గగన పుత్రిక ఆశా!
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:31 AM
ఆకాశంలో స్వేచ్ఛా విహంగంలా దూసుకుపోవడం కొందరికి కల అయితే, ఆ కలను నిజం చేసుకుని ఆకాశాన్నే తన సామ్రాజ్యంగా మార్చుకున్న ధీర వనిత ఆమె. నిర్మలమైన నీలాకాశంలో మేఘాలను తాకుతూ, గాలిని చీల్చుకుంటూ...
ఆకాశంలో స్వేచ్ఛా విహంగంలా దూసుకుపోవడం కొందరికి కల అయితే, ఆ కలను నిజం చేసుకుని ఆకాశాన్నే తన సామ్రాజ్యంగా మార్చుకున్న ధీర వనిత ఆమె. నిర్మలమైన నీలాకాశంలో మేఘాలను తాకుతూ, గాలిని చీల్చుకుంటూ పారాచూట్‌తో కిందికి దూకడం ఆమెకు ఎంతో ఇష్టం. ఆ సాహసమే ఆమె ఊపిరి. ఆమె మరెవరో కాదు.. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ ఆశా టి.జ్యోతిర్మయి. ఆమె కథ పట్టుదల, ధైర్యం.. స్ఫూర్తికి నిలువుటద్దం.
హైదరాబాద్‌కు చెందిన గ్రూప్ కెప్టెన్ ఆశా జ్యోతిర్మయి ప్రస్థానం ఓ క్రీడాకారిణిగా మొదలైంది. పాఠశాల రోజుల నుంచే క్రీడల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఆమె అథ్లెటిక్స్‌లో హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో జాతీయ స్థాయిలో రాణించారు. ఎనిమిదేళ్లపాటు జాతీయ అథ్లెట్‌గా కొనసాగిన తర్వాత దేశ సేవ చేయాలన్న సంకల్పంతో 1997 డిసెంబర్ 20న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎ్‌ఫ)లో అకౌంట్స్ ఆఫీసర్‌గా చేరారు. వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే తనలోని సాహస క్రీడాకారిణిని మేల్కొలిపారు.
రెండేళ్లలోనే 100 జంప్స్
1999లో ఆగ్రాలో తొలి పోస్టింగ్ సందర్భంగా ఆమె జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది. అక్కడ పారాచూట్లు గాలిలో రెపరెపలాడుతుండటం చూసి ఆమె మనసు ఉప్పొంగిపోయింది. ఆ క్షణమే స్కైడైవింగ్‌పై ప్రేమలో పడిపోయారు. వెంటనే పారా జంపింగ్ కోర్సు కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. స్టాటిక్ లైన్ జంప్స్ చేస్తూనే, ప్రదర్శన జంప్స్‌కు ఎంపికయ్యారు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే 100 జంప్స్ పూర్తిచేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ మహిళాగా రికార్డు సృష్టించారు.
రికార్డుల పరంపర
గ్రూప్ కెప్టెన్ ఆశా తన 26 ఏళ్ల వైమానిక దళ కెరీర్‌లో ఎన్నో రికార్డులు బద్దలుగొట్టారు. 2001లో మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి జంప్ చేసిన ఏకైక మహిళగా నిలిచారు. 73, 75 మంది సభ్యులతో కూడిన ఐఏఎఫ్ స్కై డైవింగ్ బృందంలో సభ్యురాలిగా ఉండి రికార్డులు నెలకొల్పారు. ఆమె ప్రస్థానం కేవలం వ్యక్తిగత రికార్డులకే పరిమితం కాలేదు. 2010లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ మిలిటరీ పారాచూటింగ్ చాంపియన్‌షి్‌పలో మొట్టమొదటి భారత మహిళా స్కైడైవింగ్ జట్టుకు నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. 2011లో అమెరికాలోని అరిజోనాలో ఫార్మేషన్ ఫ్లయింగ్‌లో నైపుణ్యం సాధించిన మహిళా స్కై డైవింగ్ బృందాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
విదేశీ గడ్డపై అరుదైన రికార్డు
ఏరోస్పేస్ రంగంలో మహిళా ప్రాధాన్యాన్ని చాటిచెబుతూ 2019 ఏరో ఇండియా ప్రదర్శనలో మహిళా పారా జంపింగ్ బృందానికి ఆమె నాయకత్వం వహించారు. 2021 ఏప్రిల్‌లో నిర్వహించిన మహిళా త్రివిధ దళాల పారా జంపింగ్ కోర్సులో శిక్షకురాలిగా ఉన్న ఏకైక మహిళ ఆశానే కావడం విశేషం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 2021 ఆగస్టు 15న జైసల్మేర్‌లో 75 మంది త్రివిధ దళాల సభ్యులు చేసిన రికార్డు స్కై డైవింగ్ ప్రదర్శనలో పాల్గొన్న ఏకైక మహిళ కూడా ఆమే. బంగ్లాదేశ్ విక్టరీ పరేడ్‌లో భారత రాష్ట్రపతి, బంగ్లాదేశ్ అధ్యక్షుల సమక్షంలో విదేశీ గడ్డపై 10 వేల అడుగుల ఎత్తు నుంచి భారత జెండాను రెపరెపలాడించి మరో చారిత్రక ఘట్టాన్ని లిఖించారు.
పట్టుదలకు ప్రతిరూపం
ఆశా ప్రస్థానం పూలపాన్పు కాదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె రెండుసార్లు ప్రాణాంతక ప్రమాదాలను ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో రెట్టించిన ఉత్సాహంతో తిరిగి ఆకాశంలోకి ఎగిరారు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిళ్లు తన ప్యాషన్‌కు అడ్డు కాలేవని నిరూపించారు. ఆమె ఒక అధికారి భార్య, ఇద్దరు పిల్లల తల్లి. ప్రసవం తర్వాత కేవలం పది నెలలకే స్కై డైవింగ్ ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘గర్భం, కొవిడ్ మాత్రమే స్కై డైవింగ్ నుంచి ఆమెను తాత్కాలికంగా ఆపగలిగాయి’’ అని సహచరులు చెప్పే మాటలు ఆమె అంకితభావానికి నిదర్శనం. ఇటీవల ఆమె మరో ఘనత సాధించారు. తన కుమారుడు, ఎన్‌సీసీ క్యాడెట్ రెనీ్‌షతో కలిసి స్కైడైవింగ్ చేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక తల్లీకొడుకుల జంటగా వారు నిలిచారు. ఇది ఆమె వారసత్వాన్ని, స్ఫూర్తిని తర్వాతి తరానికి అందిస్తున్న తీరుకు ప్రతీక.
ఆశా సాధించిన విజయాలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2019లో రక్షణ మంత్రి, 2024లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమెను సత్కరించారు. ఫిక్కీ, సీసీఐ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఆమెను ‘విమెన్ అచీవర్’గా గౌరవించాయి. ఇప్పటికి 1,016 జంపులు పూర్తిచేసి తన ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తున్న గ్రూప్ కెప్టెన్ ఆశా జ్యోతిర్మయి.. నారీశక్తికి, సాహసానికి నిలువుటద్దం. ఆకాశంలో ఎగరాలనుకునే ప్రతి ఒక్కరికీ ఆమె ఒక మార్గదర్శి.
ఇవి కూడా చదవండి..
ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన