?
మా ఆడిటర్‌ను అడిగి చెప్తా
పోనీ ఫేమ్ వచ్చిందా?
నేమ్ అయితే వచ్చింది.
ఎక్కడైనా ల్యాండ్ కొన్నారా?
ఐలాండ్ కొందామని ఆగా.
ఫామ్ హౌస్... గట్రా..
వైట్ హౌస్ తీసుకుందామని వెయిటింగ్
మీరు మాటకారులే..
అబ్బే మాటలేనండీ.. కారులు లేవు
మీరు హైలీ ఎడ్యుకేటెడ్ కదా... దానికి తగ్గ గౌరవం నటుడిగా దొరుకుతోందా?
గర్వపడితే గౌరవం దొరకదు. మన ప్రవర్తన వల్ల దొరుకుతుంది. అయినా ఇక్కడ కోరుకోవాల్సింది గుర్తింపు.. మంచి నటుడిగా, మంచి మనిషిగా. అది దొరికింది. గౌరవం అంటారా... అది బోనస్.
అప్పుడప్పుడు కవిత్వం రాస్తుంటారు కదా.. స్నేహితులతో పంచుకుంటారా?
పంచుకుంటే స్నేహం తెంచుకుంటామన్నారు.. అందుకే ఆ కోరికను తుంచుకున్నాను.. కవిత్వాన్ని నాలోనే ఉంచుకున్నాను
కథలు గట్రా రాస్తుంటారా?
గట్రా గురించి తెలుసుకున్నాక రాద్దామని వెయిటింగ్ చేస్తున్నా
మీకు బుద్ధిజం ఇష్టమని తెలిసింది?
టూరిజం కూడా ఇష్టమే
బుద్ధిస్ట్ మాంక్‌ల ఫిలాసఫీ వంట పట్టిందా?
ముందు వాళ్ల గుండు వంటికి పట్టింది. ఫిలాసఫీ సంగతి తర్వాత.
గుండు మీకు ఎస్సెట్టా?
ఏ సెట్టో, ఈ సెట్లో.. ఏదో ఒక సెట్టు. సెట్టయిందిగా సామీ..
సినిమాలో కామెడీ పాత్రలు లేకపోతే...
పాఠకుల పొట్ట చెక్కలయ్యే ప్రశ్నలు అడగండి. ఆర్టిస్టుల పొట్ట కొట్టె ప్రశ్నలు అడగకండి ప్లీజ్
మీరు సినిమాలకి కామెడీ సీన్లు రాయెచ్చుగా?
రాయెచ్చు.. తీరా రాశాక. సీన్లు బావున్నాయి. కామెడీ కూడా ఉంటే బావుండేదని అంటారేమోనని జంకుతున్నా.
సరేనండీ.. వెళ్లొస్తాం.
మీరు ఉండండి.. షూటింగ్ ఉంది.. నేనే వెళ్లొస్తా!
సంభాషణ: వినాయకరావు
ఇవీ చదవండి:
నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు
రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్