Share News

దక్షిణాది నాకు గర్వకారణం

ABN , Publish Date - May 17 , 2026 | 04:37 AM

గ్లామర్‌ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి.. ఆపై విరామం తీసుకున్న హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ, సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అంతే ప్రభావం చూపేవారు కొందరే....

దక్షిణాది నాకు గర్వకారణం

గ్లామర్‌ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి.. ఆపై విరామం తీసుకున్న హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ, సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అంతే ప్రభావం చూపేవారు కొందరే. అలాంటి వారిలో సమీరారెడ్డి ఒకరు. అప్పట్లో సౌత్‌ సినిమాలంటే బాలీవుడ్‌ భామలకు ఉన్న చులకన భావాన్ని పటాపంచలు చేస్తూ.. ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన

తన ప్రయాణాన్ని సమీర తాజాగా గుర్తుచేసుకున్నారు.

నా సినీ ప్రయాణం మొదలైన కొత్తలో జరిగిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. 2004లో నేను తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన ‘నరసింహుడు’తో పరిచయం అవుతున్నాను. అప్పుడు ముంబైలోని నా టీం సభ్యులు నా దగ్గరకు వచ్చి ‘సమీర నువ్వు తప్పు చేస్తున్నావు. హిందీలో అవకాశాలు లేక ఫ్లాప్‌ అయిన హీరోయిన్లు మాత్రమే సౌత్‌ సినిమాలకు వెళ్తారు. ఇప్పుడు నువ్వు వెళ్తే నీ కెరీర్‌ ముగిసినట్టే’ అని హెచ్చరించారు. ఆ మాటలు నన్ను ఎంతో ఆశ్చర్యపరిచాయి. అంతకంటే ఎక్కువగా బాధించాయి. నేను ఒక సౌత్‌ ఇండియన్‌ని. మన సంస్కృతి, మన భాష అంటే నాకెంతో గౌరవం. హిందీ కంటే దక్షిణాదిలోనే నాకు ఎక్కువ గౌరవం దక్కుతుందని నా మనసు బలంగా చెప్పింది. దానికి తోడు నేను చిరంజీవి, ఎన్టీఆర్‌, సూర్య, అజిత్‌, మోహన్‌లాల్‌ వంటి దిగ్గజాలతో నటిస్తుంటే మా నాన్న కళ్లలో కనిపించిన ఆ గర్వం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. నిజానికి సౌత్‌ ఇండస్ట్రీ టెక్నాలజీలో కానీ, మేకింగ్‌లో కానీ బాలీవుడ్‌ కంటే ఎప్పుడూ రెండడుగులు ముందే ఉంది. అందుకే నేను తీసుకున్న ఆ నిర్ణయం నా కెరీర్‌లోనే ‘ది బెస్ట్‌ మూవ్‌’.

అక్షయ్‌తో వెరైటీ ప్రేమ కథ

నా జీవితంలోకి అక్షయ్‌ వర్దే ప్రవేశించడం ఒక అందమైన సినిమాటిక్‌ మలుపు. ‘తేజ్‌’ సినిమా షూటింగ్‌లో మాకు పరిచయమైంది. అక్షయ్‌ తన కస్టమ్‌ బైక్స్‌ బిజినెస్‌ విషయంలో చాలా బిజీగా ఉండేవారు. చిత్రమేంటంటే ఆయనకు అప్పట్లో బాలీవుడ్‌ మీద పెద్దగా అవగాహన ఉండేది కాదు. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చేటప్పుడు ఒక ‘హీరోయిన్‌’ వస్తుందని తెలిసినప్పుడు ఆయన తన మనసులో లారా దత్తా వస్తుందేమో అని అనుకున్నారట. నన్ను చూశాక ‘నేను అనుకున్న లారా దత్తా ఈమె కాదు కదా’ అని కాసేపు అయోమయానికి గురయ్యారట. కానీ నా విషయం వేరు. అక్షయ్‌ను చూడగానే ఫిదా అయిపోయాను. ఒక టీనేజ్‌ అమ్మాయిలా ఆయనను ఇంప్రెస్‌ చేయడానికి ఏవోవో కథలు చెప్పి, సినిమా వాళ్లకు బైక్‌ ఇప్పిస్తానని బిల్డప్‌ ఇచ్చి.. చివరికి ఆయనకు నా నంబర్‌ ఇచ్చాను. మూడేళ్ల ప్రేమ తర్వాత ఆయన లవ్‌లో సీరియ్‌సగా లేడని ఆ బంధాన్ని తెంచుకోవాలనుకున్నాను. అదే సమయంలో ఆయన నా ఫ్యామిలీ అంతటినీ పిలిచి, ఆకాశంలో ఎగిరే బెలూన్‌కు రింగ్‌ కట్టి నాకు ప్రపోజ్‌ చేసిన క్షణం నా జీవితంలో మర్చిపోలేను.


2.jpg

‘మెస్సీ మమ్మీ’గా..

పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మొదటి బిడ్డ హన్స్‌ పుట్టిన తర్వాత నేను ‘పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌’ (ప్రసవానంతర వేదన)కు గురయ్యాను. గ్లామర్‌ తారగా ఉన్న నేను బరువు పెరగడం, శరీర ఆకృతి మారడం నన్ను చాలా కుంగదీశాయి. అద్దంలో నా ముఖం చూసుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. బయటి ప్రపంచానికి ముఖం చూపించడానికి భయపడి ఇంట్లోనే దాక్కున్నాను. కానీ అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎవరి కోసం ఈ గ్లామర్‌ ముసుగు వేసుకోవాలి? అందుకే మేకప్‌ లేని నా ముఖం, రంగు వేయని నా తెల్లజుట్టు, పెరిగిన నా పొట్ట.. వీటన్నింటినీ గర్వంగా ప్రపంచానికి చూపిస్తూ సోషల్‌ మీడియాలో నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ‘మెస్సీ మమ్మీ’గా నాలోని లోపాలను నేను ప్రేమించడం మొదలుపెట్టాక లక్షలాదిమంది మహిళలు నాలో వాళ్లను చూసుకున్నారు. మా అత్తయ్య మంజరితో కలిసి నేను చేసే వీడియోలు మా ఇద్దరి మధ్య బంధాన్ని మాత్రమే కాదు.. మనల్ని మనంఎలా ప్రేమించుకోవాలో నాకు నేర్పించాయి.

ఎక్కడికీ వెళ్లలేదు

సంజయ్‌ దత్‌తో కలిసి తాజాగా చేసిన ‘ఆఖ్రీ సవాల్‌’ సినిమా మే 15న విడుదలైంది. అందరూ ఇది నా కమ్‌బ్యాక్‌ అంటున్నారు. కానీ నా ఉద్దేశంలో నేను ఎక్కడికీ వెళ్లలేదు. సినిమాలకు విరామం మాత్రమే ఇచ్చాను. నా అభిమానుల గుండెల్లో, సోషల్‌ మీడియాలో నేను ఎప్పుడూ ఉన్నాను. షూటింగ్‌ సెట్స్‌లో పనిగంటల గురించి ఇటీవల చాలా చర్చ జరిగింది. దీపిక పదుకొణె వంటివారు షూటింగ్‌ సమయాల గురించి అడుగుతుంటే నేను మద్దతు ఇస్తాను. ఎందుకంటే మాతృత్వం అనేది ఒక పెద్ద బాధ్యత. అయితే షూటింగ్‌కు అందరూ అడ్జస్ట్‌ అవ్వాలి. నిర్మాతను కూడా మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక్క మాట. అందమంటే రంగు, రూపు కాదు.. మన లోపాలు సహా మనల్ని మనం ప్రేమించుకోవడమే అసలైన అందం. అందుకే నేను గర్వంగా చెబుతున్నాను.. ఐయామ్‌ ఎ ప్రౌడ్‌ మెస్సీ మమ్మీ!

Updated Date - May 17 , 2026 | 04:37 AM