Share News

సంపూర్ణత సాధిద్దాం

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:52 AM

ఆది శంకరులు, రామానుజాచార్యులు సిద్ధాంతాలలో కొంత భేదం ఉండవచ్చు. కానీ వారి లక్ష్యం మాత్రం మోక్షస్థితిని చేరుకోవడమే! ఒక వ్యక్తి అంతర్గత సూక్ష్మ శరీరంలో, నాడులలో...

సంపూర్ణత సాధిద్దాం

సహజయోగ

ఆది శంకరులు, రామానుజాచార్యులు సిద్ధాంతాలలో కొంత భేదం ఉండవచ్చు. కానీ వారి లక్ష్యం మాత్రం మోక్షస్థితిని చేరుకోవడమే! ఒక వ్యక్తి అంతర్గత సూక్ష్మ శరీరంలో, నాడులలో శక్తి ప్రవాహం ఎలా జరుగుతుందో వివరిస్తూ... ఆత్మసాక్షాత్కార సాధనకు ఆ మహనీయులు ప్రస్తుతించిన దేవతామూర్తులు ఎలా దోహదం చేస్తారో మాతాజీ నిర్మలాదేవి వివరించారు.

ఆదిశంకరాచార్యులు జగన్మాతను సకల సామ్రాజ్యాలకు అధినేతగా ఎనిమిది శ్లోకాలలో రాజరాజేశ్వరీ దేవిని స్తుతించారు. వాస్తవానికి రాజరాజేశ్వరీ దేవి కూడా శక్తి స్వరూపమే! ఇదే విధంగా రామానుజాచార్యులు లక్ష్మీదేవిని అనేక సందర్భాలలో స్తుతించారు. బాహ్యంగా ఈ రెండు రూపాలు వేర్వేరుగా కనబడినా.. మోక్ష సాధకుల దృ ష్టిలో.... ఒక్కటే! మన శరీరంలో ఎడమ పార్శ్వంలో ఇడా నాడి, కుడి పార్శ్వంలో పింగళా నాడి ఉంటాయి. ఈ రెండింటి మధ్యన సుషుమ్నా నాడి ఉంటుంది. ఇదే కుండలిని శక్తి ప్రయాణించే మార్గం. ఈ నాడికి శ్రీమహాలక్ష్మి అధిష్టాన దేవత. కుండలిని శక్తి నాభి చక్రాన్ని చేరినప్పుడు - అది రాజరాజేశ్వరిగా స్థిరపడి - గృహలక్ష్మి, రాజ్యలక్ష్మి లాంటి అనేక రూపాలను సంతరించుకుంటుంది. కుండలిని జాగృతమైనప్పుడు... ఈ రూపాలన్నీ మనలో స్థిరపడతాయి, ప్రకాశవంతమవుతాయి. కుండలిని శక్తి నాభి చక్రానికి చేరినప్పుడు మాత్రమే అక్కడ రాజరాజేశ్వరి శక్తి ఉత్తేజితమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అది నాభి ఎడమ వైపు గృహలక్ష్మిగా, కుడివైపు రాజ్యలక్ష్మిగా స్థిరపడుతుంది.


ఆధ్యాత్మిక ప్రస్థానంలో కీలకపాత్ర

మన అంతర్గత సూక్ష్మ శరీరం లోని కుండలినీ శక్తి కుడివైపు లేదా ఎడమవైపు అతిగా వెళ్లకుండా మధ్యే మార్గంలో ప్రయాణించినప్పుడు మాత్రమే మనలోని శక్తి కేంద్రాలు పరిపుష్టమవుతాయి. వాటి ద్వారా కుండలిని శక్తి ప్రయాణించి సహస్రారాన్ని చేరుకుంటుంది. ఈ సహస్రారంలోని బ్రహ్మరంధ్రమే సదాశివుని పీఠం. అంటే ఒక సాధకుడికి కుండలిని ప్రయాణంలో మధ్యే మార్గంలోని మహాలక్ష్మి ప్రసన్నమవుతుంది. ఆ తర్వాత సహస్రారంలో రాజరాజేశ్వరీ దేవి ప్రసన్నురాలవుతుంది. వాస్తవానికి ఈ రెండు బాహ్యంగా వేర్వేరుగా అనిపించినా- ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రస్థానంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒక కుండలో సగం వరకే నీరు ఉంటే అది చిందుతుంది. నీరు పూర్తిగా ఉంటే నీరు చిందదు. ఇదే విధంగా.... సంపూర్ణతతో ఉండేవారు నిండుకుండలా ఉంటారు. వారికి ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఒకసారి ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ప్రపంచమంతా వసుధైక కుటుంబంగా మారిపోతుంది. అలాంటి సంపూర్ణత్వాన్ని పొందడానికి సాధకులంతా ప్రయత్నించాలి.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఇవీ చదవండి:

మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ

డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి

Updated Date - Apr 17 , 2026 | 12:52 AM