Share News

ధర్మ స్వరూపుడు... శ్రీరామచంద్రుడు

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:07 AM

‘‘రామో విగ్రహవాన్‌ ధర్మః... ధర్మానికి ఒక రూపం కల్పిస్తే అది శ్రీరామచంద్రుడు అవుతుంది’’ అని శ్రీమద్రామాయణం మనకు చెబుతుంది. ఆజానుబాహుడిగా, అరవింద దళాయతాక్షుడిగా...

ధర్మ స్వరూపుడు... శ్రీరామచంద్రుడు

తెలుసుకుందాం

నేడు శ్రీరామనవమి

‘‘రామో విగ్రహవాన్‌ ధర్మః... ధర్మానికి ఒక రూపం కల్పిస్తే అది శ్రీరామచంద్రుడు అవుతుంది’’ అని శ్రీమద్రామాయణం మనకు చెబుతుంది. ఆజానుబాహుడిగా, అరవింద దళాయతాక్షుడిగా ఆ రాముని రూపాన్ని మహర్షులు వర్ణించారు. రమంతే యోగినో యస్మిన్‌ ఇతి రామః... ఎవరిలో యోగులు, జ్ఞానులు నిరంతరం రమిస్తూ ఉంటారో ఆయనే రాముడు. శ్రీరాముడు మానవరూపంలో అవతరించిన, అనంత ఆనంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు. శ్రీరాముణ్ణి నేరుగా దర్శించిన వాల్మీకి... శ్రీమద్రామాయణం ‘బాలకాండ’లో ఆ స్వామి రూపాన్ని అద్భుతంగా వర్ణించాడు:

విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః/ మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః/ ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః/ సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్‌/ పీనవక్షో విశాలాక్షః లక్ష్మీవాన్‌ శుభలక్షణః

‘శ్రీరామచంద్రమూర్తి విశాలమైన భుజాలు కలిగినవాడు. మోకాళ్ళవరకూ పొడవైన చేతులు కలిగిన మహాబాహుడు. శంఖం లాంటి అందమైన కంఠం, సుందరమైన, దృఢమైన దవడలు, విశాలమైన ఛాతీ కలిగినవాడు. చక్కటి శిరస్సు, వెడల్సయిన నుదురు, విశాలమైన నేత్రాలు... ఇలా ఒక్కటేమిటి... శరీరావయావలన్నీ సరైన నిష్పత్తిలో పొందికగా అమరి, శుభప్రదమైన సాముద్రిక లక్షణాలన్నీ పుష్కలంగా ఉండి, నీలమేఘ శ్యామ వర్ణ శరీర ఛాయతో... లక్ష్మీప్రదమైన నిత్యశోభను కలిగి శ్రీరాముడు ప్రకాశిస్తున్నాడు’’ అని భావం. పరాక్రమవంతుడైన శ్రీరాముడు గంభీరమైన నడక కలిగి, ‘కోదండం’ అనే గొప్ప ధనస్సు ధరించి, అలా ధరించినప్పుడు మెడ కింద ఉండే అందమైన ఎముకలు చర్మం లోపలికి అదిమిపెట్టినట్టు ఉండే గొప్ప అందగాడనీ, గొప్ప పరాక్రమవంతుడై శత్రువులను అణచివేసేవాడనీ, అన్నిటికీ మించి హెచ్చుతగ్గులులేని సమతుల్యమైన వ్యక్తిత్వం కలవాడనీ... శ్రీరాముడి రూపాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించాడు. వాల్మీకి. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ కూడా తాను రచించిన శ్రీరామాయణ మహాకావ్యంలో శ్రీరాముని రూప లావణ్యాన్ని ఇంచుమించు ఇదే విధంగా... ‘‘నీల మేఘచ్ఛాయ బోలు దేహమువాడు/ధవళాబ్జ పత్ర నేత్రములవాడు/ కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు/చక్కని పీన వక్షంబువాడు/తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాడు/ఘనమైన దుంధుభి స్వనమువాడు/పద్మ రేఖలు గల్గు పద యుగంబులవాడు/బాగైన యట్టి గుల్ఫములవాడు/ కపటమెఱుగని సత్య వాక్యములవాడు/ రమణి! రాముండు శుభ లక్షణములవాడు/ ఇన్ని గుణముల రూపింప నేర్పరివాడు/వరుస సౌమిత్రి బంగారు వన్నె వాడు...’’ అని వర్ణించింది.


ఆ లక్షణాలను శిల్పంలో రూపొందించే క్రమంలో 33 శుభలక్షణాలతో ఆ శిల్పం ఉండాలని చెబుతూ... ఆ విషయాన్ని శిల్పకళా విద్యార్థులు కంఠోపాఠం చేయాల్సిన ‘మహాపురుషుల లక్షణాల సూత్రవాక్యం’గా శ్రీపాంచరాత్రాగమంలోని ‘పద్మసంహిత’ పేర్కొంది. అదే... పంచదీర్ఘం చతుర్హ్రస్వం పంచసూక్ష్మం షడున్నతమ్‌/ సప్తరక్తం త్రిగంభీరం త్రివిస్తీర్ణం ప్రశస్యతే... అనే శ్లోకం.

శ్రీరాముడు 33 శుభ లక్షణాలను కలిగి ఉంటాడు. మహా పురుషుల శిల్పాలలో ఈ లక్షణాలు తప్పనిసరి.

పంచదీర్ఘం: ఐదు పొడవైనవి. అవి... చేతులు. కన్నులు, ముక్కు, హనువు (గడ్డము), స్థనాల మధ్య అంతరం.

చతుర్హ్రస్వం: పొడవు తక్కువ ఉండాల్సిన నాలుగు. అవి... కంఠం, పురుషాంగం, పృష్ఠం, ముంగాలు.

పంచసూక్ష్మం: చాలా సూక్ష్మంగా ఉండే ఐదు. అవి... వేళ్ల గణుపులు, తలపై జుట్టు, దంతాలు, గోర్లు, చర్మం.

షడున్నతం: ఎత్తైనవి ఆరు... కక్ష్యలు (బాహుమూలాలు ), పొట్ట, వక్షం (ఎద), ముక్కు, భుజాలు, నుదురు.

సప్తరక్తం: ఎర్రగా ఉండాల్సిన ఏడు. అవి... అరచేయి, అరికాలు, కనుకొనలు, గోర్లు, నాలుక, చెక్కిళ్ళు, పెదవులు.

త్రిగంభీరం: లోతుగా ఉండే మూడు. అవి... కంఠం కింద ఉండే ముచ్చినగుంట, వక్షప్రదేశంలో ఉండే హృదయస్థానం, బొడ్డు.

త్రివిస్తీర్ణం: విశాలమైన మూడు. అవి... వక్షప్రదేశం (ఎద), శిరస్సు, నుదురు.

అలాగే శ్రీ వైఖానస ఆగమశాస్త్రంలో ‘విమానార్చనకల్పం’గా పేర్కొనే ‘మరీచిసంహిత’... శ్రీ సీతారాములను, వారి పరివారాన్నీ ఇలా వర్ణిస్తోంది.

శ్రీరాముడు శ్యామ వర్ణ దేహ ఛాయలతో , ఎర్రని వస్త్రాలు ధరించి, శిరస్సుపై మకుటం, కుడివైపు వక్షస్థలంలో శ్రీవత్సం కలిగి, రెండు భుజాలతో (కుడిచేత బాణంతో, ఎడమచేత ధనుస్సుతో)... త్రిభంగిముద్రలో ఉంటాడు సీతాదేవి బంగారువర్ణ ఛాయలతో మెరిసిపోతూ, శ్రీ రాముడికి కుడి పక్కన నిలబడి, తెల్లని వస్త్రాలు ధరించి, ఎడమ చేతిలో వికసించిన పద్మం ధరించి ఉంటుంది. రాముడికి ఎడమవైపున లక్ష్మణుడు బంగారువర్ణంలో, ధనుస్సు ధరించి నిలబడి ఉంటాడు. భరతుడు కుడి పక్కన శ్యామవర్ణంలోనూ, శత్రుఘ్నుడు ఎడమపక్కన హేమ వర్ణంలోను ఉంటారు. స్వామికి కుడివైపున నలుపు, నీలం కలగలిసినట్టు ఉండే అంజనాభ వర్ణంలో... శ్రీ ఆంజనేయస్వామి వినయంగా శ్రీరామునికి నమస్కరిస్తూ అంజలి ముద్రలో ఉంటాడు. అయితే, తిరుమల క్షేత్రంలోని శ్రీవారి సన్నిధిలో భగవద్రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకోదండరాముడి మూర్తులు విలక్షణంగా ఉంటాయి. శ్రీ రామ లక్ష్మణులు కిరీటాలు కాకుండా... జటా మకుటాలు కలిగి ఉంటారు. సీతమ్మతల్లి మాత్రమే కరండ మకుటం దాల్చి ఉంటుంది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి తన చేతులను నోటికి అడ్డంగా ఉంచి... శ్రీరాముని ఆజ్ఞకు ఎదురుచూస్తున్నట్లుగా ‘ఆజ్ఞాపాలక ఆంజనేయస్వామి’గా కొలువై ఉంటాడు.

డి.యన్‌.వి. ప్రసాద్‌,

స్థపతి, 9440525788

ఇవి కూడా చదవండి

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..

IPL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 01:08 AM