Shalini Pandey on Turning 32: వయసు పెరగడం ఒక వరం
ABN , Publish Date - Jan 11 , 2026 | 02:01 AM
తెరపై గ్లామర్ ఒలకబోయడం వేరు.. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉండటం వేరు. జబల్‌పూర్ గల్లీల నుంచి వెండితెర మెరుపుల వరకు షాలినీ పాండే సాగించిన ప్రయాణం ఒక నిరంతర పాఠం...
సెలబ్ టాక్
తెరపై గ్లామర్ ఒలకబోయడం వేరు.. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉండటం వేరు. జబల్‌పూర్ గల్లీల నుంచి వెండితెర మెరుపుల వరకు షాలినీ పాండే సాగించిన ప్రయాణం ఒక నిరంతర పాఠం. ‘అర్జున్‌రెడ్డి’లో అమాయకపు ప్రీతిగా మెప్పించిన ఈ భామ ఇప్పుడు 32 ఏళ్ల వయసులో మరింత పరిణితితో మాట్లాడుతోంది. 2026లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న షాలిని.. తన కెరీర్, ఫిట్‌నెస్, నెపోటిజంపై తన అభిప్రాయాలను కుండ బద్దలుగొట్టినట్టు చెప్పింది.
గతేడాది తనకు నేర్పిన అతిపెద్ద పాఠం గురించి షాలిని చెబుతూ... ‘‘జీవితం పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ మనం చేసే పనిలో సార్థకత ఉంటే చాలు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘రాహు కేతు’ వంటి క్రేజీ ప్రాజెక్టుతోపాటు ‘బంద్‌వాలే’ అనే వెబ్ సిరీస్ కూడా ఉంది.
అది పరిణితికి సంకేతం
వయసు పెరగుదలపై అడిగిన ప్రశ్నకు షాలిని చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. ‘‘వయసు పెరగడం అనేది ఒక అదృష్టం. అది మనం జీవిస్తున్నామని, పరిణితి చెందుతున్నామని చెప్పే సంకేతం. ఆందోళనతో కాదు, నిజాయతీతో వయసును ఆహ్వానించాలని మా అమ్మ చెబుతుంటుంది’’ అని తన పరిణితిని చాటుకుంది.
ప్రేక్షకుల తీర్పే ఫైనల్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే ‘వారసత్వం’పై షాలిని మాట్లాడుతూ.. ‘‘నెపోటిజం అనేది ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి మాత్రమే పనికొస్తుంది. ఆ తర్వాత మాత్రం ప్రతిభ ఉంటేనే నిలబడగలం. ప్రేక్షకులను మెప్పించడానికి షార్ట్‌కట్‌లు ఉండవు. మన పని మనం చేసుకోవాలి. అంతిమంగా ప్రేక్షకుల తీర్పే ఫైనల్’’ అని షాలిని చెప్పుకొచ్చింది.
ఫిట్‌నెస్ రహస్యం
తన ఫిట్‌నెస్ రహస్యం గురించి మాట్లాడుతూ కఠినమైన డైట్‌ల కంటే శరీరానికి ఏది అవసరమో దానిపైనే దృష్టి పెడతానని షాలిని చెప్పింది. ‘‘నా శరీరం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అందంగా కనిపించడానికే కాదు, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటమే ఫిట్‌నెస్’’ అని అభిప్రాయపడింది. యోగా, స్ట్రెంగ్ ట్రైనింగ్ తన దైనందిన జీవితంలో భాగమని చెప్పింది. తగినంత నిద్ర, నీరు, స్థిరత్వం, వీటికి తోడు మన చుట్టూ మంచి మనుషులు, పెంపుడు జంతువులు ఉంటే కలిగే మానసిక ప్రశాంతతే అసలైన ‘గ్లో’ అంటూ తన చర్మకాంతి రహస్యాన్ని బయటపెట్టింది.
కుక్కపిల్లలే ప్రపంచం
షూటింగ్‌లు లేని సమయంలో తన ఇంట్లోని రెండు కుక్కపిల్లలతో గడపటమే తనకు అత్యంత ఇష్టమైన పని అని షాలిని సరదాగా చెప్పుకొచ్చింది. ‘‘ఒకవేళ నేను నటిని కాకపోతే కచ్చితంగా ఒక ‘డాగ్ వాకర్’ను అయ్యేదాన్ని’’ అంది నవ్వుతూ.
వారే నాకు స్ఫూర్తి
పురుషాధిక్య ప్రపంచం అనే గీతను మనమే గీసుకుని, మళ్లీ మనమే ఆ గీతను చెరిపేయాలని చూడకూడదని షాలిని హితవు పలికింది. నీతా అంబానీ, షబానా ఆజ్మీ, జ్యోతి దేశ్‌పాండే వంటి వారు తమతమ రంగాలలో రాణిస్తున్నారని, వారిని చూసి తాను స్ఫూర్తి పొందుతానని వివరించింది. ‘‘మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుని మీ సంతోషాన్ని పోగొట్టుకోకండి. మీ పట్ల మీరు దయతో ఉండండి’’ అంటోది ఈ బ్యూటీ.
ఇవీ చదవండి:
నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు
రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్