Share News

పరిపూర్ణతకు మార్గం

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:29 AM

జీవితంలో విజయాన్ని సాధించడానికి జ్ఞానం అవసరమని అందరూ చెబుతారు. కానీ ఆ జ్ఞానాన్ని సరైన పరిమితిలో, సరైన విధంగా ఉపయోగించే శక్తినే ‘వివేకం’ అంటారు. వివేకమే గురుతత్త్వానికి...

పరిపూర్ణతకు మార్గం

సహజయోగ

జీవితంలో విజయాన్ని సాధించడానికి జ్ఞానం అవసరమని అందరూ చెబుతారు. కానీ ఆ జ్ఞానాన్ని సరైన పరిమితిలో, సరైన విధంగా ఉపయోగించే శక్తినే ‘వివేకం’ అంటారు. వివేకమే గురుతత్త్వానికి అసలు రూపం. గురుతత్త్వం అంటే ఏమిటి? గురు స్థానాన్ని చేరే స్థితిని, స్థాయిని అందుకోవడం. గురువు కావడం అంటే... కేవలం ఇతరులకు బోధించడం కాదు, ముందుగా తననుతాను సమతుల్యంగా మలచుకోవడం. ఆ సమతుల్యతే ఆధ్యాత్మికతమైన ఎదుగుదలకు తొలి మెట్టు. ఒక చిన్న మొక్కను పెంచే తోటమాలిని గమనిస్తే ఈ సత్యం స్పష్టమవుతుంది. మొక్కకు నీరు పోయకపోతే అది ఎండిపోతుంది. అవసరానికి మించి నీరు పోస్తే కుళ్ళిపోతుంది. కాబట్టి ఎంత నీరు అవసరమో అంతే ఇవ్వడం నిజమైన వివేకం. ఇది జీవితానికీ వర్తిస్తుంది. ఏ విషయమైనా అతిగా ఉన్నా, అసలు లేకపోయినా నష్టమే. సమతుల్యత ఉన్నప్పుడే అభివృద్ధి, ఆనందం, ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతాయి.

మొదటి బాధ్యత...

శ్రీ మాతాజీ నిర్మలాదేవి బోధించిన గురుతత్త్వం కూడా ఇదే సూత్రాన్ని మనకు నేర్పుతుంది. సహజయోగం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందిన ప్రతి వ్యక్తిలో గురుతత్త్వం తాలూకు బీజం నాటుకుంటుంది. ఆత్మజ్యోతి వెలిగిన క్షణం నుంచే మనలోని దివ్యశక్తి పని చేయడం ప్రారంభిస్తుంది. అయినప్పటికీ గురుతత్త్వం సంపూర్ణంగా వికసించాలంటే నిరంతర జాగరూకత, ఆత్మపరిశీలన, సమతుల్య జీవనం అవసరం. మనిషి శరీరం పంచభూతాల సమ్మేళనం. భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే అయిదు మూలకాలే మన అస్తిత్వానికి ఆధారం. ప్రకృతిలో ఉన్న ప్రతిదానిలాగానే ఈ మూలకాలకూ క్షీణించే స్వభావం ఉంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో, మనసులో, ఆధ్యాత్మిక జీవితంలో అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే ఆహారంలో, నిద్రలో, మాటల్లో, ఆలోచనల్లో, ప్రవర్తనలో సమతుల్యతను పాటించడం... గురుతత్త్వాన్ని సంరక్షించుకోవడంలో మొదటి బాధ్యత.

అంతరంగంలో మార్పు రావాలి

ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత... ఇక ప్రత్యేకంగా ఎలాంటి సాధన అవసరం లేదని కొందరు భావిస్తారు. కానీ అది సరైన అవగాహన కాదు. ఆత్మసాక్షాత్కారం మనలోని దివ్యత్వాన్ని వెలికి తీస్తుంది. కానీ మానవ స్థాయిలో మన అహంకారం, అలవాట్లు, కోరికలు, బాహ్య ప్రభావాలు మనల్ని తిరిగి అసమతుల్యతవైపు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. కాబట్టి గురుతత్త్వాన్ని నిత్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. గురుతత్త్వం అనేది ఒక హోదా కాదు... అదొక జీవన విధానం. అన్ని పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండడం, ప్రతి నిర్ణయంలో వివేకాన్ని పాటించడం, ప్రతి వ్యక్తిని ప్రేమతో చూడడం, ప్రతి కార్యాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించడం గురుతత్త్వానికి గుర్తులు. మనలో సమతుల్యత ఎంత పెరిగితే... మన మాటల్లో, ప్రవర్తనలో, ఆలోచనల్లో దైవత్వం అంతగా ప్రతిఫలిస్తుంది. నేటి సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూల కారణం అసమతుల్యతే. అధికమైన ఆశ, అధిక కోపం, అధిక పోటీ, అధిక భయం, అధిక ఆందోళన... ఇవన్నీ అంతర్గత సమతుల్యత కోల్పోవడానికి సంకేతాలు. ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యడానికి ముందు... మన అంతరంగాన్ని సమతుల్యంగా మార్చుకోవాలి.


వివేకమే గురుతత్త్వం

‘‘సమతుల్యత ఎందుకు అవసరం? అనే ప్రశ్నకు శ్రీ మాతాజీ ఇచ్చిన సమాధానం ఎంతో గంభీరమైనది. సమతుల్యత లేకుండా ఆధ్యాత్మికంగా పైకి ఎదగడం అసాధ్యం. ఆధ్యాత్మిక పురోగతి లేకపోతే మానవ జన్మ పరమార్థం నెరవేరదు. మనిషి కేవలం జీవించడానికి పుట్టలేదు... తనలోని దివ్యత్వాన్ని తెలుసుకొని, దాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించడానికి జన్మించాడు. గురుతత్త్వాన్ని స్థిరపరుచుకోవడం అంటే... బయట గురువును వెతకడం కాదు... మనలోని వివేకాన్ని, ప్రేమను, క్షమను, వినయాన్ని, సమతుల్యతను ప్రతిరోజూ పెంపొందించుకోవడం. అలాంటి జీవితం వ్యక్తికి శాంతిని, కుటుంబానికి సామరస్యాన్ని, సమాజానికి సద్భావాన్ని, ప్రపంచానికి శాశ్వత శాంతిని అందిస్తుంది. శ్రీమాతాజీ ఇచ్చిన ఈ సందేశం నేటి కాలానికి మరింత అవసరం. వేగం పెరిగిన ఈ యుగంలో మనిషి సమతుల్యతను కోల్పోతున్నాడు. దాన్ని తిరిగి పొందితేనే గురుతత్త్వం మనలో స్థిరపడుతుంది. అప్పుడే మన జీవన ప్రయాణం పరిపూర్ణతవైపు సాగుతుంది. సమతుల్యతే వివేకం, వివేకమే గురుతత్త్వం, గురుతత్త్వమే పరిపూర్ణతకు మార్గం.

డాక్టర్‌ పి. రాకేష్‌

8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ

నిర్మలాదేవి, సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 03:29 AM