ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:51 AM
రంజాన్ మాసం విశిష్టమైన ఒక ఆధ్యాత్మిక శిక్షణ కాలం. ఆ నెలలో ముమిన్ (విశ్వాసి) తన మనస్సును, ఆత్మను, ప్రవర్తనను శుద్ధి చేసుకుంటాడు. ఉపవాసం ద్వారా శరీరం నియంత్రణలోకి...
సందేశం
రంజాన్ మాసం విశిష్టమైన ఒక ఆధ్యాత్మిక శిక్షణ కాలం. ఆ నెలలో ముమిన్ (విశ్వాసి) తన మనస్సును, ఆత్మను, ప్రవర్తనను శుద్ధి చేసుకుంటాడు. ఉపవాసం ద్వారా శరీరం నియంత్రణలోకి వస్తుంది. నమాజ్ ద్వారా మనసు అల్లాహ్ వైపు మళ్ళుతుంది. ఖుర్‌ఆన్ పఠనం ద్వారా ఆత్మ ప్రకాశిస్తుంది. కానీ ఆ పవిత్రమైన మార్పులు రంజాన్ తరువాత కూడా మన జీవితాల్లో కొనసాగుతాయా? అనేదే అసలు ప్రశ్న. రంజాన్ మాసం ముగిసిన వెంటనే చాలామంది తమ పాత అలవాట్లకు తిరిగి వెళ్తారు. కానీ నిజమైన విశ్వాసి రంజాన్ మాసంలో పొందిన ఆధ్యాత్మిక శక్తిని జీవితాంతం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే రంజాన్ అనేది ముగింపు కాదు... ఒక కొత్త ఆరంభం.
పాఠాలు గుర్తుంచుకోవాలి...
రంజాన్... ఒక పాఠశాల లాంటిది. అది మనకు జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిస్తుంది. కానీ నేర్చుకున్న పాఠాలను మరిచిపోతే ప్రయోజనం ఏమిటి? కాబట్టి రంజాన్ తదనంతరం కొనసాగించాల్సిన ముఖ్యమైన కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం: రంజాన్ ప్రధాన లక్ష్యం తక్వా (దైవభక్తి). అల్లాహ్ పట్ల భయం, ప్రేమ కలిగిన జీవితం. ఉపవాసం మనకు దీన్ని నేర్పిస్తుంది. చేసే ప్రతి పనిలోను విశ్వాసి అల్లా్‌హను గుర్తు చేసుకుంటూ ఉండాలి. మాటల్లో, ప్రవర్తనలో, ఆలోచనల్లో అల్లాహ్ మార్గానికి అనుగుణంగా నడచుకోవాలి. అబద్ధం, దుర్మార్గం, అన్యాయం లాంటి వాటికి దూరంగా ఉండాలి. రెండోది... రంజాన్ మాసంలో నిష్ఠగా నమాజ్ చేసేవారిలో చాలామంది ఆ తరువాత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. రోజుకు అయిదుసార్లు నమాజ్ చేయడం ముస్లింలకు ముఖ్యమైన కర్తవ్యం. రంజాన్ నేర్పిన ఈ అలవాటు ఎప్పటికీ కొనసాగాలి. నమాజ్ హృదయానికి శాంతిని, జీవితానికి ఒక క్రమాన్ని ఇస్తుంది. మూడోది... ఖుర్‌ఆన్‌తో అనుబంధాన్ని కొనసాగించడం. రంజాన్ నెలలో ఖుర్‌ఆన్ ఎక్కువగా చదివి, తరువాత పట్టించుకోకపోవడం సరికాదు. ఆ పవిత్ర గ్రంథం కేవలం ఒక నెలకే పరిమితం కాదు. జీవితాలకు మార్గదర్శకమైన గ్రంథం. రోజూ కొద్దిగానైనా ఖుర్‌ఆన్ చదవడం, దాని అర్థం తెలుసుకోవడం, దాని ప్రకారం జీవించడం చాలా అవసరం. ఖుర్‌ఆన్... సత్యాన్ని చూపించే దీపం లాంటిది.
నిజాయితీతో క్షమాపణ కోరాలి...
నాలుగోది.. సదఖా (దానం). రంజాన్ నెలలో జకాత్, సదఖా ఇవ్వడం, పేదలకు సహాయం చేయడం తప్పనిసరి విధి. దాన్ని అంతటితో వదిలెయ్యకుండా... సమాజంలో అవసరమైన వారికి ఎప్పుడూ సాయం చేస్తూ ఉండాలి. ఏ చిన్న సాయమైనా అల్లాహ్ దృష్టిలో గొప్పదే. అది హృదయాలను సున్నితంగా మారుస్తుంది. కరుణను పెంచుతుంది. అయిదోది... రంజాన్ మాసం మనకు స్వీయ నియంత్రణ నేర్పుతుంది. ఆకలి, దాహం, కోపం... ఇవన్నీ నియంత్రించుకోవడం నేర్చుకుంటాం. ఆ తరువాత కూడా అది కొనసాగించాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, చెడు మాటలు మాట్లాడకూడదు. చెడ్డ అలవాట్లను దూరం పెట్టాలి. ఇవన్నీ నిజమైన విశ్వాసి లక్షణాలు. ఆరోది... మంచి స్నేహితులను, మంచి వాతావరణాన్ని ఎంచుకోవాలి. మంచి స్నేహితులు ఉంటే మంచి మార్గంలో ఉంటాం. కాబట్టి మంచి పనులను ప్రోత్సహించే వారితో సావాసం చేయాలి. చెడ్డ అలవాట్లకు దారితీసే వాతావరణానికి దూరంగా ఉండాలి. ఏడోది... తౌబా (పశ్చాత్తాపం). గతంలో చేసిన తప్పులకు రంజాన్ నెలలో పశ్చాత్తాపం ప్రకటించి, దైవాన్ని క్షమాపణ కోరుతాం. కానీ జీవితంలో తప్పులు, పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. కనుక ఎప్పటికప్పుడు అల్లా్‌హను క్షమాపణ అర్థించాలి. నిజాయితీతో చేసే తౌబాను కరుణామయుడైన అల్లాహ్ ఎప్పుడూ స్వీకరిస్తాడు. మన జీవితాలకు శాంతిని ఇస్తాడు. ఈ విధంగా... రంజాన్ మాసంలో నేర్చుకున్న ప్రతి మంచి అలవాటును ఆ తరువాత కూడా అనుసరిస్తే అల్లాహ్ కృప లభిస్తుంది.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి
ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..
IPL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..