శ్రీకూర్మనారాయణుడు
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:58 AM
దుష్ట శిక్షణ కోసం శ్రీ మహా విష్ణువు అనేక అవతారాలు ధరించాడు. వాటిలో ముఖ్యమైన దశావతారాల్లో... రెండోదైన కూర్మావతారం ఆంతర్యం విలక్షణమైనది....
తెలుసుకుందాం
దుష్ట శిక్షణ కోసం శ్రీ మహా విష్ణువు అనేక అవతారాలు ధరించాడు. వాటిలో ముఖ్యమైన దశావతారాల్లో... రెండోదైన కూర్మావతారం ఆంతర్యం విలక్షణమైనది. దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు... కిందకి కుంగిపోతున్న మంధర పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ సహకరించేందుకు ధరించిన అవతారం ఇది.
కూర్మస్తు కచ్ఛపాకారో మత్స్యరూపోక్త
రూపవాన్
ఈ అవతారంలో మహావిష్ణువు తెల్లని శరీరచ్ఛాయతో, రెండు చేతులతో, నడుము పైభాగంలో మనుష్య రూపంతో ఉంటాడు. నడుము కింది భాగం తాబేలుగా, మనుష్య పాదాలతో కూర్మరూపుడై కనిపిస్తాడు. కుడిచేతిలో గద, ఎడమచేతిలో శంఖం ధరించి ఉంటాడు. అయితే శ్రీవైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కింది భాగంలో తాబేలు స్వరూపాన్ని, పైభాగంలో మానవ శరీరాన్ని కలిగి.. అయిదు వర్ణాలతో సుందరంగా ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు. పర హస్తాలలో శంఖం, చక్రం ధరిస్తాడు. ఎడమచెయ్యి నడుము మీద ఉంటుంది.
కుడిచెయ్యి అభయముద్రతో అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కంఠం మీద హారాలు, యజ్ఞోపవీతం, ఉదరబంధం తదితర ఆభరణాలతో వెలిగిపోతూ ఉంటాడు. శ్రీవిష్ణువుకు మాత్రమే ప్రత్యేకమైన శ్రీవత్సంతో కూడి ఉంటాడు. అలాగే మరో రూపంలో... నీల వర్ణంతో కూడిన శ్రీకూర్మనారాయణస్వామి శంఖం, చక్రం, ధనుస్సు, ఖడ్గం, గద అనే పంచాయుధాలు ధరించి, అభయముద్రతో, అందమైన అలంకృత భుజాలతో కనిపిస్తాడు.
రెండు ధ్వజస్తంభాలు...
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం సమీపంలోని పుణక్షేత్రమైన శ్రీకూర్మంలో... శ్రీకూర్మనారాయణస్వామికి అద్భుతమైన దేవాలయం ఉంది. ప్రపంచంలో బహుశా ఇదే అతి ప్రాచీనమైన కూర్మనారాయణ క్షేత్రం. ఆలయ ముఖద్వారం తూర్పున ఉన్నపపటికీ శ్రీకూర్మనాథస్వామి పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటాడు. అందుకే ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ప్రతిష్ఠితమైన ఉన్నాయి. ఇలా ఒకటికన్నా ఎక్కవ ధ్వజస్తంభాలను శ్రీశైలం, జంబుకేశ్వరం లాంటి అతి కొద్ది శైవ క్షేత్రాల్లో మాత్రమే చూడగలం కానీ, వైష్ణవ క్షేత్రాలలో చాలా అరుదు. సాధారణంగా గర్భాలయంలో ద్వారానికి ఎదురుగా మూలవిరాట్ ఉంటారు. కానీ శ్రీకూర్మంలో గర్భాలయం ఎడమవైపు గోడ మూలగా... పెద్ద రాతి పీఠం మీద... రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో శ్రీకూర్మనాథుడు సాక్షాత్కరిస్తారు. మొత్తం విగ్రహానికి దట్టంగా గంధపుపూతను అలంకరిస్తారు.
శిల్పకళావైభవం
చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తుశకం ఏడో శతాబ్దానికి ముందే ఇక్కడ ఆలయం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరువాతి కాలంలో పలు రాజవంశాలు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశాయి. ప్రస్తుత ఉన్న ఆలయం కళింగ వాస్తు శిల్న శైలిలో నిర్మితమయింది. విశేషించి ఈ ఆలయ ప్రాకార మండపంలో ఒకదానితో ఒకటి ఏమాత్రం పోలి ఉండని రాతి స్తంభాలు ఉన్నాయి. ప్రతిదీ ఒక్కోవిధమైన రూప లావణ్యాన్ని, ఆనాటి మహా శిల్పుల భక్తి తత్పరతను, అంకితభావాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. గోడల మీద అనేక వైష్ణవ, శైవ, శక్తి సంబంధిత కుడ్య చిత్రాలను అందంగా మలిచారు. ప్రాకార మండపం గోడ మీద పధ్నాలుగో శతాబ్దం నాటి ఒడిశా పటచిత్ర శైలి కుడ్య చిత్రాలు ఉన్నాయి. నాటి చరిత్రను చాటి చెప్పే అనేక శాసనాలు కూడా చెక్కి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో శ్వేత పుష్కరణి అనే కోనేరు ఉంది. అక్కడే వందల కొద్దీ నక్షత్రాకారపు తాబేళ్ళు కూడా ఉంటాయి. వాటి పరిరక్షణ కోసం దేవస్థానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ తాబేళ్ళు ఇండోనేషియా నుంచి సముద్రంలో ఈదుకుంటూ శ్రీకూర్మనాథుని చెంతకు రావడం నేటికీ జరుగుతున్న వింతైన ఒక వాస్తవం. శ్రీరామానుజాచార్యులు, శ్రీమధ్వాచార్యులు ఈ ఆలయంలో స్వామిని దర్శించుకున్నట్టు చరిత్ర చెబుతోంది.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి
9440525788
ఇవీ చదవండి:
మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ
డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి