స్థితరప్రజ్ఞత... నిశ్శబ్ద బలం
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:48 AM
అనిశ్చితికి, బాధకు, భావోద్వేగపరమైన ఒత్తిడికి గురవుతున్న క్షణాల్లో... ఒక వైద్యుణ్ణి నిలబెట్టేది ఏమిటి?... ఒక రోజు సాయంత్రం ఇన్సెంటివ్ కేర్ యూనిట్‌లో ఉన్నాను...
యోగా
అనిశ్చితికి, బాధకు, భావోద్వేగపరమైన ఒత్తిడికి గురవుతున్న క్షణాల్లో... ఒక వైద్యుణ్ణి నిలబెట్టేది ఏమిటి?... ఒక రోజు సాయంత్రం ఇన్సెంటివ్ కేర్ యూనిట్‌లో ఉన్నాను. రోగి కుటుంబ సభ్యులు బయట ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు. మానిటర్లు మెల్లగా శబ్దం చేస్తున్నాయి. ఆ సయయంలో ఆ చిక్కు ప్రశ్ననన్ను కలవరపరుస్తోంది. వైద్య శాస్త్రం మాకు జ్ఞానాన్ని, సాంకేతికతను, చికిత్సా నైపుణ్యాలను అందిస్తుంది. అయినప్పటికీ, వాటికన్నా లోతైన దాని మీద ఆధారపడవలసిన సందర్భాలు ఉంటాయి. అది: గందగరోళం మధ్య కూడా స్పష్టంగా ఆలోచించడానికి దోహదం చేసే అంతర్గతమైన స్థిరత్వం. ఈ అంతర్గత స్థిరత్వాన్ని భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం ఒక గంభీరమైన పదంతో వర్ణిస్తుంది... స్థితప్రజ్ఞత. బాహ్యమైన పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరి జ్ఞానం స్థిరంగా ఉంటుందో, ఎవరి మనసు సమతుల్యతతో ఉంటుందో అతడు స్థితప్రజ్ఞుడు.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే
(భగవద్దీత)... దుఃఖంలో చలించకుండా, సుఖాలపట్ల మితిమీరిన వాంఛ లేకుండా, భయాన్ని, కోపాన్ని, అనుబంధాన్ని అధిగమించిన వ్యక్తిని ‘స్థిరమైన జ్ఞానం’ కలిగినవాడు అంటారు. ఒక వైద్యుడి జీవితం ఆశ, భయం, ఉపశమనం, కొన్నిసార్లు దుఃఖం లాంటి మానవ భావోద్వేగాలమధ్య సాగే నిరంతరమైన ఒక ప్రయాణం. రోగులు, వారి కుటుంబ సభ్యులు కేవలం చికిత్సకోసమే కాదు, భరోసాకోసం, నిలకడ కోసం కూడా వైద్యుడివైపు చూస్తారు. ఒకవేళ వైద్యుడే భావోద్వేగాల అలజడికి గురైనప్పుడు... సరైన వైద్య నిర్ణయానికి అవసరమైన స్పష్టత మసకబారవచ్చు. నా ప్రయాణంలో, ఈ స్థిరత్వాన్ని పెంపొందించడంలో ధ్యానం ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఆలోచనల నిరంతర గందరగోళానికి అతీతంగా ఉండే ప్రశాంతమైన స్పష్టత కలిగిన ప్రదేశమైన హృదయం దగ్గరకి తిరిగి రావడాన్ని ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ఽధ్యానం ద్వారా మనస్సు క్రమంగా నేర్చుకుంది.
అందరికీ ప్రధానమే...
‘‘ధ్యానం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. హృదయం సమతుల్యంగా మారినప్పుడు జ్ఞానం సహజంగానే ఉద్భవిస్తుంది. అప్పుడు మన ప్రతిస్పందనలు మితంగా, దయతో కూడి ఉంటాయి’’ అని చెప్పారు దాజీ. ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు... అటువంటి స్థిరత్వం కేవలం వైద్యులకు మాత్రమే ప్రధానం కాదని స్పష్టమవుతుంది. వేగంగా పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో... పని ఒత్తిళ్ళు, కుటుంబ బాధ్యతలు, సామాజిక అంచనాల్లాంటి వాటితో భావోద్వేగపరమైన గందరగోళాన్ని ప్రతి వ్యక్తి ఎదుర్కొంటున్నాడు. తీవ్ర శబ్దాలు, వేగం, అనిశ్చితితో నిండిపోతున్న ఈ ప్రపంచంలో... ఒక వైద్యుడు పెంపొందించుకోగలిగే గొప్ప బలం... అంతర్గత ప్రశాంతత. జ్ఞానం స్థిరపడినప్పుడు చర్యలు కరుణతో నిండుతాయి. మనస్సు ప్రశాంతమైనప్పుడు, నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి. ధ్యానం ద్వారా మనసు సమతుల్యత పొందినప్పుడు... వైద్యుని ఉనికి సైతం స్వస్థత చేకూర్చేదిగా మారుతుంది. కాబట్టి స్థితప్రజ్ఞ స్థితిని సాధించడానికి ప్రయత్నించడం ఆధ్యాత్మిక అన్వేషణ మాత్రమే కాదు... అది వైద్యరంగంలో, జీవితంలో చేసే సేవ తాలూకు అత్యున్నత వ్యక్తీకరణ.
డాక్టర్ శరత్‌రెడ్డి కార్డియాలజిస్ట్,
ట్రైనర్, హార్ట్‌ఫుల్‌నెస్ 9440087532
ఇవీ చదవండి:
మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ
డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి