Share News

సోపాన సప్తకం

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:42 AM

క్రైస్తవ ధర్మం పాటించేవారు తమ జీవనయానం ఒక క్రమ పద్ధతిలో, పవిత్రంగా సాగడం కోసం కొన్ని నియమాలను పాటిస్తారు. వాటిని ‘సాంగ్యాలు’ లేదా ‘పవిత్ర సాంగ్యాలు’ అంటారు. అవి...

సోపాన సప్తకం

దైవమార్గం

క్రైస్తవ ధర్మం పాటించేవారు తమ జీవనయానం ఒక క్రమ పద్ధతిలో, పవిత్రంగా సాగడం కోసం కొన్ని నియమాలను పాటిస్తారు. వాటిని ‘సాంగ్యాలు’ లేదా ‘పవిత్ర సాంగ్యాలు’ అంటారు. అవి తమను పరిపూర్ణ విశ్వాసులుగా సమాజంలో నిలబెడతాయని, జీవించే క్రమంలో మనలో చోటు చేసుకొనే మాలిన్యాలను నియంత్రించి, దేవుని దారిలో నడిపిస్తాయని క్రైస్తవులు విశ్వసిస్తారు. ఈ ఏడు సాంగ్యాలను పవిత్ర గమ్యాన్ని చేర్చే మార్గాలుగా, క్రీస్తు శిఖరానికి తీసుకువెళ్ళే ‘సోపాన సప్తకం’గా కూడా పరిగణిస్తారు.

వీటిలో మొదటిది... పుట్టిన బిడ్డకు నీటితో శుద్ధీకరణ. అంటే బాప్తిస్మం. దానిపైనే మిగిలిన ఆరూ ఆధారపడి ఉంటాయి. రెండోది... పసిబిడ్డగా... ఏదీ తెలియని వయసులో బాప్తిస్మం పొందినప్పటికీ... యవ్వన దశ వచ్చినప్పుడు.. దేవుడి ఆలోచనల్లో నిశ్చల స్థితిని పొందాలి. అప్పుడే ప్రభువు కృపలో ధైర్యంగా జీవించే బలం చేకూరుతుంది. ఇది ఒక సైనికుడు ఆయుధంతో నడవడం లాంటిది. మూడోది... దివ్య పూజలలో పాల్గొని, ఆ పూజా ఫలాలుగా రొట్టెను, ద్రాక్షరసాన్ని క్రీస్తు శరీరం, రక్తాలుగా పరిగణించి వాటిని స్వీకరించాలి. దీనివల్ల దైనందిన జీవితంలో తగిన శక్తిని పొందుతామనే విశ్వాసం ఉంది. నాలుగోది... చేసిన తప్పులను, పాపాలను, క్రీస్తు ప్రతినిధి అయిన చర్చి ప్రీస్టు దగ్గర ఒప్పుకొని, ప్రవర్తనను సరిదిద్దుకోవడం. దీన్ని ‘కన్ఫెషన్‌’ అంటారు. క్రైస్తవ జీవనంలో ఇది చాలా ముఖ్యమైన అంశం. అయిదోది... విశ్వాసి రోగగ్రస్తుడైనప్పుడు... ఏసు మందిరానికి వెళ్ళి, నూనెతో అభిషేకించి, స్వస్థత కోసం ప్రార్థించాలి. బాధలో మనం ఒంటరిగా లేమనీ, దైవం మన బాధలను పంచుకుంటాడనీ ధైర్యాన్ని అందించే నియమం ఇది. ఆరోది... సమాజాన్ని సక్రమమైన పద్ధతిలో నడిపించడం కోసం క్రీస్తు ప్రతినిధులుగా క్రైస్తవ గురువులు అభిషిక్తులు కావాలి పైన చెప్పిన నియమాలు పాటించే సమాజానికి పునాది... కుటుంబం ఆ కుటుంబంలో భార్యాభర్తలు వైవాహిక బంధాన్ని పవిత్రంగా కొనసాగించాలి. సమాజానికి మంచి సంతానాన్ని ఇవ్వాలి. ఇది ఏడోది. ఈ నియమాలన్నీ క్రైస్తవ జీవన విధానాన్ని పరిపూర్ణం చేయడానికి సహకరిస్తాయి.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 05:42 AM