Share News

అన్యాయంపైమౌనం నేరం

ABN , Publish Date - Jul 05 , 2026 | 03:18 AM

సమాజంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌. ‘‘చుట్టూ అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు విప్పకపోవడమే అన్నిటికంటే పెద్ద తప్పు.

అన్యాయంపైమౌనం నేరం

సమాజంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌. ‘‘చుట్టూ అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు విప్పకపోవడమే అన్నిటికంటే పెద్ద తప్పు. మౌనంగా ఉన్నవాళ్లను చరిత్ర ఎప్పటికీ క్షమించదు’’ అని చెప్పే ప్రకాష్‌ సోషల్‌ మీడియాలో తనపై కనిపించే వ్యతిరేకత కేవలం భ్రమేనంటారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారంటున్న ఆయన ‘నవ్య’తో తన సినిమాల గురించి, రాజకీయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది?

రాజమౌళి నిర్మిస్తున్న ‘వారణాసి’లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను. ధనుష్‌ నిర్మాణంలో వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నా. ‘జైభీమ్‌’ దర్శకుడు, సూర్య, నేను కలిసి మరో సినిమా చేస్తున్నాం. అక్టోబర్‌ రిలీజ్‌ కోసం సిద్ధమవుతున్న హిందీ ‘దృశ్యం 3’ షూటింగ్‌ పూర్తయింది. అలాగే ‘ఎల్‌ఎల్‌ఎంఏ’ అనే ప్రాజెక్ట్‌ ప్రారంభం అవుతోంది. దర్శకుడు క్రిష్‌ సినిమా షూటింగ్‌ కూడా పూర్తిచేశాను. అంతా బిజీబిజీగా ఉంది.

‘వారణాసి’ ఒక పెద్ద సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌ కదా?

అవును, ఎందుకంటే నిజానికి నేను ‘వారణాసి’ సినిమా చేస్తానని అనుకోలేదు. గతంలో నేను రాజమౌళితో ‘విక్రమార్కుడు’ సినిమా చేశాను. వారణాసిలో నేను ఆయనకు అవసరమవుతానని అస్సలు అనుకోలేదు. ఆయన సినిమాల స్కేల్‌, ప్లానింగ్‌ వేరేలా ఉంటాయి. ‘వారణాసి’ గురించి ఆయన దగ్గర నుంచి ఫోన్‌ రాగానే ఆశ్చర్యపోయాను. ‘‘ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. మీలాంటి నటుడు కావాలి’’ అన్నారు. ఇక... నేను ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ పూర్తి చేశాను. సెప్టెంబర్‌ వరకు మరో రెండు, మూడు చిన్న షెడ్యూల్స్‌ ఉన్నాయి. దాంతో నా పాత్ర వరకు పూర్తయినట్లే!

సినిమాల్లో ఎక్కడో ఒకచోట మిమ్మల్ని మీరు రిపీట్‌ చేసుకుంటున్నారనే భయం లేదా?

కొన్నిసార్లు జరుగుతుంది. కొంతమంది దర్శకులు ‘‘నాకు ఆ పాత మేనరిజమే కావాలి సర్‌’’ అని అడుగుతుంటారు. నేను రకరకాల పాత్రల్లో నటించాను. ఒక పాత్ర పాపులర్‌ కాగానే... ‘‘‘ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో ఇష్టపడ్డారు కాబట్టి మళ్లీ అలా ట్రై చేయండి’ అని అడుగుతారు. అలాంటప్పుడు మనల్ని మనం రిపీట్‌ చేసుకోవాల్సి వస్తుంది. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు... బిజినెస్‌ కూడా. నేనే కాదు... హీరోలు తమను తాము రిపీట్‌ చేసుకుంటారు. యాక్షన్‌ సీన్స్‌ రిపీట్‌ అవుతుంటాయి. కాబట్టి ఇందులో బాధపడడానికి ఏమీ లేదు.


మీకు వృత్తికి, భావజాలానికి మధ్య వైరుధ్యం కనిపిస్తుందా?

పరిశ్రమలోకి వచ్చినప్పుడు నేను ఎవరికీ తెలియదు. కానీ మూడు దశాబ్దాల తర్వాత నా వ్యక్తిత్వమేమిటో తెలియాలి కదా! నా సినిమా పాత్రల ద్వారా మాత్రమే కాకుండా... నేను నిజ జీవితంలో ఎలాంటి వాడిననే విషయం కూడా అందరూ అర్ధం చేసుకోవాలి కదా! కొన్ని సార్లు నా భావజాలం వల్ల వృత్తిపరంగా కొన్ని కోల్పోవచ్చు. కానీ ప్రజలు ఇప్పుడు నన్ను నటుడిగా మాత్రమే చూడఢం లేదు.. ఒక యాక్టివిస్ట్‌‌గా చూస్తున్నారు. అదే నా వ్యక్తిత్వం.

సోషల్‌ మీడియాలో మీమీద ఎప్పుడూ వివపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతూ ఉంటుంది కదా...

సోషల్‌ మీడియా అనేది ఒక అబద్ధం, ఒక భ్రమ. నేను ప్రతి రోజూ- ఎయిర్‌పోర్టులు, హొటల్స్‌, మాల్స్‌- ఇలా ఏదో ఒక చోటకు ఒంటరిగానే వెళ్తూ ఉంటా. ఇప్పటిదాకా ఒక్కరు కూడా వచ్చి నా మొహం మీద నన్ను విమర్శించలేదు. నేను ఫ్లైట్‌లో వెళ్లేటప్పుడు నాతో పాటు వందలమంది ఉంటారు. వారిలో చాలా మంది నా దగ్గరకు వచ్చి నా నటనను ప్రశంసిస్తారు. పెద్దవాళ్లైతే - ‘‘నువ్వే మా ఆశ’’ అంటారు. కుర్రాళ్లు ‘మీరే మాకు స్ఫూర్తి’’ అంటారు. నాకు నిజమైన బలం వారే... నా తోటి ప్రజలే!

కానీ సోషల్‌ మీడియా ఖాతాల్లో తిడుతూ చాలా కామెంట్లు కనిపిస్తూ ఉంటాయి...

నా ‘ఎక్స్‌’ అకౌంట్‌ ఒకసారి చూడండి. రీట్వీట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ రీట్వీట్ల కన్నా లైకులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కామెంట్‌ సెక్షన్‌లోకి వెళ్లి చూస్తే.. 800 కామెంట్లు ఉన్నచోట 200 మంది నన్ను తిడుతూ ఉండొచ్చు. కానీ మిగిలిన 600 మంది నాపై ప్రేమ చూపిస్తారు. నన్ను ఇష్టపడని వాళ్లు కూడా నేను ఏం చెబుతున్నానో తెలుసుకోవడానికి నన్ను ఫాలో అవుతుంటారు. అంటే నేను వాళ్లతో కనెక్ట్‌ అవుతున్నానని, నా మాట వారికి చేరుతోందని అర్థం.

సమాజంలో జరిగే విషయాలపై ఇలా గళం విప్పేలా, ట్వీట్లు చేసేలా మీకు ప్రేరణ కలిగించేది ఎవరు?

అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం నా బాధ్యత. నా మనస్సాక్షే నన్ను గళం విప్పేలా చేస్తుంది. భవిష్యత్తులో చరిత్ర రాసేటప్పుడు... తప్పుచేసిన వాళ్లనైనా ఈ సమాజం క్షమించి వదిలేస్తుందేమో కానీ చుట్టూ అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకుని మౌనంగా ఉన్నవాళ్లను మాత్రం క్షమించదు. అందుకే నేను మౌనంగా ఉండను. నేను గురువుల్లా భావించే అంబేద్కర్‌, పెరియార్‌, లంకేశ్‌, నెల్సన్‌ మండేలా, చేగువేరాలు నాకిది నేర్పించారు. నన్ను మలిచారు. వారే నాకు స్ఫూర్తి. ఇంకా చెప్పాలంటే నేను వారి ఆలోచనలకు వారసుడిని. వారి పుత్రుడిని.


మీ అమ్మగారి మరణం మీకు తీరని లోటు కదా... బయట పడ్డారా?

లేదు. ఎందుకంటే అది ఒక రోజు అనుబంధం కాదు. అనేక దశాబ్దాల నా జీవన ప్రయాణం. ఇప్పటికీ నేను ఇంటికి వస్తే- తెలియకుండా మా అమ్మ ఉందనే ఊహతో ఆమె గదికే వెళ్తాను. నేనే కాదు... నా భార్య, మా పిల్లలు కూడా ఆ షాక్‌ నుంచి కోలుకోలేదు. మా అబ్బాయికి అమ్మతో ఎటాచ్‌మెంట్‌ చాలా ఎక్కువ. వాడిలో ప్రస్తుతం మరణం గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటిని తీర్చే బాధ్యత మాదే! దాని కోసమే ప్రయత్నిస్తున్నాం. నా భార్యకు కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ మరణించిన మర్నాడు తనకు ‘మా ఇంటి బంగారం’ సినిమా సాంగ్‌ షూటింగ్‌ ఉంది. మన వ్యక్తిగత బాధల వల్ల ఇతరులు నష్టపోకూడదని... అంత్యక్రియలు పూర్తయిన వెంటనే షూటింగ్‌కి వెళ్లిపోయింది.

ఢిల్లీలో సీజేపీ (కాక్రోచ్‌ జనతా పార్టీ) నిరసనకారుల మీద విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్నారని, పాకిస్థానీలని, ఉగ్రవాదులని ముద్ర వేస్తున్నారు. ‘కాక్రోచ్‌ పార్టీ’ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. వాళ్లు మందిర్‌, మసీద్‌ రాజకీయాలు చేయడం లేదు. ఐడియాలజీల గురించి మాట్లాడడం లేదు. ఈ దేశంలోని పెద్దలపై తమకు గౌరవం పోయిందని, తమ విద్యార్థులు చనిపోయారని, విద్యాశాఖ మంత్రి జవాబుదారీగా ఉండాలని ఒక వ్యవస్థపై పోరాడుతున్నారు. అవి విచ్ఛిన్నకర రాజకీయాలు ఎలా అవుతాయి? నిరసనలు చేస్తున్న యువతే మన దేశ భవిత అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. గౌరవించాలి. వారిని బెదిరించి అణచివేయాలని చూడడం సరికాదు.

3.jpg

పవన్‌ కల్యాణ్‌పై తరచూ ట్వీట్‌లు చేయటం వెనక కారణమేమిటి? వ్యక్తిగతంగా సమస్య ఏదైనా ఉందా?

నాకు, ఆయనకు వ్యక్తిగతంగా ఎటువంటి వైరం లేదు. జనసేన మొదటి రోజుల్లో నాకు ఆయనపై అనేక ఆశలు ఉండేవి. ఆ తర్వాత ఆయన ఒక కూటమితో పొత్తుపెట్టుకున్నారు. గతంలో మేమిద్దరం నటించిన ఒక షూటింగ్‌ సమయంలో ఆయన నాతో- ‘‘ మీరు చాలా బాగా మాట్లాడతారు. కొన్ని కారణాల వల్ల నేను వారితో వెళ్లాల్సి వస్తే... అప్పుడు నేను మీకు వ్యతిరేకం అవుతానేమో. దానికి మీరు సిద్ధంగా ఉండండి’’ అని ఆయనే చెప్పారు. ఆ తర్వాత ఆయన ఐడియాలజీ మారిపోయింది. ఆయన ఐడియాలజీకి నేను వ్యతిరేకిని. ఆయన తీసుకొనే నిర్ణయాలను నేను ఒక పౌరుడిగా ప్రశ్నిస్తా. దానికి సమాధానం చెప్పకుండా నన్ను సోషల్‌ మీడియాలో కొందరు ట్రోల్‌ చేస్తారు. నా నోరు మూయించాలని ప్రయత్నిస్తారు. నేను ఈ బెదిరింపులకు భయపడేవాడిని కాదు.


ఈ రోజు మన దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ‘నమ్మకం కోల్పోవడం’.. నేతల మీద, వ్యవస్థల మీద నమ్మకం పోయింది. మతానికి పెద్ద పీట వేస్తున్నారు. చివరకు క్రికెట్‌లో కూడా మతాన్ని తెచ్చేస్తున్నారు. ఒక ముస్లిం ఆటగాడు మ్యాచ్‌లో వికెట్లు తీయకపోతే చాలు... అతడిని పాకిస్థానీ అని, కావాలనే వాళ్లకి అనుకూలంగా ఆడాడంటూ దేశద్రోహి ముద్రలు వేసేస్తున్నారు. ఒకప్పుడు మహమ్మద్‌ రఫీ పాడుతుంటే అందరూ మైమరచి వినేవారు. అప్పుడు ఆయన జాతిగానీ, మతంగానీ చూడలేదు. షారుఖ్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ సూపర్‌స్టార్లు అయినప్పుడు దేశ ప్రజలు వారి మతాన్ని చూడలేదు. కానీ ఇప్పుడు కొందరు ప్రతీ దానికి మతం రంగు పూస్తున్నారు.

ఈ దేశంలో రాజకీయాలు నడుస్తున్నదే ఫేసెస్‌, కటౌట్స్‌ మీద! సామాన్యుడు ఇక్కడ ప్రధానమంత్రిని ఎన్నుకోడు. కానీ, ‘‘ఈ ముఖం చూసి ఓటేయండి’’ అని నాయకులే చెబుతారు. ఉదాహరణకు విజయ్‌ లాంటి వాళ్లు ‘‘నా కటౌట్‌ చూసి ఓటేయండి’’ అంటారు. పవన్‌ కల్యాణ్‌ ‘‘నన్ను చూసి మీ నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించండి’’ అంటారు. అంటే ప్రజల ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలి కదా! ప్రశ్న అడిగినప్పుడు అది వ్యక్తిగతం ఎందుకు అవుతుంది? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి దూరి ప్రశ్నలు సంధించలేదు. నేను ఎవరినీ ‘‘నువ్వు ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నావు?’’ అని అడగలేదు. వాళ్ల అలవాట్లు, తిండి, వేసుకునే దుస్తుల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది వారి వ్యక్తిగతం. నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా... ‘‘అడగానికి నువ్వెవరు?’’, ‘‘నీ వెనుక ఎవరున్నారు?’’ అని ఎదురు ప్రశ్నిస్తారు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఎలా అవుతుంది? జవాబుదారీతనం ఎలా అవుతుంది?

మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, చరణ్‌, రజనీకాంత్‌, విజయ్‌లాంటి పెద్ద హీరోలతో పనిచేయడం వల్ల... వాళ్లతో పాటు నాకు కూడా స్టార్‌డమ్‌ వచ్చింది. ప్రకాశ్‌రాజ్‌ ఒక్కడే నటిస్తే సినిమా హిట్‌ అవదు. ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను. బిగ్‌ స్టార్స్‌, బిగ్‌ డైరెక్టర్స్‌ కాంబినేషన్స్‌ మాత్రమే ఇక్కడ పనిచేస్తాయి.


నేను నా ప్రతిభ వల్ల మాత్రమే ఈ స్థాయికి రాలేదు. ప్రేక్షకుల ప్రేమ వల్ల కూడా నేను ఎదిగాను. వాళ్లు మనల్ని గుర్తించకపోతే మనం ఎక్కడ ఉంటాం? అయితే నేను కేవలం ఒక గాజు భవంతిలోనో, సినీ మాయా ప్రపంచంలోనో బతకడం లేదు. వాస్తవిక సమాజంలో బతుకుతున్నా. నా చుట్టుపక్కల అన్యాయం జరుగుతున్నప్పుడు నేను మాట్లాడతాను. అప్పుడే- ‘నేను బతికి ఉన్నాను, నేను కూడా మనిషిని’ అని నాకు అనిపిస్తుంది.

అందరినీ మెప్పించడానికి నేను బతకడం లేదు. నేను ఏదో కోల్పోతున్నానని చూసేవాళ్లు.. నేను ఏం పొందానో కూడా చూడాలి కదా! ప్రతీది కోల్పోవడానికి నేనేమీ పిచ్చివాడిని కాదు. ఒకవైపు ఏదైనా కోల్పోతే, సమాంతరంగా నేను మరొకటి పొందుతున్నాను. దానివల్ల నాకు కలిగే ఆనందం... ‘నువ్వు అన్నీ కోల్పోతున్నావు’ అని వాపోయేవాళ్లకు బహుశా అర్థం కాకపోవచ్చు.

వాంగ్‌చుక్‌తో నేను ఈ మధ్యనే సుదీర్ఘంగా సంభాషించా! ఆయన నీట్‌ పరీక్ష ప్రక్రియలోని అన్యాయాల గురించి మాత్రమే మాట్లాడడం లేదు... మొత్తం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాడు. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోవడం గురించి మాట్లాడుతున్నాడు. వ్యవస్థలపై రాజకీయ పార్టీలు, నాయకులు పెడుతున్న ఒత్తిడి గురించి మాట్లాడుతున్నాడు. పిల్లల భవిష్యత్తు ఏమయిపోతుందో అనే భయంతో మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తిపై ‘టెర్రరిస్ట్‌’ అనే ముద్ర వేయటం కన్నా అన్యాయం ఇంకేమి ఉండదు!

Updated Date - Jul 05 , 2026 | 03:18 AM