Budgeting Tips: జేబు పదిలం
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:20 AM
కొత్త ఏడాది అనగానే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు సహజం. అయితే, మనందరినీ తరచూ వేధించే అతిపెద్ద సమస్య డబ్బు. ఎంత సంపాదిస్తున్నాం అన్నదానికంటే...
కొత్త ఏడాది అనగానే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు సహజం. అయితే, మనందరినీ తరచూ వేధించే అతిపెద్ద సమస్య డబ్బు. ఎంత సంపాదిస్తున్నాం అన్నదానికంటే ఎలా ప్లాన్ చేస్తున్నామన్నదే ముఖ్యం. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మీరు మేధావులై ఉండక్కర్లేదు. కాస్త ప్రణాళిక ఉంటే చాలు. 2026లో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుని, ధైర్యంగా ముందుకెళ్లడానికి సులభమైన ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు.
ఆచరణాత్మక బడ్జెట్
బడ్జెట్ అంటే ప్రతి పైసా లెక్క రాసి భయపడటం కాదు. అది మీ ఖర్చులకు ఒక మార్గదర్శిలా ఉండాలి. మీ ఆదాయాన్ని అవసరాలు (అద్దె, నిత్యావసరాలు, బిల్లులు), పొదుపు, సరదాలు.. ఇలా మూడు భాగాలుగా విభజించుకోండి. చాలా కఠినంగా ఉండే బడ్జెట్ కంటే, ప్రతినెల మీరు సులభంగా పాటించగలిగే బడ్జెట్ ప్లానే ఉత్తమం.
అత్యవసర నిధి
పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాల గురించి ఆలోచించే ముందు ‘ఎమర్జెన్సీ ఫండ్’ ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యం, ఉద్యోగ సమస్యలు, అనుకోని మరమ్మతులు వంటి సమయాల్లో అప్పు చేయకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. మీ నెలవారీ ఖర్చులకు మూడు నుంచి 6 రెట్లు సమానమైన మొత్తాన్ని ఎప్పుడూ సేవింగ్స్ ఖాతాలో ఉంచుకోండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
క్రెడిట్‌కార్డులతో జాగ్రత్త
అప్పు అనేది నిశ్శబ్దంగా మీ ఆర్థిక పునాదులను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా భారీ వడ్డీ ఉండే రుణాలు, క్రెడిట్ కార్డు బాకీలను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. కేవలం ‘మినిమమ్ అమౌంట్’ కడుతూ పోతే మీరు వడ్డీ చక్రబంధంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. కనీస మొత్తం కంటే కొంచెం ఎక్కువ చెల్లించడం వల్ల లోన్ గడువు తగ్గడమే కాకుండా వడ్డీభారం కూడా తగ్గుతుంది.
క్రమం తప్పకుండా పెట్టుబడి
పెట్టుబడి పెట్టేందుకు లక్షలు అవసరం లేదు. ప్రతినెలా కొద్దిమొత్తంలోనైనా సరే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల కాలక్రమేణ పెద్దమొత్తం సమకూరుతుంది. మార్కెట్ ఒడిదుడుకులను చూసి భయపడి నిర్ణయాలు మార్చుకోవద్దు. వేగంగా లాభాలు రావాలని ఆశపడకుండా ఓపికతో నిలకడగా పెట్టుబడి పెట్టేవారికి దీర్ఘకాలంలో మంచి ఫలితాలు అందుతాయి.
నామినీ వివరాల పరిశీలన
చాలామంది చేసే తప్పు.. ఏదైనా ఆపద వచ్చే వరకు ఇన్సూరెన్స్ గురించి ఆలోచించకపోవడం. మీ కుటుంబ సభ్యుల అవసరాలకు తగినట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయో, లేదో ఒకసారి చూసుకోండి. అలాగే, మీ బ్యాంకు అకౌంట్లు, ఇన్వె్‌స్టమెంట్ పేపర్లు, ఇన్సూరెన్స్ పాలసీల్లో నామినీ వివరాలు అప్‌డేట్ అయి ఉన్నాయో, లేదో చూసుకోవాలి. ఇది మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు అనవసరమైన ఇబ్బందులు కలగకుండా చూస్తుంది.
పర్సనల్ ఫైనాన్స్ అంటే అదేమీ బ్రహ్మవిద్య కాదు. చిన్నచిన్న మార్పులు, క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలే మిమ్మల్ని ధనవంతుడిని చేస్తాయి. కొత్త ఏడాదిలో ఈ మార్పులతో మీ ఆర్థిక ప్రయాణాన్ని ధీమాగా మొదలుపెట్టండి.
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..